అంతరిక్ష రంగంలో ఉద్యోగం చేయాలనే ఆసక్తీ, అభిరుచీ మీకున్నాయా? అయితే సాంకేతికంగా అన్ని రంగాల విజ్ఞానం పెంపొందించుకుంటూ ఎదగొచ్చు. ఆకర్షణీయమైన భవిష్యత్తు ఉన్న ‘ఏవియానిక్స్’ ఇంజినీరింగ్ మీలాంటి వారికి మంచి ఎంపిక!
ఆకాశయానం అంటే ముందుగా గుర్తుకు వచ్చేది- తెల్లటి యూనిఫామ్, తలపై తెల్లని టోపీ ధరించి ఠీవిగా కాక్‌పిట్‌ను స్వాధీనంలోకి తీసుకుని విమానాన్ని గగనతలంలోకి దూసుకువెళ్లేలా చేసే పైలట్. ప్రయాణికులను సుదూర గమ్యాలకు క్షేమంగా చేర్చే విధిని పైలట్ సక్రమంగా నిర్వర్తించాలంటే ఆ విమానంలోని ఎలక్ట్రానిక్ కంట్రోల్ వ్యవస్థ, విద్యుత్ వ్యవస్థ సమర్థŸంగా పనిచెయ్యాలి. ఈ వ్యవస్థల నిర్మాణ, నిర్వహణ, నియంత్రణ బాధ్యతలు చేపట్టేవారే ఏవియానిక్స్ ఇంజినీర్లు!
విమానాలే కాదు, ఏరోస్పేస్ రంగానికి సంబంధించి పౌరయాన విమానాలు, యుద్ధ విమానాలు, క్షిపణులు, హెలికాప్టర్లు, ఉపగ్రహాలు, రాకెట్లు, ఆధునిక నౌకల్లో ఉపయోగించే- రహస్యంగా పనిచేసే భూపరిశీలన వ్యవస్థలు, డ్రోన్ లాంటి అత్యాధునిక యంత్రాల ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ వ్యవస్థలతో పాటు వీటి కంప్యూటర్ ఆధారిత నియంత్రణల బాధ్యత కూడా వీరిదే. ఈ యంత్రాల సమగ్ర కమ్యూనికేషన్ వ్యవస్థ వీరి అజమాయిషీలోకి వస్తుంది.
ఇదివరకు ఏరోనాటికల్ ఇంజినీరింగ్‌లో అంతర్భాగంగా ఉండి ప్రత్యేక శాఖగా రూపుదిద్దుకుని ఏవియేషన్లోని ఏవియా, ఎలక్ట్రానిక్స్‌లోని ‘నిక్స్’ కలిపి ఏర్పడిందే ఈ ఏవియానిక్స్. గగనతలంలో, భూగర్భాల్లో పనిచేసే అధునాతన యంత్ర, క్షిపణులకు అవసరమైన ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ వ్యవస్థల నిర్మాణం, అభివృద్ధి, పరీక్ష, నిర్వహణ, మరమ్మత్తులపై ఈ నాలుగేళ్ళ ఇంజినీరింగ్ (ఏవియానిక్స్) ప్రత్యేక దృష్టి సారిస్తుంది.
ఏవియేషన్లోని ఏవియా, ఎలక్ట్రానిక్స్‌లోని ‘నిక్స్’ కలిపి ఏర్పడిందే- ఏవియానిక్స్.
ఉద్యోగ అవకాశాలు
ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులతో పురోగతి సాధిస్తున్న మనదేశంలో ఎన్నో కొత్త విమానాశ్రయాల నిర్మాణ ప్రణాళికల అమలు, ఇతర దేశాలకు మనదేశం అభివృద్ధి చేసిన అత్యాధునిక క్షిపణులను విక్రయించాలని తీసుకున్న నిర్ణయాల ఫలితంగా ఏవియానిక్స్ రంగంలో ఉద్యోగావకాశాలు పెరుగుతున్నాయి. బీటెక్ ముగించినవారికి ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల సంస్థల్లో ఉద్యోగాలు లభిస్తాయి. ప్రభుత్వ రంగ సంస్థల విషయానికి వస్తే ఇస్రో, హిందుస్తాన్ ఏరోనాటిక్స్, ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ, ఏర్పోర్ట్స్ అథారిటీ, హెలికాప్టర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఏరోనాటికల్, ఏరోస్పేస్, ఏవియానిక్స్ కోర్సులు ఉన్న ఐఐటీల్లో ప్రాజెక్ట్ అసోసియేట్లు, ఇండియన్ ఏర్‌ఫోర్స్, నౌకాదళం, డీ…ఆర్డీఓ, రక్షణ శాఖకు చెందిన సంస్థల్లో ప్రవేశం, ప్రవర ఏవియేషన్, నేషనల్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లాంటి సంస్థల్లో ఉద్యోగాలకు అవకాశం ఉంది. ప్రైవేటు రంగంలో అన్ని ఏర్‌లైన్ సంస్థల్లో ఎన్నో అవకాశాలు లభిస్తాయి. హెచ్‌సీఎల్, టాటా, హనీవెల్, కాగ్నిజెంట్, బాష్, ఐబీఎం లాంటి సంస్థలు వాటిలో కొన్ని.
కోర్సులో ఏ పాఠ్యాంశాలు?