బెంగళూరు: ఓ ఇంట్లో దొంగతనం చేసి పారిపోతున్న వ్యక్తులను పోలీసులు సినీ ఫక్కీలో స్థానికుల సాయంతో పట్టుకున్నారు. కర్ణాటకలోని చిక్‌మగళూర్‌కు చెందిన చంద్రగౌడ అనే వ్యక్తి ఇంట్లో నగలు, నగదు దొంగిలించి పారిపోతున్న ఇద్దరు దుండగులను గమనించిన స్థానికులు వారిని వెంబడించారు. వారిపై రాళ్లు విసిరారు. అయితే స్థానికులపై దాడి చేసేందుకు నిందితులు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే వారు పోలీసులకు సమాచారం అందించగా వారు వెంటనే వచ్చి స్థానికుల సాయంతో దొంగలను అరెస్టు చేశారు. నిందితులను సచిన్, మోహన్‌గా గుర్తించారు. అయితే చంద్రగౌడకు సచిన్ బంధువని పోలీసులు తెలిపారు. సచిన్‌కు, చంద్రగౌడకు మధ్య ఆస్తి విషయంలో గొడవలు ఉన్నాయని, ఈ క్రమంలోనే ప్రతీకారంతో దొంగతనం చేశాడని వెల్లడించారు. ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.