అభినయ జయంతి
close
Published : 27/07/2021 02:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అభినయ జయంతి

వెండితెరపై నవరసాలు అలవోకగా పలికించిన నటి ఆమె... ప్రేక్షకులతో కన్నీళ్లు పెట్టించడంలో మాత్రం ఆమెకు ఆమేసాటి ఒకనాడు కథానాయికగా ఎంతగా అలరించారో... ఆ తర్వాత తల్లి, అక్క, వదిన లాంటి పాత్రలకు వన్నె తెచ్చారామె... . ఆమే సీనియర్‌ నటి జయంతి.

క్షిణాది చిత్రసీమలో ఓ వెలుగువెలిగిన అందాలనటి జయంతి (76) ఇకలేరు. ఏడాదిన్నరగా వయోభారంతో కలిగిన   అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె సోమవారం ఉదయం బెంగళూరులో కన్నుమూశారు. బళ్లారిలో 1946 జనవరి 6న బాలసుబ్రహ్మణ్యం, సంతానలక్ష్మి దంపతులకు జన్మించిన జయంతి అసలు పేరు కమలాకుమారి. ఆమె కన్నడ చిత్రం జేనుగూడు (1963) ద్వారా చిత్రరంగంలోకి అడుగుపెట్టారు. తెలుగులో ఎన్టీఆర్‌, ఏఎన్‌ఆర్‌, కృష్ణ, శోభన్‌బాబు లాంటి అగ్రనటులతో కలిసి నటించారు. ఎంజీఆర్‌, శివాజీగణేశన్‌, రాజ్‌కుమార్‌, విష్ణువర్ధన్‌, అంబరీశ్‌, గంగాధర్‌ తదితరుల సరసన నటించారు. ‘జగదేకవీరుని కథ’, ‘కులగౌరవం’, ‘జస్టిస్‌ చౌదరి’, ‘కొండవీటి సింహం’, ‘బొబ్బిలి యుద్ధం’, ‘పెదరాయుడు’ తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించారు. మొత్తం 550 చిత్రాల్లో నటించగా, అందులో 300కు పైగా చిత్రాలు కన్నడవే. చందవళ్లి తోటె, ఎడగల్లు గుడ్డదమేలె, మనస్సినంతె మాంగల్య, ధర్మ దారి తప్పితు, తులసి, ఆనంద్‌, మసణద హూవు, టువి టువి టువి తదితర చిత్రాల ద్వారా ఆమె కన్నడనాట గుర్తింపు తెచ్చుకున్నారు.

పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశమే

పేరులో ‘జయం’ ఉన్న జయంతి సినీ జీవితం కూడా దిగ్విజయంగా సాగింది. ఓ నాట్య పాఠశాల విద్యార్థిగా సినిమా షూటింగ్‌ చూసేందుకు వెళ్లిన కమలకుమారి అప్రయత్నంగా వచ్చిన అవకాశంతో బహుభాషా నటిగా నటించి పలు అవార్డులు, రివార్డులు సొంతం చేసుకున్నారు. పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేసేవారు జయంతి. భర్త పరస్త్రీ వ్యామోహంలో పడకూడదని తాపత్రయపడే ఇల్లాలిగా ‘కలెక్టర్‌ జానకి’, సమాజం పతితగా ముద్రవేసినా మంచి మనసున్న చెల్లిగా ‘మాయదారి మల్లిగాడు’ లాంటి చిత్రాల్లోని పాత్రలు జయంతిని మంచి నటిగా నిరూపించాయి. మాయదారి మల్లిగాడులోని ‘మల్లెపందిరి నీడలోన జాబిల్లి’ అంటూ ఆమె పై చిత్రీకరించిన పాట ఆ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. కె.విశ్వనాథ్‌ను గురువుగా పిలిచే జయంతి ఆయన దర్శకత్వంలో ‘శారద’, ‘స్వాతికిరణం’ చిత్రాల్లో మంచి పాత్రలతో మెప్పించారు. ‘బంగారు బాబు’లో ఏఎన్‌ఆర్‌కు గుడ్డి చెల్లెలిగా, ‘సంసారం-సాగరం’లో సగటు ఇల్లాలిగా బరువైన పాత్రలు పోషించారు.

ఎన్టీఆర్‌తో పోటాపోటీగా..

ఎన్టీఆర్‌తో దర్శకుడు కె.రాఘవేంద్రరావు తీసిన ‘కొండవీటిసింహం’లో ఆ మహానటుడితో పోటీపడి నటించారు. ఈ చిత్రంలో ఆ ఇద్దరిపై తీసిన ‘మాఇంటిలోన మహలక్ష్మి నీవే’ పాట ఇప్పుడు చూసినా కళ్ల వెంట నీళ్లు వస్తాయి. తాను ఎక్కువగా ఏడుపుగొట్టు పాత్రలు చేశానని అంగీకరించిన జయంతి ఆ పాత్రలు అలా పోషించి ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించడం కూడా మామూలు విషయం కాదంటారామె. కన్నడ చిత్రసీమలో ఆమెది ఓ సూపర్‌ స్టార్‌ ఇమేజి. అగ్రనటులు రాజ్‌కుమార్‌, విష్ణువర్థన్‌ల అభిమానుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. వీరిద్దరి సరసన పలు సూపర్‌హిట్‌ చిత్రాల్లో జయంతి నటించారు. ఆ ఇద్దరు నటుల అభిమానులు కలిసి జయంతిని ఘనంగా సత్కరించడం తన జీవితంలో గొప్ప ఘటనగా ఆమె చెప్పుకొనేవారు. ఉత్తమ నటి, ఉత్తమ సహాయనటిగా రెండుసార్లు ప్రెసెడెంట్‌ మెడల్‌, ఫిల్మ్‌ఫేర్‌ పురస్కారాలను అందుకున్నారు. సినీ పరిశ్రమకు ఆమె చేసిన సేవలకు కర్ణాటక ప్రభుత్వం ‘అభినయ శారద’ బిరుదుతో సత్కరించింది.  

ప్రముఖుల సంతాపం

జయంతి మృతికి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, హీరో బాలకృష్ణ, నటుడు నరేష్‌తో పాటు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు సంతాపాన్ని ప్రకటించారు. జయంతికి  కుమారుడు కృష్ణకుమార్‌ ఉన్నారు. సోమవారం సాయంత్రం ఆమె అంత్యక్రియల్ని నిర్వహించారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని