వివాహ బంధానికి వీడ్కోలు
close
Updated : 05/05/2021 02:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వివాహ బంధానికి వీడ్కోలు

ధార్మిక కార్యక్రమాలు ఉమ్మడిగానే నిర్వహిస్తాం
బిల్‌గేట్స్‌, మెలిందా సంయుక్త ప్రకటన

సియాటిల్‌: మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు, బిల్‌మెలిందా గేట్స్‌ ఫాండేషన్‌ ఛైర్మన్‌ బిల్‌గేట్స్‌, ఆయన సతీమణి మెలిందా విడాకులు తీసుకుంటున్నారు. తమ 27 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతున్నట్లు సోమవారం అర్ధరాత్రి దాటాక (భారత కాలమానం ప్రకారం) ఆ దంపతులు ఇద్దరూ ట్విటర్‌లో సంయుక్తంగా ప్రకటించారు. మైక్రోసాఫ్ట్‌ అధినేతలుగానే కాకుండా పలు ధార్మిక కార్యక్రమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ చూరగొన్న ఈ జంట విడిపోవటం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురిచేసింది. ‘‘ఎన్నో సమాలోచనలు, ఎంతో మథనం తర్వాత మా వైవాహిక బంధానికి ముగింపు పలకాలన్న నిర్ణయానికి వచ్చాం. గత 27 ఏళ్లలో మేము ముగ్గురు అత్యద్భుతమైన పిల్లలను తీర్చిదిద్దాం. దాంతో పాటు ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, నిర్మాణాత్మకంగా ఎదిగేలా మా ఫౌండేషన్‌ ద్వారా కృషి చేశాం. ఈ మిషన్‌లో మా భాగస్వామ్యం ఎప్పటికీ కొనసాగుతుంది. కానీ భార్యాభర్తలుగా ఇక కొనసాగలేమని భావించాం. కొత్త ప్రపంచంలోకి మేం వెళ్లేందుకు వీలుగా, మా వ్యక్తిగత ఆకాంక్షలను, మా విడాకుల నిర్ణయాన్ని గౌరవిస్తారని ఆశిస్తున్నాం’’ అని ట్విటర్‌లో బిల్‌, మెలిందాలు పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో బిల్‌గేట్స్‌ ఒకరు. ఫోర్బ్స్‌ జాబితా ప్రకారం ప్రస్తుతం ఆయన ఆస్తుల విలువ 130 బిలియన్‌ డాలర్లు(రూ.9.64లక్షల కోట్లు). 2000లో స్థాపించిన బిల్‌-మెలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ ద్వారా ఇప్పటివరకూ వారు 53 బిలియన్‌ డాలర్లను(దాదాపు రూ.4లక్షల కోట్లు) ధార్మిక కార్యక్రమాలకు ఖర్చు చేశారు. ప్రస్తుతం బిల్‌గేట్స్‌ వయసు 65 ఏళ్లు కాగా, మెలిందా వయసు 56 ఏళ్లు. 1994లో వారిద్దరు పెళ్లి చేసుకున్నారు. వీరికి 18-25 ఏళ్ల వయసున్న పిల్లలు ముగ్గురున్నారు. దాంపత్య జీవితంలో విడిపోయినప్పటికీ సంస్థ దాతృత్వ కార్యక్రమాల్లో బిల్‌గేట్స్‌, మెలిందా కలిసే పాల్గొంటారని బిల్‌ మెలిందాగేట్స్‌ ఫాండేషన్‌ ఓ ప్రకటనలో తెలిపింది.

 

ఎవరీ బిల్‌గేట్స్‌
1955లో సంపన్నుల ఇంట పుట్టిన బిల్‌గేట్స్‌  13వ ఏటనే సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రాం రాశారు. 1975లో హార్వర్డ్‌ యూనివర్సిటీలో చేరిన బిల్‌గేట్స్‌ చదువును మధ్యలోనే ఆపేశారు. తన చిన్ననాటి స్నేహితుడు పాల్‌ అలెన్‌తో కలసి మైక్రోసాఫ్ట్‌ను ఏర్పాటు చేశారు. 1986లో ఆ సంస్థ తన తొలి పబ్లిక్‌ ఆఫరింగ్‌కు వెళ్లిన సమయానికి గేట్స్‌కు 49శాతం వాటా ఉంది. దీంతో ఉన్నపళంగా ఆయన కోట్లకు పడగలెత్తారు! ఆ తర్వాత మైక్రోసాఫ్ట్‌ కంపెనీతో పాటు ఆయన సంపద వృద్ధి కూడా పరుగులెత్తి ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా ఎదిగారు.
అడగనా ఒక చిన్న మాట...
డ్యూక్‌ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్‌ సైన్స్‌, ఎకనామిక్స్‌లో డిగ్రీ పొందిన మెలిందా అన్‌ ఫ్రెంచ్‌- 1987లో మైక్రోసాఫ్ట్‌లో ప్రొడక్ట్‌ మేనేజర్‌గా చేరారు. మైక్రోసాఫ్ట్‌లో తొలి మహిళా మేనేజర్‌ తానే! నాలుగు నెలలకు బిల్‌గేట్స్‌తో పరిచయమైంది. ఆ తర్వాత కొద్దిరోజులకు కారు పార్కింగ్‌ వద్ద.. బిల్‌గేట్స్‌ మొహమాటపడుతూనే.. పరోక్షంగా తనకు ప్రపోజ్‌ చేశారు. అలా వారి ప్రేమాయణం మొదలైంది. దాదాపు ఏడాది డేటింగ్‌ తర్వాత నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది. ఓ రోజు బిల్‌గేట్స్‌ గదిలోకి మెలిందా వెళ్లేసరికి.. పెద్ద బోర్డు మీద... పెళ్లి చేసుకుంటే.. చేసుకోకుంటే అంటూ బొమ్మాబొరుసు పాయింట్లు... ఓ పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌లాంటి దానితో కుస్తీపడుతున్నారు. ‘‘పెళ్లంటే మాటలు కాదు మరి! పెళ్లి చేసుకోవాలనే ఉంది. కానీ, చేసుకొన్నాక మైక్రోసాఫ్ట్‌ను నడుపుతానా లేదా అని అనుమానంగా ఉంది’’ అన్నారు బిల్‌గేట్స్‌. మొత్తానికి...పెళ్లికి ఓకే చెప్పేశారు. 1993లో ఎంగేజ్‌మెంట్‌... 1994లో జనవరి 1న ఇద్దరూ ఒకింటి వారయ్యారు. ఆ సమయానికి గేట్స్‌ వయసు 38, మెలిందాకు 29! తన రాక గేట్స్‌కూ కలిసొచ్చింది. ఆ తర్వాతి ఏడాదే... బిల్‌గేట్స్‌కు ప్రపంచ కుబేరుడి (అత్యంత సంపన్నుడు) కీర్తి లభించింది.
కొత్త గేటు తెరిచింది...
1996లో తొలిపాప జెనిఫర్‌ పుట్టగానే... మెలిందా తన ఉద్యోగాన్నుంచి వైదొలగి... చిన్నారి పెంపకంపై దృష్టిసారించారు. 1999లో అబ్బాయి రోరీ, 2002లో మరో కూతురు పుట్టారు. కుటుంబాన్ని పెంచి పోషించుకుంటూనే....ఎన్నాళ్లని సంపాదిస్తాం? ఇలా సంపాదించిందంతా ఏం చేస్తాం? సమాజానికి తిరిగివ్వకుంటే ఎలా... అనే ఆలోచనతో బిల్‌గేట్స్‌ను దాతృత్వ కార్యక్రమాల వైపు మళ్లించారు మెలిందా! అదే...2000 సంవత్సరంలో సియాటిల్‌ కేంద్రంగా మెలిందా గేట్స్‌ ఫౌండేషన్‌కు దారి తీసింది. తమ సంపాదన నుంచి 2018 దాకా వీరిద్దరూ ఈ ఫౌండేషన్‌కు 36 బిలియన్‌ డాలర్లు విరాళమిచ్చారు. అలా సంపాదనలోనే కాకుండా... వితరణలోనూ బిల్‌గేట్స్‌ను ప్రపంచంలో నెంబర్‌వన్‌గా నిలిపింది. బిల్‌-మెలిందా గేట్స్‌ ఫౌండేషన్‌లో ఇద్దరూ సమాన భాగస్వాములు. ఇద్దరూ బోర్డులో ట్రస్టీలు.

‘గేట్లు’ తెరిచిన ప్రేమకథ!

తను పుట్టుకతోనే సంపన్నుడు! డాలర్లు... డబ్బులే లోకంగా సాగుతున్న ఆయన జీవితంలోకి ప్రేమగా ప్రవేశించిన ఆ అమ్మాయి... ఆ అబ్బాయికే కాదు.. ప్రపంచానికీ కొత్త గేట్లు తెరిచింది. ఫలితంగా వారిద్దరూ 27 ఏళ్లపాటు కలివిడిగా సమాజానికి తిరిగిచ్చారు! అలాంటివారిప్పుడు విడిపోతామంటుంటే అంతా ఆశ్చర్యపోతున్నారు. ప్రపంచ దాతృత్వాధ్యాయంలో... వీరిద్దరిదీ 27 సంవత్సరాల ప్రేమకథ! ఆ అబ్బాయి బిల్‌గేట్స్‌... ఆ అమ్మాయి మెలిందా!

ఆస్తుల పంపకం ఎలా?

విడాకుల నేపథ్యంలో గేట్స్‌ దంపతుల ఆస్తుల పంపకంపై అందరి దృష్టీ కేంద్రీకృతమైంది. కోర్టుకు సమర్పించిన విడాకుల దరఖాస్తులో వారు తమ ఆస్తుల పంపకాల వివరాలు స్పష్టంగా ఇవ్వలేదు. తమ ఉమ్మడి ఆస్తులను పంచమని కోరారు. అమెరికాలోని చట్టాల ప్రకారం... పెళ్లి తర్వాత సంపాదించిన ఆస్తుల్ని ఉమ్మడిగా పరిగణించి ఇద్దరికీ సమంగా పంచే అవకాశం ఉందని న్యాయనిపుణుల ఉవాచ.

ఈ విడాకులూ ఖరీదే!

1. జెఫ్‌బెజోస్‌ (అమెజాన్‌)- మెకెంజీ స్కాట్‌
అమెజాన్‌ వ్యవస్థాపకుడైన జెఫ్‌ బెజోస్‌ 2019లో తన భార్య మెకెంజీకి విడాకులిచ్చారు. విడాకుల కారణంగా మెకెంజీకి 38 బిలియన్‌ డాలర్లు(రూ.2.80లక్షల కోట్లు) వచ్చాయి. ప్రస్తుతం ఆమె ఆస్తుల విలువ 6.1 బిలియన్‌ డాలర్లు(రూ.45వేల కోట్లు).
2. రూపర్ట్‌ మర్డోక్‌-అనా మారియా మాన్‌
ప్రపంచ మీడియా మొఘల్‌గా పేరొందిన రూపర్ట్‌ మర్డోక్‌ తన భార్య అనా మారియా మాన్‌ నుంచి 1999లో విడాకులు తీసుకున్నారు. మారియాకు 1.7 బిలియన్‌ డాలర్ల(రూ.12,540 కోట్ల) ఆస్తి, 110 మిలియన్‌ డాలర్ల(రూ.811కోట్ల) డబ్బు లభించాయి.
3. టైగర్‌వుడ్స్‌-ఎలిన్‌
ప్రపంచ గోల్ఫ్‌ ఛాంపియన్‌ టైగర్‌వుడ్స్‌ 2010లో తన భార్య ఎలిన్‌ నుంచి విడిపోయారు. 710 మిలియన్‌ డాలర్లు(రూ.5,237కోట్లు) ఎలిన్‌కు వచ్చాయి.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని