గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: ఆటోల్లో ప్రయాణికుల ముసుగులో చోరీలు చేసే ముగ్గురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. దక్షిణ వలయ విభాగ డీఎస్పీ జెస్సీ ప్రశాంతి తన కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను తెలిపారు. మేడికొండూరుకు చెందిన పి.సదాశివరావు గత డిసెంబర్ 30న తన బంగారు వస్తువులు పాలడుగులోని బ్యాంకులో తనఖా పెట్టడానికి బయలుదేరారు. మేడికొండూరు సెంటర్‌లో ఆటో ఎక్కాడు. అప్పటికే అందులో కొందరు ప్రయాణికుల వలే ఉన్నారు. ఆటో కొంతదూరం వెళ్లగానే ఆటోడ్రైవర్ తాము పాలడుగు వైపు వెళ్లడంలేదని దింపేసి వెళ్లిపోయారు. ఆటో దిగిన సదాశివరావు తన జేబులో చూడగా బంగారపు వస్తువులు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీఎస్పీ పర్యవేక్షణలో మేడికొండూరు పోలీసులు, నేరవిభాగ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిఘానేత్రాల్లో లభించిన ఆధారాలతో విచారిస్తే పాతనేరస్థుల పనిగా తేలింది. గుంటూరు నగరంపాలెంకు చెందిన దర్శనపు చరణ్, ఫిరంగిపురంనకు చెందిన ప్రస్తుతం పాతగుంటూరులో ఉంటున్న పసుపులేటి మేరి, గుంటూరు అంకిరెడ్డిపాలెంకు చెందిన మల్లెల శౌరమ్మలు నిందితులుగా తేలడంతో వారిని అరెస్టు చేశామన్నారు. వారి వద్ద బంగారపు వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులను నవంబర్‌లో లాలాపేట పోలీసులు అరెస్టు చేయగా బెయిల్‌పై వచ్చి మళ్లీ నేరాలకు పాల్పడ్డారని చెప్పారు. సీఐ ఆనందరావు, ఎస్‌ఐలు నరహరి, కోటేశ్వరరావు, సిబ్బంది నజీర్, శ్రీలక్ష్మి, ప్రశాంత్‌రెడ్డి, కృష్ణా, జాన్‌సైదా, శ్రీకాంత్‌లను డీఎస్పీ అభినందించారు.