బాలుకు... ప్రేమతో - Telugu News Special Story On SP Balu
close
Updated : 25/09/2021 09:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బాలుకు... ప్రేమతో

అప్పుడే ఏడాది కాలం గతం ఒడిలోకి జారిపోయింది. ఆకాశమంత ఏకాంతం... అంతే తెలియని నిశ్శబ్దం.. ఏ పెదవిలో చేరి పదాలు- మధుర నదీ నదాలుగా పరవళ్లు తొక్కుతాయో.. ఏ గొంతులో చేరి స్వరాలు- సరిగమల వరాలుగా సొగసులు ఒలికిస్తాయో.. ఏవీ.. ఎక్కడ? కన్నుమూసిన పాటవా.. ? రెప్పమాటున పొంగిన కన్నీటివా.. ? తీగతెగిన వీణవా.. మూగవైన వేణువా..? తెల్లవారకముందే నింగి నుంచి మాయమైన నిండు చంద్రుడా అమ్మ ఒడికి చేరాలని తరలివెళ్లిన సరస్వతీ పుత్రుడా సకలజగన్మిత్రుడా..శాపవశాత్తు ఇలపై పుట్టిన గంధర్వుడా...

బాలు...

ఎక్కడ నువ్వు...? ఏదీ నీ నవ్వు...?
ఏ మనసు తలుపు తెరచినా నీ తలపే...
పాడుతా తీయగా అంటూ పలకరించే నీ పిలుపే..
అప్పుడే ఎలా వెళ్లిపోయావు?
ఈ పాట పూర్తి కాకుండానే...
నిన్నగాక మొన్ననే కదా- పెన్నా తీరాన పండితారాధ్యుల వారి ఇంట కలల పంటలా తొలికేక పెట్టావు..
త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలతో సింహపురిని చిరు తిరువాయూరుగా మార్చిన తండ్రి సాంబమూర్తిగారి భాగ్యమో, తల్లి శకుంతలమ్మ నోము ఫలమో..
మరి ఆ అమ్మ గోరు ముద్దలు తినిపించిందో...నీ నోట తేనెధారలే వంపిందో తెలియదు కానీ..
ఉంగా ఉంగా అంటున్న నీ పసిగొంతులోనూ రమ్యరాగామృతమే పలికిందట..
తెలుగు జాతిది ఎంత పుణ్యం..
‘బాల’ సుబ్రహ్మణ్యంగా లేలేత గొంతుతో లలితలలితంగా నాదవేదాలు పలకడం ప్రారంభించావు!
1966 డిసెంబరు, 15 శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న చిత్రంలో తొలిసారిగా గీతమాలపించావు..
ఆ రోజే..‘బాలు పాట’ పేరుతో శకం మళ్లీ పుట్టింది.
ఆ తర్వాత అంతా బాలు యుగమే..
సురాగ యాగమే..!
తెలుగు వారికే కాదు..అటు తమిళనాడు, ఇటు కర్ణాటక రాష్ట్రంలో, అలా..
మలయాళ నేలమీద, మహారాష్ట్ర జనుల మీద..

ఒక భాషా..
ఒక ప్రాంతమా..
నీ పాట మత్తులా, మేఘంలా కమ్మేసింది..
కోట్లాది జన మానసాల్ని సమ్మోహితుల్ని చేసి, ఊహల్లో ఊరించి, ఊగించి, ఉత్తుంగ తరంగమై విశ్వరూపమెత్తి ఉర్రూతలూగించింది..
ఒకటా.. రెండా.. వేలా..పదివేలా..
అర్ధశతాబ్దాన్ని దాటిన మహా ప్రయాణంలో అర లక్షకు మించిన పాటలు..
మంచు కురిసే ఉదయాన నిద్రలేవగానే సుప్రభాతమై వినిపించేది నీ శ్రీకంఠమే..
పొత్తిళ్లలో బిడ్డ ఏడుస్తుంటే జోలపాడి లాలించేది మార్దవమైన నీ గొంతుకే..
వాల్జడ కదలాడుతుంటే వయ్యారాల జలపాతంలా సాగే వెన్నెలమ్మాయిని ప్రేమగా తాకేది నీ ప్రియగీతికే...
గుండె నిండా దిగులు ఆవరిస్తే, విరహపు దీపాన్ని వెలిగించి ఓదార్పు వింజామరలు వీచేది నీ గానమాధుర్యమే..
వేకువ నుంచి నిశిరాతిరి వరకు, ప్రతి క్షణం..!
ఆశల నుంచి ఆశయాల వరకు, ప్రతి తరుణం...!!
నీ పాటే.. నీ పాటే..నీ పాటే..
అది బుగ్గల మీద నీటి బొట్టుని తుడుస్తుంది
పెదవుల మీద చిర్నవ్వులు పూయిస్తుంది
మనసు ముంగిట్లో పచ్చటి పూలతోరణాలు కట్టిస్తుంది అందుకే..

దేశదేశాలలో నీకు ఘన జన సత్కారాలు, గండపెండేరాలు, ప్రభుత్వాలు అందించిన పద్మశ్రీ, పద్మభూషణ పురస్కారాలు..!
మీ ఇంట ఎన్ని నందులు కొలువయ్యాయో నీకైనా తెలుసునా సుబ్రహ్మణ్య స్వామీ..???
పాటని భక్తి ప్రపత్తులతో కొలుస్తావు కనుకే, భాషని కంటికి రెప్పలా ప్రేమిస్తావు కనుకే.. నీవు
స్వర కారణజన్ముడవు..
ఎలా మరచిపోగలదయ్యా జాతి నిన్ను..
మరచిపోవడానికి నీవి మామూలు గానాలు కావు...సరిగమల శాసనాలు...!
చూడు..
మధ్యలోనే పాట ఆపేసి నువ్వు వెళ్లిపోయావు..
నీ మరణం..ప్రతి సంగీత ప్రేమికుడి
ఇంటిలోనూ సంభవించిన మరణం..
అందుకే ఇక్కడ - మధ్నాహ్నమే చీకటైపోయింది.
వెళ్లిపోయాడు చూడండి.
స్వర విశ్వవిద్యాలయపు మహామహోపాధ్యాయుడు..
ఆ దీర్ఘ శయ్య మీద నువ్వు మాకు..
పియానోపై నిద్రపోతున్న పసిబాలుడిలా..!
గౌరవ వందనం చేస్తున్న తుపాకుల ధ్వని ధ్వజస్తంభం మీద గంటలు మోగినట్లు..!!
రాగ పీఠాధిపతిగా కూర్చోపెట్టి నిన్ను నేలతల్లి ఒడిలోకి సమర్పిస్తుంటే పాటకి గర్భగుడి కడుతున్నట్లు..!!!
నువ్వు వెళ్లిపోయావు..
గుండె దోసిళ్లతో అమరత్వాన్ని అందుకుని..!
తడి తేరిన కళ్లతో, చెమర్చిన హృదయాలతో..
మొదటి వర్ధంతి వేళ ఇక్కడ మేం అర్పించే ఈ కైమోడ్పు
మాకు మేమే చెప్పుకునే ఓదార్పు!

- అజయ్‌ శాంతి


సుప్రసిద్ధ సంగీత దర్శకులు, గాయనీగాయకులు, గీత రచయితలు పాల్గొన్న ప్రత్యేక కార్యక్రమం  ఆదివారం సాయంత్రం 6గం.లకు ఈటీవీలో ప్రసారమవుతుంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని