నైపుణ్యాలు

Published : 28/11/2019 01:56 IST
అడ్డంకి కాదు.. ఆటోమేషన్‌!

నేర్చుకోండి.. నయా స్కిల్స్‌

ఆటోమేషన్‌ అందరిలోనూ ఆందోళన పెంచుతోంది. ఉన్న ఉద్యోగం ఉంటుందా.. ఊడుతుందా అనే భయాన్ని కల్పిస్తోంది. మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా సిద్ధమవుతున్నామా లేదా అనే సందేహం విద్యార్థులనూ వేధిస్తోంది. కానీ నయా ధోరణులకు తగినట్లుగా మారాలనే స్పష్టతతో నవతరం ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. కొలువులకు సవాళ్లు విసురుతున్న యాంత్రికీకరణతో ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా చూసుకోవాలంటే కొత్త కొత్త కోర్సులతోపాటు సాఫ్ట్‌స్కిల్స్‌పైనా శ్రద్ధ పెట్టాలి. అందుకోసం అయిదు అంశాలపై ప్రధానంగా దృష్టి సారించాలి.

నిన్న మొన్నటిదాకా... డిగ్రీ పూర్తి చేసుకుని పట్టా చేతికి వచ్చిన తర్వాత.. చదివిన కోర్సుకు సంబంధించిన కొలువులో చేరేవారు. పనికి సంబంధించిన శిక్షణను సంస్థలే ఇప్పించేవి. అంతే.. నలభై ఏళ్లపాటు దాదాపు ఒకే సంస్థలో... ఒకే ఉద్యోగంలో.. పదవీ విరమణ వరకు జీవితం సాగిపోయేది. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఆధునిక సాంకేతికత, ఆటోమేషన్‌లు పాత పద్ధతులకు తెరదించి కొత్త విధానాలను అలవాటు చేస్తున్నాయి. దీంతో పెరుగుతున్న పోటీలో నిలబడాలంటే యువత ఆలోచనా తీరును మార్చుకోవాల్సిన అవసరం ఉందని కొన్ని సర్వేలు చెబుతున్నాయి.

టెక్నాలజీ, ఆటోమేషన్‌, గ్లోబలైజేషన్‌, రకరకాల రాజకీయ పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా విద్య, ఉద్యోగాలపై ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థుల ధోరణిని తెలుసుకోవడానికి పియర్సన్‌ సంస్థ భారత్‌ సహా 19 దేశాల్లో సర్వేను నిర్వహించింది. మొత్తం 11,000 మంది ఇందులో పాల్గొన్నారు. విద్యావ్యవస్థ నాణ్యత, కెరియర్‌- భవిష్యత్‌ ఉద్యోగాలు, సాంకేతికతకు సంబంధించిన అంశాలపై ఈ సర్వే సాగింది. దీని ప్రకారం ఉద్యోగ పోటీలో నిలబడాలంటే అభ్యర్థులు తమ ఆలోచనా విధానం తాజా ధోరణులకు అనుగుణంగా సాగుతోందా లేదా అని చూసుకోవాలి. అవసరమైన మార్పులు చేసుకోవాలి.

ముందే దృష్టి పెట్టాలి

ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌, మెషీన్‌ లర్నింగ్‌ తదితర టెక్నాలజీల వల్ల కొన్ని రకాల ఉద్యోగాలు ఇక ముందు ఉండవు. కానీ అదే సమయంలో కొత్త కొలువులు పుట్టుకొస్తాయి. వాటిని అందుకోవాలంటే తప్పనిసరిగా నైపుణ్యాలు పెంచుకోవాలి.

ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవుతూ భవిష్యత్తుకు తగినట్లుగా అభ్యర్థులు తమను తాము మలుచుకోవాలి.

ఇంటర్‌నెట్‌ ఇప్పుడు కొత్తతరం క్లాస్‌రూమ్‌గా మారిపోయింది. సంప్రదాయ పద్ధతులను దాటి దాన్ని ఉపయోగించుకోవడం తెలుసుకోవాలి.

ఆటోమేషన్‌ అభ్యర్థుల ఎదుగుదలకి అడ్డంకిగా మారకూడదు అంటే సాఫ్ట్‌స్కిల్స్‌ నేర్చుకోవాలి.

అవసరం వచ్చిన తర్వాత నైపుణ్యాలు పెంచుకోవడం కంటే ముందే వాటిపై దృష్టిపెట్టడం మంచిది.

డీఐవై (డూ ఇట్‌ యువర్‌సెల్ఫ్‌)

సొంతంగా చేయడం ద్వారా నేర్చుకోవడం.. ప్రపంచవ్యాప్తంగా విద్యా విధాన ముఖచిత్రాన్ని మార్చేస్తోంది. ఫలానా కోర్సుకే పరిమితమై, దానికి సంబంధించిన ఉద్యోగంలోనే చేరడం ఇప్పుడు కుదరదు. మార్కెట్‌ అవసరాల ప్రకారం సంప్రదాయ విద్యకు ప్రాధాన్యాన్నిస్తూనే ఒకేషనల్‌, ట్రేడ్‌ ట్రెయినింగ్‌ వంటి ప్రత్యామ్నాయ అంశాలపైనా దృష్టిపెట్టాలి. అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఏమేమి అవసరమో స్వయంగా తెలుసుకుని, తగినట్లుగా సిద్ధం కావాలి. బోధన ద్వారానే కాకుండా స్వయంగా నేర్చుకోవడానికీ ప్రయత్నించాలి. అందుకు తోడ్పాటును అందించే ఎన్నో షార్ట్‌టర్మ్‌ కోర్సులు, బూట్‌క్యాంప్‌లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.

కెరియర్‌ కాదు.. కెరియర్లు!


భవిష్యత్తులో సంప్రదాయ ఉద్యోగాలు ఉండకపోవచ్ఛు నలభై ఏళ్లపాటు ఉండే ఒకే కెరియర్‌ విధానం కనుమరుగైపోతోంది.అభ్యర్థులు వివిధ విభాగాలు, కెరియర్లపై అవగాహన, నైపుణ్యాలు పెంపొందించుకోవాల్సి వస్తోంది. చాలామంది వేటికి ఆదరణ ఉంటోందో వాటిని నేర్చుకోవడం మొదలు పెట్టారు. దీన్నే ‘బైట్‌ సైజ్‌డ్‌ లర్నింగ్‌’ అంటారు. ఈ ధోరణికి ప్రపంచవ్యాప్తంగా సమ్మతి లభిస్తోంది. ఒక చోట విఫలమైనా.. అవకాశాలు లేకపోయినా వేరే ఉద్యోగంలో ఇమిడిపోయే నైపుణ్యాలను పెంచుకోవాలి. ఒక్క కెరియర్‌ను నమ్ముకోవడం కాదు.. రకరకాల కెరియర్లకు అవసరమైన స్కిల్స్‌తో సిద్ధంగా ఉండాలి. ఇదే నయా ధోరణి.

డిజిటల్‌, వర్చువల్‌ లర్నింగ్‌

ప్రతి రంగంలోకి, ప్రతి పనిలోకి టెక్నాలజీ ప్రవేశించింది. రోజువారీ కార్యకలాపాల్లోకీ ఇది చొచ్చుకుపోతోంది. విద్యా రంగమూ ఇందుకు మినహాయింపు కాదు. వచ్చే దశాబ్దంలో పూర్తిగా డిజిటల్‌, వర్చువల్‌ లర్నింగ్‌కే ప్రాధాన్యం ఉంటుంది. ఇప్పటికే ఎన్నో ఆన్‌లైన్‌ డిగ్రీలు అందుబాటులోకి వచ్చాయి. ఏఐ టూల్స్‌, స్మార్ట్‌ డివైజ్‌లూ కూర్చున్న చోటే ఉండి నేర్చుకునే అవకాశం కల్పిస్తున్నాయి. తరగతి బోధనలపైనే ఆధారపడకుండా ఆధునిక లర్నింగ్‌ విధానాలపై, టెక్నాలజీ వినియోగంపై అవగాహన పెంచుకోవాలి.

అప్‌స్కిల్లింగ్‌

చదువు పూర్తికాగానే ఉద్యోగం సంపాదించుకోవడానికి, చాలామంది నైపుణ్యాలు పెంచుకోవడానికి సంబంధిత కోర్సులు చేస్తుంటారు. ఉద్యోగం వచ్చిన తర్వాత చదవడం, నేర్చుకోవడాలకు స్వస్తి చెప్పేస్తుంటారు. కోర్సు నిర్ణయించుకొని కళాశాలలోకి అడుగు పెట్టగానే కెరియర్‌పై కొంత అవగాహన వస్తుంది. అందులోనే ఒక్కోసారి వ్యక్తిగతంగా కొన్ని ప్రత్యేకమైన ఆసక్తులు ఉండవచ్ఛు వాటిని గమనించి, వాటికి సంబంధించిన కొత్త కొత్త అంశాలను తెలుసుకోవాలి. అవసరమైన నైపుణ్యాలను కోర్సుల ద్వారా పెంచుకోవాలి. దీన్నే అప్‌స్కిల్లింగ్‌ అంటారు. ‘అవసరమైనప్పుడు నేర్చుకుందాం’ అనే ధోరణిని విడిచిపెట్టి నవీన నైపుణ్యాలను అందుకోవాలి.

సాఫ్ట్‌స్కిల్స్‌

ఆటోమేషన్‌ వల్ల కొన్ని కొలువుల్లో ఉన్నవారికి అభద్రతా భావం ఏర్పడుతోంది. వ్యక్తులకే కాదు.. యంత్రాలకూ పరిమితులు ఉంటాయి. వేగంలోనూ, ఉత్పత్తి పరిమాణంలోనూ మరలతో మనుషులు పోటీ పడలేకపోవచ్ఛు కానీ క్రిటికల్‌ థింకింగ్‌, ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌, క్రియేటివిటీ వంటి నైపుణ్యాలను అందిపుచ్చుకోవడం రోబోలకు సాధ్యం కాదు. ప్రస్తుతానికి వ్యక్తులు మాత్రమే ప్రదర్శించగలిగిన సాఫ్ట్‌స్కిల్స్‌ అవి. స్టెమ్‌ (సైన్స్‌, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, మేథమేటిక్స్‌) నైపుణ్యాలు ఎంత అవసరమో అవీ అంతే ముఖ్యం. అందుకే చదువుతున్న కోర్సులతోపాటు సాఫ్ట్‌స్కిల్స్‌ నేర్చుకోవడంపై దృష్టిపెడితే ఆటోమేషన్‌ ఇబ్బందులను అవలీలగా దాటవచ్ఛు.

దరఖాస్తు చేశారా?

ఇండియన్‌ నేవీలో మెట్రిక్‌ రిక్రూట్‌ సెయిలర్లు

అర్హత: పదోతరగతి ఉత్తీర్ణత. నిర్దేశించిన శారీరక ప్రమాణాలు తప్పనిసరి. చివరితేది: నవంబరు 28.

యూపీఎస్సీ- 143 ఖాళీలు

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో లా డిగ్రీ, ఎంబీబీఎస్‌ డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం. చివరితేది: నవంబరు 28.

షార్‌లో టెక్నీషియన్లు

అర్హత: పదోతరగతి, సంబంధిత విభాగాల్లో ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు ఎన్‌సీవీటీ సర్టిఫికెట్‌. చివరితేది: నవంబరు 29.

హెచ్‌డబ్ల్యూసీ-ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీలు

అర్హత: బీఎస్సీ(నర్సింగ్‌) ఉత్తీర్ణత. చివరితేది: నవంబరు 29.

ఎన్‌టీపీసీలో మైన్‌ ఓవర్‌మెన్‌, ఇతర పోస్టులు

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా(ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణత, టెక్నికల్‌ సర్టిఫికెట్లు, అనుభవం. చివరితేది: నవంబరు 30.

డబ్ల్యూసీడీ, చిత్తూరులో 489 ఖాళీలు

అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత. చివరితేది: నవంబరు 30.

ఈసీఐఎల్‌లో టెక్నికల్‌ ఆఫీసర్లు

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం. చివరితేది: నవంబరు 30.

 

 

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని