Published : 02/03/2020 00:21 IST
స్పష్టత ఉంటే సగం గెలిచినట్టే!

సీఎంఏ టాపర్‌ దీపక్‌ జైన్‌
సక్సెస్‌ మంత్ర

కామర్స్‌ కోర్సులంటే చాలా కష్టమనే అపోహను దూరం చేస్తూ జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నాడు దీపక్‌ జైన్‌ కాంకరియా. ఈ గుంటూరు కుర్రాడు వాణిజ్యప్రపంచంపై పరిజ్ఞానం పెంచుకోవాలనే లక్ష్యంతో సీఏతో పాటు సమాంతరంగా సీఎంఏ కోర్సులో చేరాడు. సీఏ ఇంటర్‌లో జాతీయస్థాయి 21వ ర్యాంకునూ; ఇటీవల వెల్లడైన సీఎంఏ ఇంటర్‌ ఫలితాల్లో ఏకంగా అఖిలభారతస్థాయి ప్రథమ ర్యాంకునూ సాధించాడు. సీఎంఏ పరీక్షలో ప్రథముడిగా నిలవాలంటే కాన్సెప్టులపై స్పష్టత పెంచుకోవడం ముఖ్యమనీ, తగిన సాధన చేయాలనీ సూచించాడు. ‘ఈనాడు చదువు’తో పంచుకున్న ఆ విశేషాలు అతడి మాటల్లోనే...!
ఎక్కువమంది ఎంచుకునే మూస కోర్సుల్లో చేరి గుంపులో ఒకరిగా ఉండటం నాకు ఇష్టం లేదు. అందుకే సర్టిఫైడ్‌ మేనేజ్‌మెంట్‌ అకౌంటెంట్‌ (సీఎంఏ), చార్టర్డ్‌ అకౌంటెంట్‌ (సీఏ)లోలో చేరాలనే నిర్ణయం తీసుకున్నాను. పారిశ్రామికవేత్త అవ్వాలనే నా ఆశయం సఫలమవ్వాలంటే తగిన పరిజ్ఞానం అవసరం. ఇందుకు సీఎంఏ, సీఏ కోర్సులు ఉపకరిస్తాయనేది నా ఆలోచన.
గుంటూరులో సీఏగా ప్రాక్టీసు చేస్తున్న మహావీర్‌ జైన్‌ మా నాన్న. అమ్మ రతన్‌దేవి గృహిణి. పదో తరగతి వరకూ గుంటూరు నల్లపాడులోని లయోలా పబ్లిక్‌ స్కూల్లో చదివాను. టెన్త్‌ (ఐసీఎస్‌ఈ)లో 600 మార్కులకు 556 వచ్చాయి. ఇంటర్లో ఎంఈసీ గ్రూపులో ఉండే ఎకనమిక్స్‌, కామర్స్‌ సబ్జెక్టులు సీఏ, సీఎంఏ చదవటానికి మంచి పునాదిని ఏర్పరుస్తాయి. అయితే నేను ఎంపీసీలో చేరాను. 975 మార్కులు తెచ్చుకున్నా. సీఏ, సీఎంఏ కోర్సులు చదవటానికి శిక్షణ తీసుకున్నాను. ఎంపీసీ తీసుకున్నా సబ్జెక్టులపరంగా నాకెలాంటి ఇబ్బందీ ఏర్పడలేదు. ఎందుకంటే సీఏ, సీఎంఏ ఫౌండేషన్‌ దశలు ఈ సబ్జెక్టులపై తగిన పరిజ్ఞానం చక్కగా కల్పిస్తాయి. అందుకని ఇంటర్లో ఎంఈసీ కాకుండా ఎంసీసీ తీసుకున్నప్పటికీ మీరు కామర్స్‌ కోర్సుల్లో చేరటానికి వెనుకాడనక్కర్లేదు.

కాన్సెప్టులే కీలకం
సీఎంఏ కోర్సులోని మూడు దశలూ ప్రాముఖ్యమున్నవే.  ప్రతి దశ అధ్యయనమూ తర్వాతి దశకు పునాదిని ఏర్పరుస్తుంది. అయితే ఇంటర్‌, ఫైనల్‌ దశల్లో చదివే కాన్సెప్టులకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. కోర్సు తర్వాత ప్రాక్టీస్‌/ఉద్యోగం మెరుగ్గా చేయటానికి  ఈ కాన్సెప్టుల పరిజ్ఞానం ఉపకరిస్తుంది.
* సీఎంఏ ఇంటర్‌ పరీక్షలో మంచి మార్కులు రావాలంటే ప్రాథమిక అంశాలపై పట్టు బాగా ఉండాలి.
* కాన్సెప్టులపై స్పష్టత పెంచుకోవడం ముఖ్యం. సన్నద్ధత కాన్సెప్ట్‌ ఓరియంటెడ్‌గా సాగించాలి.
* దీంతోపాటు పూర్వపు ప్రశ్నపత్రాలను విశ్లేషిస్తే వివిధ టాపిక్స్‌కు ఇస్తున్న ప్రాధాన్యం (మార్కుల వెయిటేజి) తెలుస్తుంది. సీఎంఏ ఇన్‌స్టిట్యూట్‌ వారు ప్రశ్నపత్రం తయారుచేసేటప్పుడు కచ్చితంగా ఈ వెయిటేజిని అనుసరిస్తారు.
* కష్టంగా తోచే సబ్జెక్టుల సాధన, థియరిటికల్‌ సబ్జెక్టుల పునశ్చరణను సరిగా చేస్తే మెరుగైన స్కోరు తథ్యం.

వాయిదా వేయొద్దు
పరీక్షలు దగ్గరకొచ్చేవరకూ థియరీ సబ్జెక్టుల ప్రిపరేషన్‌ను చాలామంది వాయిదా వేస్తుంటారు. ఇది పొరపాటు. ఈ సబ్జెక్టులు అంత ఆసక్తికరంగా అనిపించకపోవచ్చు. కానీ వాయిదా వేస్తూపోవటం సరికాదు. ఎందుకంటే ఏ దశలోనైనా అర్హత పొందాలంటే కనీసం 40 మార్కులు తెచ్చుకోవాల్సిందే.
* అగ్రిగేట్‌ మార్కుల మొత్తం పెరగాలంటే... కాన్సెప్టులను క్షుణ్ణంగా చదివి, ఎంత వీలైతే అంత ఎక్కువగా సాధన చెయ్యాలి.
* సమస్యలను సాధించే ప్రయత్నం చేయకుండా సొల్యూషన్లను కేవలం చదివేసి ఊరుకోకూడదు.
నా అనుభవంతో చెప్తున్నా. సీఎంఏ కష్టమైన కోర్సు ఏమీ కాదు. దీన్నీ, ఇతర కామర్స్‌ కోర్సులనూ చదవాలంటే శ్రమపడే తత్వం, పట్టుదల, సహనం ముఖ్యం. ఇవన్నీ ఉంటే సాధారణ విద్యార్థి కూడా ఈ కోర్సులను విజయవంతంగా పూర్తిచేయగలడు!

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని