Actor Vijay: విజయ్‌ జరిమానాపై స్టే.. ఎంట్రీపన్ను 80శాతం చెల్లించాలన్న మద్రాసు హైకోర్టు
close
Updated : 28/07/2021 09:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Actor Vijay: విజయ్‌ జరిమానాపై స్టే.. ఎంట్రీపన్ను 80శాతం చెల్లించాలన్న మద్రాసు హైకోర్టు

చెన్నై: ఇంగ్లండ్‌ నుంచి దిగుమతి చేసుకొన్న రోల్స్‌ రాయిస్‌ కారుకు రాష్ట్ర ఎంట్రీపన్ను నుంచి మినహాయింపు కోరిన నటుడు విజయ్‌కు విధించిన రూ.లక్ష జరిమానా ఉత్తర్వులపై మద్రాసు హైకోర్టు మధ్యంతర స్టే విధించింది. మిగిలిన 80 శాతం ఎంట్రీ పన్నును వారంలోపు చెల్లించాలని ఆదేశించింది. విచారణలో ‘రీల్‌ హీరోలు కాదు.. రియల్‌ హీరోలు కండి’ అంటూ న్యాయమూర్తి నటుడు విజయ్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను, జరిమానాను ఉపసంహరించుకోవాలని విజయ్‌ మద్రాసు హైకోర్టులో అప్పీల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం మంగళవారం జస్టిస్‌ దురైస్వామి, జస్టిస్‌ హేమలత ద్విసభ్య ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. దిగుమతి చేసుకున్న కారుకు ఏడు నుంచి పది రోజుల్లో ఎంట్రీ పన్ను చెల్లించేందుకు సిద్ధమని విజయ్‌ తరఫున న్యాయవాది కోర్టుకు తెలిపారు. జరిమానా, న్యాయమూర్తి వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని వాదనలు వినిపించారు. లగ్జరీకారుకు విజయ్‌ ఎంట్రీ పన్ను చెల్లిస్తే సరిపోతుందని, జరిమానా, వ్యాఖ్యల గురించి మాట్లాడేందుకేమీ లేదని ప్రభుత్వం తరఫున న్యాయవాది పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక న్యాయమూర్తి విధించిన జరిమానాపై మధ్యంతర స్టే విధించారు. ప్రత్యేక న్యాయమూర్తి పేర్కొన్న విమర్శలపై నాలుగు వారాల తర్వాత విచారణ నిర్వహిస్తామని సూచిస్తూ కేసును ఆగస్టు 31కి వాయిదా వేశారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని