గోదావరిలో మృతదేహాలు గుర్తింపు
ముమ్మిడివరం: అమలాపురంలో అదృశ్యమైన ముగ్గురు యువకుల కథ విషాదంతమైంది. ఆ ముగ్గురూ గోదావరి నదిలో విగతజీవులుగా తేలారు. వివరాల్లోకి వెళ్తే.. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం గ్రామీణ మండలం శెట్టిపేటకు చెందిన కూడిపూడి ప్రేమ్‌సాగర్ (17), మామిడిశెట్టి బాలవెంకట రమణ(19), డి.ఫణికుమార్ (19) స్నేహితులు. బుధవారం ఈ ముగ్గురూ అమలాపురం నుంచి ముమ్మిడివరం మండలం గేదెల్లంక ఉత్తర వాహిణీ పుష్కర రేవు వద్దకు స్నానాలకు వెళ్లి గోదావరిలో గల్లంతయ్యారు.
అయితే ఈ ముగ్గురూ ఎక్కడికి వెళ్లారనే విషయంపై కుటుంబ సభ్యులకు సమాచారం లేకపోవడంతో ఆచూకీ కోసం ఎంత ప్రయత్నించినా జాడ తెలియరాలేదు. దీంతో గురువారం వారి తల్లిదండ్రులు అమలాపురం గ్రామీణ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో యువకుల మొబైల్‌కు కాల్ చేయగా ఓ పశువుల కాపరి వాళ్ల ఫోన్‌లో మాట్లాడారు. పుష్కర రేవు వద్ద ద్విచక్రవాహనంపై బట్టలు, ఫోన్లు ఉన్నాయని.. నదిలో ఓ మృతదేహం తేలియాడుతోందని అతడు చెప్పాడు. ఓ వైపు పోలీసులు కూడా ఆ యువకుల సెల్‌ఫోన్ సిగ్నళ్లను గేదెల్లంకలో గుర్తించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అనంతరం పోలీసులు, కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకొని యువకుల మృతదేహాలను గుర్తించారు. ముమ్మిడివరం, అమలాపురం ఎస్సైలు సీహెచ్ రాజేష్, నాగార్జున ఆధ్వర్యంలో మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.