తూప్రాన్: తాగుడుకు బానిసైన ఇడ్లీల వ్యాపారి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం తూప్రాన్ పురపాలికలో చోటు చేసుకుంది. తూప్రాన్ ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపిన వివరాలు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా రాజుపాలెం గ్రామానికి చెందిన కన్న గంగరాజు (35) ఇరవై ఏళ్ల క్రితం కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఇక్కడే ఉంటూ ఇడ్లీలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. కొంతకాలంగా అతడు మద్యానికి బానిసయ్యాడు. మంగళవారం రాత్రి మద్యం మైకంలో స్థానిక కల్లు దుకాణం సమీపంలో పురుగు మందు తాగి పడిపోయాడు. గమనించిన స్థానికులు కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి అతడిని చికిత్స నిమిత్తం తూప్రాన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స నిమిత్తం అర్ధరాత్రి సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున చనిపోయినట్లు ఎస్ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు చెప్పారు.