కెరీర్‌ గైడెన్స్‌

Published : 22/07/2021 09:31 IST
సాయుధ బలగాల్లో పాతిక వేల పోస్టులు!

టెన్త్‌ అర్హతతో కానిస్టేబుల్‌ ఉద్యోగాలు

శిక్షణ విజయవంతంగా పూర్తిచేసుకుంటే కానిస్టేబుల్‌ హోదాతో విధుల్లో కొనసాగవచ్చు.  అనుభవంతో హెడ్‌ కానిస్టేబుల్, ఏఎస్సై స్థాయికి చేరుకోవచ్చు. అర్హత,  శాఖాపరమైన పరీక్షల ద్వారా ఎస్సై, ఆపై స్థాయికీ ఎంపిక కావచ్చు!  
పది పాసైతే చాలు.. కేంద్ర సాయుధ బలగాల్లో కొలువుదీరే అవకాశం!  కానిస్టేబుల్‌ జనరల్‌ డ్యూటీ పోస్టుల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ప్రకటన విడుదల చేసింది. వీటిని కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష, దేహదార్ఢ్య, శారీరక ప్రమాణ,   మెడికల్‌ టెస్టుల ద్వారా భర్తీ చేస్తారు. శిక్షణ అనంతరం విధుల్లోకి తీసుకుంటారు. ప్రతి విభాగంలోనూ మహిళల కోసం కొన్ని పోస్టులు కేటాయించారు. అన్ని అలవెన్సులూ కలుపుకుని వీరు నెలకు రూ.35 వేలకు పైగా వేతనం పొందవచ్చు. పదోన్నతులకూ అవకాశం ఉంది! 

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) కేంద్ర పోలీస్‌ బలగాలతోపాటు ఎన్‌ఐఏ, ఎస్‌ఎస్‌ఎఫ్, అస్సాం రైఫిల్స్‌లో జనరల్‌ డ్యూటీ- కానిస్టేబుల్, రైఫిల్‌మెన్‌ పోస్టుల భర్తీకి దాదాపు ఏటా నియామక ప్రకటన విడుదల చేస్తోంది. ఇందులో ఎంపికైనవారు ఆసక్తి, మెరిట్‌ ప్రకారం బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్‌), సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (సీఐఎస్‌ఎఫ్‌), సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (సీఆర్‌పీఎఫ్‌), సశస్త్ర సీమబల్‌ (ఎస్‌ఎస్‌బీ), ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ ఫోర్స్‌ (ఐటీబీపీ), నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (ఎన్‌ఐఏ), స్పెషల్‌ ఫ్రాంటియర్‌ ఫోర్స్‌ (ఎస్‌ఎఫ్‌ఎఫ్‌), అస్సాం రైఫిల్స్‌లో నచ్చిన విభాగంలో సేవలు అందించవచ్చు. ఏ విభాగానికి ఎంపికైనప్పటికీ వేతనం మాత్రం అందరికీ సమానమే. వీరు శిక్షణ అనంతరం విధుల్లోకి చేరి లెవెల్‌-3 మూలవేతనం రూ.21,700 పొందుతారు. దీనికి అదనంగా డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర ప్రోత్సాహకాలు ఉంటాయి. అనుభవంతో హెడ్‌ కానిస్టేబుల్, ఏఎస్సై స్థాయికి చేరుకోవచ్చు.శాఖాపరమైన పరీక్షల ద్వారా ఎస్సై, ఆపై స్థాయికీ ఎంపిక కావచ్చు. 

మొత్తం ఖాళీలు: 25271

విభాగాలవారీ ఖాళీలు: బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్‌)-7545, సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (సీఐఎస్‌ఎఫ్‌)-8464, సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (సీఆర్‌పీఎఫ్‌)-0, సశస్త్ర సీమబల్‌ (ఎస్‌ఎస్‌బీ)-3806, ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ (ఐటీబీపీ)-1431, అస్సాం రైఫిల్స్‌ (ఏఆర్‌)-3785, నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (ఎన్‌ఐఏ)-0, సెక్రటేరియట్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (ఎస్‌ఎస్‌ఎఫ్‌)-240.

అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత

వయసు: ఆగస్టు 1, 2021 నాటికి 18-23 ఏళ్ల మధ్య ఉండాలి. ఆగస్టు 2, 1998 కంటే ముందు; ఆగస్టు 1, 2003 తర్వాత జన్మించినవారు అనర్హులు. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయసులో సడలింపులు వర్తిస్తాయి. 
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 31
దరఖాస్తు ఫీజు: రూ.వంద. మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు ఫీజు మినహాయింపు. పరీక్ష తేదీ: తర్వాత ప్రకటిస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్‌. 
వెబ్‌సైట్‌: https://ssc.nic.in/

వీలైనన్ని మాక్‌ టెస్టులు

ముందుగా ఆబ్జెక్టివ్‌ పరీక్ష కోసమే సన్నద్ధం కావడం మంచిది. అది పూర్తయిన తర్వాత ఫిజికల్‌ టెస్టుపై దృష్టి సారించవచ్చు.

- నోటిఫికేషన్‌లో పేర్కొన్న సిలబస్‌ ప్రకారం సన్నద్ధత కొనసాగించాలి. 

- పాత, మాదిరి ప్రశ్నపత్రాలు పరిశీలించాలి. వీటిద్వారా ప్రశ్నలు ఏ విధంగా అడగవచ్చో తెలుస్తుంది. 

పరీక్షకు ముందు వీలైనన్ని మాక్‌ టెస్టులు రాయాలి. 

- వంద ప్రశ్నలకు 90 నిమిషాల వ్యవధి అంటే ప్రతి ప్రశ్నకు 54 సెకన్ల సమయం మాత్రమే లభిస్తున్నట్లు. 

-  మ్యాథ్స్, జనరల్‌ ఇంటలిజెన్స్, రీజనింగ్‌ ప్రశ్నలకు వేగంగా    జవాబులు గుర్తించడానికి ఎక్కువ మాదిరి ప్రశ్నలు సాధన చేయాలి. 

సూత్రాలు ఉపయోగించే విధానం తెలుసుకోవాలి. 

- షార్ట్‌ కట్‌ మెథడ్స్‌పై పట్టు సాధించాలి. 

పరీక్ష ఇలా 

జనరల్‌ ఇంటలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్, జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ జనరల్‌ అవేర్‌నెస్, ఎలిమెంటరీ మ్యాథమేటిక్స్, ఇంగ్లిష్‌/ హిందీ విభాగాల్లో ఒక్కో అంశం నుంచి 25 చొప్పున వంద ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది. 
ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్‌ తరహాలో ఉంటాయి. తప్పుగా గుర్తించిన జవాబుకు పావు మార్కు చొప్పున తగ్గిస్తారు. పదో తరగతి స్థాయిలోనే ప్రశ్నలుంటాయి. కనీసం 35 మార్కులు పొందినవారిని అర్హులుగా పరిగణిస్తారు. ఇలా  అర్హత మార్కులు పొందినవారి జాబితా నుంచి మెరిట్, రిజర్వేషన్ల ప్రకారం విభాగాల వారీ మొత్తం ఖాళీలకు 12 రెట్ల సంఖ్యలో అభ్యర్థులకు ఫిజికల్‌ టెస్టులు నిర్వహిస్తారు. 
పీఈటీ, పీఎస్‌టీ : పీఈటీలో భాగంగా పురుషులు 5 కి.మీ. దూరాన్ని 24 నిమిషాల్లో మహిళలు 1.6 కి.మీ. దూరాన్ని 8 1/2 నిమిషాల్లో పూర్తిచేయాలి. పురుషులు 170, మహిళలు 157 సెం.మీ. ఎత్తు ఉండాలి. ఎస్టీలకు మినహాయింపు ఉంది. పురుషులైతే 162.5 మహిళలు 150 సెం.మీ. ఉంటే సరిపోతుంది. పురుషుల ఛాతీ విస్తీర్ణం 80 సెం.మీ. (ఎస్టీలకు 76) తప్పనిసరి. ఊపిరి పీల్చినప్పుడు 5 సెం.మీ.పెరగాలి. అర్హత సాధించినవారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు. ఎంపికైతే శిక్షణకు తీసుకుంటారు. 
అభ్యర్థులు దరఖాస్తు నింపినప్పుడే సర్వీసులవారీగా తమ ప్రాధాన్యం తెలపాలి. తుదినియామకాలు పరీక్షలో సాధించిన మార్కుల మెరిట్, రాష్ట్రాలవారీ ఖాళీలు, రిజర్వేషన్ల ప్రకారం ఉంటాయి. శిక్షణ విజయవంతంగా పూర్తిచేసుకున్నవారు కానిస్టేబుల్‌ హోదాతో విధుల్లో కొనసాగవచ్చు.   

ప్రశ్నలడిగే అంశాలు

జనరల్‌ ఇంటలిజన్స్‌ అండ్‌ రీజనింగ్‌: నంబర్‌ ఎనాలజీ, పోలికలు, తేడాలు, పరిశీలనలు, సంబంధాలు నంబర్‌ క్లాసిఫికేషన్, ఫిగర్‌ ఎనాలజీ, నంబర్‌ సిరీస్, కోడింగ్‌ - డీకోడింగ్, వర్డ్‌ బిల్డింగ్‌...మొదలైన విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. గణితంలోని ప్రాథమికాంశాలపై పట్టు సాధించడం ద్వారా వీటికి సమాధానాలు గుర్తించవచ్చు. తర్కంతో ముడిపడే తేలిక ప్రశ్నలే ఉంటాయి.

జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ జనరల్‌ అవేర్‌నెస్‌: ఈ విభాగంలోని ప్రశ్నలకు సమాధానాలు గుర్తించడానికి ప్రత్యేక ప్రావీణ్యం అవసరం లేదు. సాధారణ పరిజ్ఞానంతోనే జవాబులు రాసేయవచ్చు. ఎక్కువ ప్రశ్నలు దైనందిన జీవితంతో ముడిపడే ఉంటాయి. పర్యావరణాంశాలకు ప్రాధాన్యం ఉంటుంది. రోజువారీ సంఘటనలే (వర్తమాన వ్యవహారాలు) ప్రశ్నలుగా వస్తాయి. వీటితోపాటు భారత్‌- పొరుగు దేశాలు, చరిత్ర, సంస్కృతి, భూగోళం, ఆర్థిక వ్యవహారాలు, పాలిటీ, సైన్స్‌ అంశాల నుంచీ ప్రశ్నలు ఉంటాయి. హైస్కూల్‌ సోషల్, సైన్స్‌ పాఠ్యపుస్తకాలు బాగా చదువుకుంటే సరిపోతుంది. వర్తమాన వ్యవహారాల ప్రశ్నలు ఎదుర్కోవడానికి జనవరి 2021 నుంచి ముఖ్యాంశాలను చదివి, మననం చేసుకుంటుండాలి.

ఎలిమెంటరీ మ్యాథమేటిక్స్‌: అంకెలతో ముడిపడే ప్రశ్నలే ఎక్కువగా అడుగుతారు. అంకెల మధ్య సంబంధం, శాతాలు, సగటు, భిన్నాలు, నిష్పత్తి, సరాసరి, లాభనష్టాలు, కాలం-పని, కాలం-దూరం, వడ్డీ, డిస్కౌంట్, కొలతలు, క.సా.గు., గ.సా.భా., వైశాల్యాలు, ఘనపరిమాణాలు మొదలైన అంశాల్లో ప్రశ్నలు వస్తాయి. వీటిలో దాదాపు అన్ని అంశాలూ హైస్కూల్‌ మ్యాథ్స్‌ పుస్తకాల్లోనివే. వాటిని బాగా చదువుకుని వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేస్తే సరిపోతుంది.

* జనరల్‌ ఇంగ్లిష్‌: అభ్యర్థి ప్రాథమిక ఆంగ్ల పరిజ్ఞానాన్ని పరిశీలించేలా ప్రశ్నలు వస్తాయి. ఖాళీలు పూరించడం, వ్యాక్యంలో తప్పును గుర్తించడం, సమానార్థాలు, వ్యతిరేక పదాలు, తప్పుగా ఉన్న పదాన్ని గుర్తించడం, జాతీయాలు, సామెతలు, ప్రత్యక్ష, పరోక్ష వాక్యాలుగా మార్చడం, వాక్యంలో పదాలను క్రమ పద్ధతిలో అమర్చడం, కాంప్రహెన్షన్‌..తదితర విభాగాల్లో ప్రశ్నలు వస్తాయి. హైస్కూల్‌ స్థాయి ఆంగ్ల పాఠ్యపుస్తకాల్లోని వ్యాకరణాంశాలు బాగా చదువుకుంటే అధిక మార్కుల సాధన కష్టమేమీ కాదు.  

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని