close
Published : 05/03/2021 01:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అందుకే సీరియల్స్‌లో నటించడం లేదు: సాగర్‌

‘మొగలి రేకులు’ సీరియల్‌లోని ఆర్కేనాయుడి పాత్రలో నటించి ఫ్యామిలీ ఆడియన్స్‌లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్‌ సొంత చేసుకున్నారు నటుడు సాగర్‌. ప్రస్తుతం సాగర్‌ సీరియల్స్‌ మానేసి సినిమాల బాటలో పయనిస్తున్నారు. గతంలో ‘సిద్ధార్థ’ అనే సినిమాలో హీరోగా నటించినా ఆశించిన బ్రేక్‌ రాలేదు. దీంతో ‘షాదీ ముబారక్‌’ అంటూ ఒక రొమాంటిక్‌ కామెడీ చిత్రంలో నటించారు. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు బ్యానర్‌పై మార్చి 5న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా నటుడు సాగర్‌ సినిమా విశేషాలను విలేకరులతో పంచుకున్నారు.

ఆయన బ్యానర్‌లో విడుదలవుతున్నందుకు సంతోషం..

ఈ సినిమా దిల్‌రాజుగారి బ్యానర్లో విడుదల చేస్తుండడంతో చాలా సంతోషంగా ఉంది. కచ్చితంగా ఈ సినిమాతో కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుంటా.  నేనీ స్థాయికి రావడానికి వారి అభిమానమే కారణం. సినిమాలో పూర్తి వైవిధ్యమున్న పాత్ర చేశా. ఈ సినిమాపై బాగా నమ్మకం ఉంది. మంచి కంటెంట్‌తో రావాలనే ఉద్దేశంతోనే ఇంత ఆలస్యంగా సినిమా చేశా.

నిజ జీవిత పాత్రలే మా సినిమాలో కనిపిస్తాయి..

‘షాదీ ముబారక్‌’ సినిమా గురించి చెప్పాలంటే ఇందులో జరిగే సంఘటనలు మన నిజజీవితాల్లో కూడా అప్పుడప్పుడూ జరుగుతుంటాయి. పెళ్లి చూపులకు వెళ్లే క్రమంలో ఇద్దరు తెలియని వ్యక్తుల మధ్య చోటుచేసుకునే సరదా సంఘటనల సమాహారమే  ఈ చిత్రం. ప్రేక్షకులు మా పాత్రలతో కనెక్ట్‌ అవుతారు.

పెళ్లంటే అదొక్కటే కాదు..

మా సినిమా ట్రైలర్‌లో హీరోయిన్‌ ‘పెళ్లంటే సేఫ్‌ సెక్స్‌’ అని ఒక డైలాగ్‌ అంటుంది. కానీ సినిమాలో దానికి ఒక సందేశాత్మక వివరణ ఉంటుంది. సినిమా చూస్తేనే అదేంటో తెలుస్తుంది.

సీరియల్స్‌లో ఎందుకు నటించట్లేదంటే..

సీరియల్స్‌లో నాకు మంచి స్టార్‌డమ్‌ ఉంది. వాటిలో ఒక రేంజ్‌ పాత్రలే చేశాను. అలా చేసుకుంటూ వెళ్తే తర్వాత చేయడానికి అంత స్థాయిలో పాత్రలు దొరక్కపోవచ్చు. అందుకే సీరియల్స్‌ మానేసి సినిమాల పైనే దృష్టి పెట్టాను. ఒక ప్రయత్నంగా చేసిన ‘సిద్ధార్థ’లో కూడా సీరియల్‌ తరహా క్యారెక్టరే చేయడం వల్ల అనుకున్న ఫలితం పొందలేకపోయా. అందుకే కొంచెం కొత్తగా ఉండాలనే ఉద్దేశంతో ‘షాదీ ముబారక్‌’ చేశాను. ప్రస్తుతం అయితే సీరియల్స్‌లో నటించే ఉద్దేశం లేదు. దృష్టంతా సినిమాలపైనే ఉంచాను.

కథ వినగానే ఓకే చెప్పేశా..
డైరెక్టర్‌ పద్మశ్రీ గారు మంచి రచయిత. ఎన్నో సినిమాలకు కృష్ణవంశీగారి దగ్గర పనిచేశారు. మొదట ఈ కథను కృష్ణవంశీగారే తెరకెక్కిద్దామనుకున్నారు. చాలా మంది హీరోలు కూడా ఈ కథను విన్నారు. ఆ తర్వాత కొన్నాళ్లకు దిల్‌రాజుగారిని కలిశాం. అయితే కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. ఇప్పుడు సినిమా పూర్తయ్యాక ఫస్ట్‌కాపీ దిల్‌రాజుగారికి చూపించగానే ఎంతో మెచ్చుకున్నారు. ఈ సినిమాతో హీరోగా నేను ఇండస్ట్రీలో నిలబడతానన్నారు. అంతేకాక సినిమా విడుదల చేసేందుకు ముందుకొచ్చారు.

సినిమా ఆసాంతం నవ్వుతూనే ఉంటారు..

సినిమాలోని ప్రతి క్యారెక్టరు ప్రేక్షకులను నవ్విస్తుంది. భావోద్వేగ సన్నివేశాలు కూడా ఆకట్టుకుంటాయి.  అలాగే సంగీత దర్శకులు సునీల్‌ కశ్యప్‌ కథకు తగినట్టుగా మంచి సంగీతం ఇచ్చారు. ఇందులోని పాటలు సినిమాకు మరో బలం. నేపథ్య సంగీతంతో కూడా ఆకట్టుకున్నారు. ఈ సినిమాలో డ్యాన్స్‌ చేయలేదు కానీ  వచ్చే సినిమాలో నేనొక మంచి డ్యాన్స్‌ మూవ్‌మెంట్స్‌తో మిమ్మల్ని మెప్పిస్తా.

ఇక్కడ చాలా కొత్తగా అనిపిస్తుంది..

సీరియల్స్‌ చేస్తునప్పుడు నటనొక్కటే నా పని. మిగతా విషయాలు ప్రొడక్షన్‌ వాళ్లు చూసుకునేవారు. కానీ సినిమా చేస్తునప్పుడు ఇక్కడుండే కష్టాలు అర్థమయ్యాయి. కథ నుంచి సినిమా పూర్తయ్యాక ఎలా ప్రమోషన్‌ చెయ్యాలి, ఎలా ప్రేక్షకుల దాకా తీసుకెళ్లాలి అని ప్రతిదీ ఎంతో కష్టంతో కూడుకున్న పని. నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నా.

సామాజిక స్పృహ అలవడింది..

లాక్‌డౌన్ టైంలో అందిరిలాగే నేనూ ఇంటికే పరిమితమయ్యా. నా వైపు నుంచి ఇతరులకు ఎంత సహాయం చెయ్యాలో అంతా చేశా. రోజూ పేపర్‌ చూస్తూ ఏం జరుగుతుందని తెలుసుకోవడం వల్ల సామాజిక స్పృహ పెరిగింది.

త్రిష్యా రఘునాథ్‌ మన పక్కింటి అమ్మాయిలా ఉంటుంది..

ఈ చిత్రంలో హీరోయిన్‌ పాత్ర హీరోతో సమానంగా ఉంటుంది. ఆ రోల్‌ కోసం ఎంతోమందిని ఆడిషన్‌ చేశాం. చివరిగా త్రిష్యా రఘునాథ్‌ను ఎంపిక చేశాం. ఆ పాత్రకు తను పూర్తి న్యాయం చేసింది. ముఖ్యంగా ఎమోషనల్‌ సీన్స్‌లో ఎంతో సహజంగా నటించింది. ఆ పాత్రకోసం తెలుగు కూడా నేర్చుకుంది.

దిల్‌రాజుగారితో సినిమా ఉండొచ్చేమో!

కచ్చితంగా మంచి స్క్రిప్ట్‌ ఉంటే దిల్‌రాజుగారు సపోర్ట్ చేస్తారు. అందుకు ఈ ‘షాదీముబారక్‌’నే ఉదాహరణ. భవిష్యత్తులో అన్నీ కలిసొస్తే ఆయన బ్యానర్‌లో హీరోగా చేస్తా. నా తదుపరి చిత్రానికి గౌతమ్‌మేనన్‌ అసిస్టెంట్‌ దర్శకత్వం చేయనున్నారు. అదొక యాక్షన్‌ చిత్రం.

ఆర్కే నాయుడి తరహాలో ఉండే పాత్రలూ చేస్తా..

‘మొగలి రేకులు’ సీరియల్‌ నేను చేసిన ఆర్కేనాయడి పాత్ర ఎంతో గంభీరమైనది. అలాంటి పాత్రలు సినిమాల్లో తక్కువగా ఉంటాయి. కచ్చితంగా మంచి స్క్రిప్ట్‌ వస్తే ఆ తరహా పాత్రలో నటిస్తా. ఆర్కే నాయుడి పాత్ర ఛాయల నుంచి బయటకు రావడానికి నాకు ఐదేళ్లు పట్టింది. అలాగే ఈ సినిమాలో నా పాత్రకు నేనే డబ్బింగ్‌ చెప్పుకున్నా. నా వాయిస్‌ అయితేనే బాగుంటుంది. ‘షాదీ ముబారక్‌’ కచ్చితంగా సక్సెస్‌ సాధిస్తుందని భావిస్తున్నా.
 

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని