close

Updated : 12/02/2021 20:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ప్రై‘వేటు’పై విమర్శలొస్తున్నా పట్టుదల ఎందుకు?

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రైవేటు సంస్థలతో పోటాపోటీగా లాభాలు గడించే ప్రభుత్వరంగ సంస్థలతో ఎలాంటి ఇబ్బందీ ఉండదు. ఎప్పుడైతే ఓ ప్రభుత్వరంగ సంస్థ నష్టాల్లో కూరుకుపోతుందో అప్పుడే కేంద్ర ప్రభుత్వం వీటిపై దృష్టిసారిస్తుంది. ప్రైవేటుపరం చేయడమో లేదా షేర్లను విక్రయించడం ద్వారా భారం దించుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో ఎన్నో సమస్యలు, సవాళ్లు ఎదురవుతాయి. ఎయిరిండియా విషయంలో అది ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం. అయితే ఈ ఏడాది బడ్జెట్‌ ప్రవేశపెట్టే సమయంలో కేంద్రం చెప్పిన మాటలు గమనిస్తే.. లాభాలు తెచ్చిపెడుతున్న వాటినీ ప్రైవేటుపరం చేయాలన్న ఆలోచనతో ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. అసలు కేంద్రం ఎందుకీ నిర్ణయం తీసుకుంది? ఈ విషయంలో ఎన్నో విమర్శలు వస్తున్నా ఎందుకంత పట్టుదలతో ఉంది? 

ప్రైవేటీకరణతో సంస్కరణలు తీసుకొస్తామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. కానీ ఆయా సంస్థల నిర్వహణ బాధ్యతల నుంచి నెమ్మదిగా తప్పించుకుంటోందని అర్థం చేసుకోవాలి. మోదీ సర్కారు ఎప్పుడైతే పీఎస్‌యూల ప్రైవేటీకరణ అని చెప్పిందో అప్పటి నుంచి ఇలాంటి వాదనలు, విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ విషయంలో ముందుగా కేంద్రం వాదన తీసుకుంటే ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించడం ద్వారా పెట్టుబడుల కోసం ఆయా కంపెనీలు కష్టాలు పడాల్సిన పనిలేదు. ఏ సంస్థ అయితే ఆ నిర్వహణ బాధ్యతలు తీసుకుంటుందో ఆ సంస్థే అన్ని పనులు చూసుకుంటుంది. పీఎస్‌యూలను విక్రయించడం ద్వారా వచ్చే నిధులను మౌలిక వసతుల కల్పనకు, ఆరోగ్యం, విద్య లాంటి కీలక రంగాలకు ఖర్చు చేయాలన్నది కేంద్రం ఆలోచనగా తెలుస్తోంది. 

అంతుపట్టని విషయమదే..!
కేంద్రం వివరణ బాగానే ఉన్నా లాభాలు గడిస్తున్న సంస్థలను కూడా ప్రైవేటుపరం చేయాలని చూడటమే అంతుపట్టని విషయం. ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తేది కూడా ఇందుకే. ఇందులో మొదటగా ప్రస్తావించాల్సింది ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ ఉక్కు కర్మాగారం గురించే. నవరత్న సంస్థగా ఖ్యాతి గడించి 2002-15 మధ్య కాలంలో లాభాల బాటలో నడిచింది ఈ సంస్థ. ఇప్పటివరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వివిధ రూపాల్లో రూ.42 వేల కోట్ల ఆదాయాన్ని అందించింది. సొంతంగా ఖనిజ క్షేత్రాలు ఉన్న పరిశ్రమలే ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నాయి. అలాంటిది విశాఖ ఉక్కు కర్మాగారానికి ఎన్ని సమస్యలు ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. సర్కారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు, ప్రభుత్వ కర్మాగారాల నుంచే ఉక్కును సేకరించాలని 2017 మే నెలలో మోదీ ప్రభుత్వమే నిర్ణయించింది. అదే ప్రభుత్వం ఇప్పుడు నవరత్నను ప్రైవేటీకరించడం ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోంది. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటుపరం చేస్తే సొంతంగా ఇనుప ఖనిజ క్ష్రేత్రాలున్న ఉక్కు పరిశ్రమలు కుమ్మక్కై ధరలు పెంచుతాయన్న ఆందోళన రేకెత్తుతోంది.

బలంగా ఉన్న సంస్థల్లోకి ఎఫ్‌డీఐలా?
ప్రపంచంలోనే అతిపెద్ద బీమా సంస్థ ఎల్‌ఐసీ. దాదాపు 40 కోట్ల మంది ప్రజలు ఇందులో బీమా చేశారని గణాంకాలు చెబుతున్నాయి. లక్షల మంది ప్రజలకు, ఉద్యోగులకు, ఏజెంట్లకు, అభివృద్ధి సిబ్బందికి పెద్దమొత్తంలో ఉపాధి కల్పిస్తున్న సంస్థ ఎల్‌ఐసీ. దేశంలో ఎల్‌ఐసీ అంటే బీమాకు పర్యాయపదంగా మారింది. ఇంతటి బీమా దిగ్గజ సంస్థలోనూ ప్రైవేటుకు అవకాశం ఇవ్వాలని కేంద్రం నిర్ణయించడం ఆందోళనకు మరో కారణం. సంస్థలో దశల వారీగా కొంత వాటాలు విక్రయించాలని కేంద్రం నిర్ణయించింది. తద్వారా భారీగా నిధులు సమకూర్చుకోవచ్చని చూస్తోంది. గతేడాదే ఈ ప్రతిపాదన తీసుకొచ్చినా కరోనా ఉద్ధృతి, మార్కెట్లు నిరుత్సాహకరంగా ఉండటం వల్ల అది వాయిదా పడింది. బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను 49 శాతం నుంచి 74 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించింది కేంద్రం. ఆర్థికంగా బలంగా ఉన్న సంస్థలోకి ఎఫ్‌డీఐల వెల్లువను తీసుకురావడం ఎందుకన్నదే ప్రధాన ప్రశ్న. అంటే క్రమంగా ఎల్‌ఐసీని విదేశీ సంస్థలకు విక్రయించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆ సంస్థ ప్రతినిధులు.

గతేడాది బీపీసీఎల్‌, ఐడీబీఐ బ్యాంకు, కాంకర్‌, షిప్పింగ్‌ కార్పొరేషన్‌, డీఈఎంఎల్‌ సంస్థలను విక్రయించేందుకు కేంద్రం ముందుకొచ్చింది. ఆయా సంస్థల ఉద్యోగులు ఇప్పటికీ ఈ విషయంపై ఆందోళన వ్యక్తంచేస్తూనే ఉన్నారు. కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయించేందుకు పీఎస్‌యూ నిబంధనల్ని కేంద్రం మార్చివేస్తోందన్న విమర్శలూ ఉన్నాయి. తద్వారా కార్పొరేట్‌ శక్తుల చేతుల్లోకి తేలిగ్గా విడిచిపెట్టేందుకు బాటలు పరుస్తుందంటున్నారు పలువురు నిపుణులు. దేశీయ పరిశ్రమల్లో దిగ్గజంగా నిలిచిన బీహెచ్‌ఈఎల్‌నూ ప్రైవేటుపరం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న విమర్శలూ లేకపోలేదు. అదే జరిగితే, భారీ విద్యుత్‌ పరికరాల తయారీలో దిగ్గజంగా కొనసాగుతున్న ఆ సంస్థ విజయ ప్రస్థానం ముగింపు దశకు చేరుకున్నట్టే అంటున్నారు ఉద్యోగులు.

సమాంతరంతో ఆర్థిక అంతరాలు తగ్గుతాయ్‌..
నష్టాల్లో ఉన్న సంస్థల్లో వాటా అమ్మి ప్రభుత్వంపై భారం తగ్గించుకుంటే అర్థం ఉంది. కానీ లాభాలు ఇచ్చే సంస్థలనూ అమ్మేస్తుండటమే కలవరపరిచే విషయం. ఇది దీర్ఘకాలంలో దేశానికి నష్టంచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ప్రైవేటు యాజమాన్యాలు సాధారణంగా లాభాలను మాత్రమే చూస్తాయి. సామాజిక బాధ్యత వాటికి పట్టదు. ఫలితంగా గిరాకీ, సరఫరా సూత్రానికే కట్టుబడి ఉంటారు. ప్రజావసరాలు అన్న విషయాన్ని మాత్రం పట్టించుకోరన్న వాదన వినిపిస్తోంది.  తామెన్నో సంస్కరణలు తీసుకొచ్చినట్టు ప్రతి ప్రభుత్వమూ చెబుతుంది. అయితే, ఆయా మార్పులతో ఎలాంటి ఫలితాలు సాధించారు? ఎంతమేర ఆర్థిక వ్యవస్థకు ఉపకరించాయన్నది స్పష్టంగా వెల్లడించదు. ఈ విషయంలో మోదీ సర్కార్‌పైనా విమర్శలు వస్తున్నాయి. సాధారణంగా ప్రభుత్వరంగ సంస్థల షేర్లు విక్రయించే సమయంలో ఆర్థికమంత్రులు ప్రైవేటీకరణ అనే పదం వాడకుండా అందుకు బదులుగా నిధుల ఉపసంహరణ అని వివరిస్తుంటారన్న వాదనా ఉంది. ఇప్పుడు మోదీ సర్కార్‌ కూడా అదే చేస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దేశంలో ఆర్థిక అంతరాలు తగ్గించాలంటే ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు సమాంతరంగా నడవాలన్నది ఆర్థిక నిపుణులు చెప్పే మాట. అయితే, ఇప్పుడు ప్రభుత్వరంగ పాత్ర తగ్గింది. ఇలాగే కొనసాగితే ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లడంతో పాటు దేశాన్ని ప్రైవేటు రంగం శాసించే స్థాయికి చేరుకుంటుంది.

ఇదీ చదవండి..

ప్రై‘వేటు’ బాట! 


 

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని