అన్నకి సందేశం పంపి యువకుడి అదృశ్యం
పాయకరావుపేట, న్యూస్‌టుడే: ‘నేను అనుకున్న లక్ష్యాన్ని చేరలేననే భయం నన్ను వెంటాడుతోంది... తల్లిదండ్రులకు దుఃఖాన్ని మిగుల్చుతున్నా..’అంటూ తన అన్నయ్య చరవాణికి మెసేజ్ పంపిన ఆ విద్యార్థి అదృశ్యమయ్యాడు. పాయకరావుపేట మండలం రత్నాయంపేట తీరప్రాంతంలో తన ద్విచక్రవాహనాన్ని వదిలేశాడు. దీంతో తల్లిదండ్రులతోపాటు కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలైంది. కుటుంబ సభ్యులు, ఎస్‌ఐ దీనబంధు కథనం ప్రకారం...
తూర్పుగోదావరి జిల్లా తునిలోని గరువువీధికి చెందిన కె.మోహిత్‌కుమార్ (20) రాజమహేంద్రవరం సమీపంలోని రాజానగరంలోని జీఎస్‌ఎల్ మెడికల్ కళాశాలలో ఫిజియోథెరపీ మూడో సంవత్సరం చదువుతున్నాడు. కళాశాల నుంచి బైకుపై శనివారం రాత్రి తుని వచ్చాడు. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియదు. ఇంట్లో వారికి తెలియకుండా గ్రిల్స్‌లోంచి బ్యాగు, ఇతర వస్తువులు లోపల వేశాడు. ఆ తర్వాత ద్విచక్రవాహనం తీసుకుని బయటకు వెళ్లాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత 2.30 సమయంలో అతని అన్నయ్య ఆదర్శకుమార్ చరవాణికి మోహిత్‌కుమార్ సంక్షిప్త సమాచారం పంపాడు. తల్లిదండ్రులు ఆశించిన స్థాయిలో తాను చదవలేకపోతున్నాని, ద్విచక్రవాహనం పాల్మన్‌పేట తీరప్రాంతంలో ఉంచానని అందులో పేర్కొన్నాడు. దీంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు తీరప్రాంతానికి చేరుకున్నారు. రత్నాయంపేట సముద్రపు ఒడ్డున ఉన్న జెట్టీ పక్కన బైకు గుర్తించారు. యువకుడి ఆచూకీ కానరాలేదు. ఆ ప్రాంతమంతా గాలించారు. ఈవిషయాన్ని ఆదర్శకుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై దీనబంధు చెప్పారు.
ఎవరితో కలవలేక పోతున్నా...
‘అమ్మ, నాన్న కష్టపడి చదివిస్తున్నారు.. బాగా చూసుకుంటున్నారు..అడిగినవన్నీ కొనిస్తున్నారు.. కానీ నేను ఎవరితోనూ కలవలేకపోతున్నా. నన్ను క్షమించండి. ఒంటరిగా ఇబ్బంది పడుతున్నాను. నా ఇబ్బందులు ఎవరికీ చెప్పుకోలేను. నాకు ఇష్టమైన ప్రదేశంలో నా జీవితాన్ని ముగించాలనుకుంటున్నాను’ అంటూ తన ఆవేదనను ఆ సంక్షిప్త సందేశంలో పొందుపర్చాడు. కొవిడ్ కారణంగా మోహిత్‌కుమార్ ఇన్నాళ్లు ఇంటి వద్దే ఉన్నాడు. పరీక్షలు దగ్గర పడుతుండటంతో చదువుకోవడానికి వీలుగా ఉంటుందని నాగులచవితికి ముందు రోజు వసతిగృహంలో ఉండేందుకు వెళ్లాడు. శనివారం సాయంత్రం వరకు అందరితోనూ బాగానే ఉన్నాడు. ఆ తర్వాత బైకుపై తుని వచ్చినట్లు తెలిసింది. యువకుడు ఏమయ్యాడనే దానిపై సందిగ్ధం నెలకొంది. పెంటకోట మెరైన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. సోమవారం సముద్రంలో గాలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.