‘బంగారు బుల్లోడు’ మంచి వినోదాత్మక చిత్రం: అల్లరి నరేశ్
ఇంటర్నెట్ డెస్క్: తాను చేసిన తొలి సినిమా ‘అల్లరి’ని ఇంటి పేరుగా మార్చుకొని అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే నటుడు అల్లరి నరేశ్. ఓవైపు కామెడీ చిత్రాలు చేస్తూనే మరోవైపు సీరియస్ పాత్రల్లో ఒదిగిపోతూ తనలోనూ అసలైన నటుడికి పనికల్పిస్తున్నాడీ ‘బ్లేడుబాబ్జీ’. మరోసారి ‘బంగారు బుల్లోడు’గా మారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. ఆయన నటించిన ఈ చిత్రం జనవరి 23న విడుదల కానుంది. ఈ సందర్భంగా నరేశ్ మీడియాతో పలు విషయాలు పంచుకున్నారు.
బాలయ్యబాబు సినిమాకు దీనికి ఎలాంటి సంబంధం లేదు..
ఈ సినిమాలో బంగారం తయారు చేసే పాత్ర నాది. గ్రామీణ బ్యాంకులో బంగారం తాకట్టుపెడితే ఎంత రుణం ఇవ్వొచ్చు అని చెప్పే ఉద్యోగిగా హీరో పనిచేస్తుంటాడు. ఈ సినిమా మొత్తం బంగారం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అందుకే బంగారంతో వచ్చే టైటిల్ పెట్టాలని అనుకున్నాం. 20-30 పేర్లు పరిశీలించాం. కానీ.. ఏదీ అంతగా నచ్చలేదు. బాలకృష్ణగారి సినిమా ‘బంగారు బుల్లోడు’ అని పెడితే బాగుంటుందని చెప్పి.. ఖరారు చేశాం. అంతేకానీ.. బాలయ్యబాబు చేసిన ఈ సినిమాకు ఎలాంటి సంబంధం లేదు. అయితే.. ‘బంగారుబుల్లోడు’ అనగానే అందరికీ ‘స్వాతిలో ముత్యమంత’ పాట గుర్తొస్తుంది. మనకు ఎలాగూ రీమిక్స్ పాటలు కలిసొచ్చాయి. టైటిల్ కూడా ఎలాగూ తీసుకుంటున్నాం కాబట్టి. ఆ సినిమాలోని పాట కూడా రీమిక్స్ చేశాం.
రాజమండ్రిలో జరిగిన యధార్థ ఘటన..
ఈమధ్య కాలంలో గ్రామీణ వాతావరణంలో కామెడీ సినిమాలు రావడం లేదు. ‘బెండప్పారావు ఆర్ఎంపీ’ వంటి సినిమాలు మళ్లీ తీస్తే బాగుంటుందని చాలామంది చెప్పారు. అందుకే ఈ సినిమాను తెరకెక్కించాం. యధార్థ ఘటనల ఆధారంగా తీసిన సినిమా ఇది. రాజమండ్రిలోని ఒక బ్యాంకులో జరిగిన ఘటన ఇది. ఒక మేనేజర్ నకిలీ నగలు పెట్టి డబ్బుతో పరారవుతాడు. ఆ కథ ఆధారంగానే ఈ సినిమాను తీర్చిదిద్దాం.
కథలోనే కామెడీ ఉంటుంది..
ప్రేక్షకులు చాలా మారారు. ఒకప్పటిలా కాకుండా.. ఇప్పుడు కామెడీ సినిమాల్లోనూ కథ కోరుకుంటున్నారు. డైరెక్టర్ గిరి కథ చెప్పినప్పుడు ఇదంతా దృష్టిలో పెట్టుకొని ఒప్పేసుకున్నాను. గిరి.. మా నాన్నగారి దగ్గర రచయితగా ఉన్నప్పటి నుంచి తెలుసు. ఆయన నాలుగైదు కథలు చెప్పారు. ఈ సినిమా కథ నాకు బాగా నప్పుతుందని దీన్ని తీసుకున్నాం. ఆయన కథ రాసుకున్నప్పుడు ప్రతిరోజు వెళ్లి బ్యాంకు ముందు నిల్చునేవారట. సినిమాలో మొత్తం అసలైన బ్యాంకు.. అసలైన లాకర్లనే చూపించాం. అందుకే ఈ సినిమాలో కథ సాగుతూనే కావాల్సినప్పుడు మాత్రమే కామెడీ ఉంటుంది. కథలోనే కామెడీ ఉంటుంది. కామెడీ కోసం కథ పెట్టలేదు.
ప్రత్యేకంగా బంగారం పని నేర్చుకున్నాను..
నేను తయారుచేసే వాళ్లను చూశాను. కానీ, వాళ్లు ఎలా పని చేస్తారో తెలియదు. ఈ సినిమా చేస్తున్నప్పుడు భరణిగారు వచ్చి.. ‘థియేటర్‌కు ఎవరైనా బంగారం తయారుచేసేవాళ్లు వచ్చి సినిమా చూస్తే.. వీళ్లేంటి సరిగ్గా చేయట్లేదని అనుకోకూడదు కదా’ అన్నారు. అందుకే నేను ప్రత్యేకంగా పని నేర్చుకున్నా. గొట్టంతో ఊదడం, అతుకులు వేయడం, చెవులు కుట్టడంపై అవగాహన తెచ్చుకున్నాను. నాకు తెలిసి బంగారం తయారు చేసే పాత్రలో ఏ హీరో నటించలేదు. ఇదే మొదటిసారి కావచ్చు. అందుకే ఈ సినిమాకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాం.
గెడ్డం వల్ల ఇంత ఆలస్యమైంది
‘మహర్షి’, ‘బంగారు బుల్లోడు’ దాదాపు ఒకేసారి మొదలయ్యాయి. ఈ రెండు సినిమాల్లో ఇదే ముందు పూర్తి కావాల్సింది. ఏప్రిల్.. మేలో మొదలు కావాల్సి ఉండగా.. జూన్‌లో ప్రారంభమైంది. షూటింగ్ కోసం డెహ్రాడూన్‌కు వెళ్లి వచ్చాం. అప్పటి వరకూ నేను చేసిన పాత్రల్లో గెడ్డం లేకుండా చేసేవి. ఆ తర్వాత మహర్షిలో రెండో పాత్ర కోసం గెడ్డం పెంచుకోవాల్సి వచ్చింది. దానికి మూడు నెలలు పట్టింది. ఆ షూటింగ్ అయిపోయే సమయానికి అనిల్‌గారు వేరే సినిమాల్లో బిజీగా ఉన్నారు. ఒక నెల తర్వాత మొదలుపెడదాం అన్నారు. అలా.. అది ఆరేడు నెలలు ఆలస్యం అయింది.
ఓటీటీల్లో చేయడానికి కూడా సిద్ధం..
నేను చేసిన సినిమాల్లో వేసవిలో వచ్చినవన్నీ విజయం సాధించాయి. ఈ సినిమాను కూడా వేసవిలోనే విడుదల చేద్దాం అనుకున్నాం. కానీ.. కరోనా వల్ల అది కుదరలేదు. కరోనా సమయంలో ఓటీటీల్లో అన్ని భాషల సినిమాలు చూశాను. ఓటీటీలో మంచి పాత్రలు వస్తే తప్పకుండా చేస్తా. నేను దేనికీ వ్యతిరేకం కాదు. ఓటీటీలో కూడా మంచి కంటెంట్ ఉంటుంది.
నవ్వించడం తెలుసు.. ఏడిపించడమూ తెలుసు..
ఒకానొక సమయంలో నరేశ్ అంటే కేవలం కామెడీ సినిమాలు మాత్రమే చేస్తాడని అనుకునేవారు. గమ్యంతో చాలా మంది అభిప్రాయం మార్చుకున్నారు. ఇప్పుడు నరేశ్ నవ్వించడం మాత్రమే కాదు.. ఏడిపిస్తాడు కూడా అని అనుకుంటున్నారు. మహర్షి సినిమా చూసిన తర్వాత అందులో నా నటన బాగా నచ్చడంతో డైరెక్టర్ విజయ్ ఫోన్ చేశాడు. ‘నాంది’ కథ చెప్పాడు. వెంటనే.. ఇంత సీరియస్ కథ నాకెందుకు చెప్పావు అన్నాను. మీరే చేయాలండి కచ్చితంగా.. అన్నాడు. నిర్మాత కూడా నమ్మకంగా ఉండటంతో నేను కూడా పచ్చజెండా ఊపాను. ‘బంగారుబుల్లోడు’లో ఎంత నవ్విస్తానో.. ‘నాంది’లో అంతే సీరియస్‌గా ఉంటాను.
ఎస్పీ బాలుగారిని మ్యాచ్ చేయడం చాలా కష్టం..
‘స్వాతిలో ముత్యమంత’ పాట చేసేటప్పుడు బాలకృష్ణగారి ఒరిజినల్ సాంగ్ చూశాను. రీమిక్స్ చేస్తే ఒరిజినల్‌ను దెబ్బతీయకుండా చేయాలి. ఈమధ్యకాలంలో వచ్చిన రీమిక్స్ వల్ల ఒరిజినల్ పాటను పాడుచేస్తున్నారని మాటలు వినిపించాయి. అందుకే ఈ పాటను మేం చాలా జాగ్రత్తగా చేశాం. అయితే.. మా విషయంలో ఒరిజినల్ పాటను ఎస్పీబాలు గారు పాడారు. ఆయనను చేరుకోవడం ఎవరి వల్ల కావడం లేదు. ఆరుగురు గాయకులు పాడినా కుదర్లేదు. చివరికి రేవంత్ పాడిన తర్వాత మొత్తానికి పాట బాగా వచ్చింది.
నేను రాసుకున్న కథలకు నేను హీరోగా ఊహించుకోలేదు..
కథ నచ్చితేనే సినిమా చేయాలని అనుకుంటున్నాను. ఇంకా నాలుగైదు సినిమాలు చేతిలో ఉన్నాయి. కానీ.. ఏదెప్పుడు ప్రారంభమవుతుందో.. ఎప్పుడు విడుదలవుతుందో ఇప్పుడే చెప్పలేను. నేను రాసుకున్న కథలకు నేను హీరోగా చేయాలని ఎప్పుడూ అనుకోను. రెండుమూడు సంవత్సరాల తర్వాత దర్శకత్వం చేసే ఆలోచన చేస్తా. అన్నింటికంటే ముందు ఈ సినిమా విజయం సాధించాలి.,
ఇది ఇంటి భోజనం.. అది రెస్టారంట్
ఒక్కమాటలో చెప్పాలంటే. బంగారు బుల్లోడు ఇంట్లో భోజనం అయితే.. నాంది రెస్టారంట్ భోజనం. ‘నాంది’లో నగ్నంగా చేసే సన్నివేశంలో కాస్త ఇబ్బంది అనిపించింది. ఆ సినిమాలో నేచురల్‌గా చేస్తే బాగుంటుందని డైరెక్టర్ చెప్పారు. ఆ సీన్ గురించి మొదటి నుంచి నాకు గుర్తు చేస్తూ వచ్చారు. నాకేమో టెన్షన్ వచ్చేది(నవ్వుతూ..)
కామెడీ సినిమాలంటేనే ఇష్టం..
కామెడీ, సీరియస్ సినిమాలు రెండింట్లో ఏది ఇష్టమని అడిగితే.. నాకు సినిమాలంటేనే ఇష్టం అని చెప్తా. ఎందుకంటే.. రాజేంద్రప్రసాద్‌గారి ఏ సినిమాలు మధ్యలో నుంచి చూసినా బోర్ కొట్టవు. అదే సీరియస్ సినిమా అయితే.. ఒక్కసారి చూస్తే మళ్లీ అంత ఆసక్తి అనిపించదు. స్పూఫ్ గురించి చెప్పాలంటే.. చేసే ఆలోచన లేదు. ఇప్పుడు కితకితలు, సీమశాస్త్రిలాంటి సినిమాలు చేసే పరిస్థితి లేదు. తర్వాత వచ్చే సినిమాల్లో ఆలోచిస్తాం. కామెడీపై పరిమితులు ఎక్కువైపోయాయి.
కంటెంట్ నచ్చితే ప్రేక్షకులు ఆదరిస్తారు..
ఆర్టిస్టుగా గుర్తిస్తే సంతోషం అనిపిస్తుంది. మీరే చెప్పండి.. కామెడీ సినిమాలు ఎన్ని చేస్తే ఎన్ని అవార్డులు వచ్చాయి..? కామెడీ చేసేవాళ్లంటే కొంచెం వేరే రకంగా చూస్తుంటారు. అందుకే కామెడీ చేయాలంటే చాలా మంది ఆర్టిస్టులు ఆలోచిస్తుంటారు. కానీ, కామెడీ చేసేవాళ్లు ఏదైనా చేయొచ్చని మా నాన్న చెప్పారు. అమితాబ్, మెగాస్టార్ చిరంజీవి.. అందరూ కామెడీ చేయగలిగినవాళ్లే. సినిమాలో కామెడీ కూడా చాలా ముఖ్యం. ఎంతమంచి కథ ఉన్నా కామెడీ లేకపోతే ఎంటర్టైన్మెంట్ ఉండకపోతే ప్రేక్షకులు ఆదరించరు కదా..! కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి చూస్తారు.
ఇదీ చదవండి..
ఆసక్తికరంగా ‘30రోజుల్లో ప్రేమించడం ఎలా’ ట్రైలర్
మరిన్ని
కొత్త సినిమాలు
-
‘ఆచార్య’ నుంచి మరో న్యూ పిక్
-
విజయేంద్ర ప్రసాద్ కొత్త చిత్రం ‘సీత’
-
ఆసక్తి రేపుతోన్న ‘పవర్ ప్లే’ట్రైలర్!
-
#RRR క్లైమాక్స్ కోసం నిక్ పావెల్ వచ్చేశాడు
- ‘వకీల్ సాబ్’ మరో అప్డేట్ ఇచ్చారు
గుసగుసలు
- దిశను ఓకే చేశారా?
- క్రిష్-వైష్ణవ్ మూవీ.. టైటిల్ అదేనా?
-
బన్నీ సినిమాలో స్టార్ హీరో కుమార్తె..?
- మలయాళీ రీమేక్‌లో శివాత్మిక?
- ‘పుష్ప’ టీజర్.. ఆరోజేనా?
రివ్యూ
కొత్త పాట గురూ
-
‘పైన పటారం..’ అంటున్న అనసూయ
-
‘యుద్ధానికి కావాల్సింది గమ్యం మాత్రమే’
-
‘మనసంతా చేరి మార్చావే దారి’ అంటోన్న సుమంత్
-
‘చిట్టి’ పాటకు ‘చిట్టిబాబు’ స్టెప్పేస్తే..!
-
వాహ్! అనిపిస్తున్న ‘సారంగదరియా..’