జులైలో కొత్త సభ్యులు 13.21 లక్షలు: ఈఎస్‌ఐసీ
close

Published : 25/09/2021 02:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జులైలో కొత్త సభ్యులు 13.21 లక్షలు: ఈఎస్‌ఐసీ

దిల్లీ: ఈ ఏడాది జులైలో కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎస్‌ఐసీ) సామాజిక భద్రతా పథకంలో దాదాపు 13.21 లక్షల మంది సభ్యులు చేరారు. ఏప్రిలో ఈ సంఖ్య 10.72 లక్షలుగా, మేలో 8.87 లక్షలు, జూన్‌లో 10.58 లక్షలుగా ఉంది.  తాజా గణాంకాలను జాతీయ గణక సంస్థ (ఎన్‌ఎస్‌ఓ) విడుదల చేసింది. 2018-19లో కొత్త చందాదార్లు 1.49 కోట్లు కాగా, 2019-20లో 1.51 కోట్లు నమోదయ్యారు.  2020-21లో కరోనా సంక్షోభం కారణంగా చేరికలు 1.15 కోట్లకు పరిమితమయ్యాయి. 2017 సెప్టెంబరు నుంచి 2021 జులై మధ్య చేరిన కొత్త చందాదారుల సంఖ్య 5.42 కోట్లుగా నమోదైంది. ఈఎస్‌ఐసీ నిర్వహించే పలు పథకాలు, ఈపీఎఫ్‌ఓ, పీఎఫ్‌ఆర్‌డీఏలో చేరిన కొత్త చందాదారుల ఆధారంగా ఎన్‌ఎస్‌ఓ నివేదిక రూపొందించింది. ఈ మూడు సంస్థలు 2018 ఏప్రిల్‌ నుంచి కొత్త చందాదారుల గణాంకాలను విడుదల చేస్తున్నాయి. సంఘటిత రంగాల్లో నూతన ఉద్యోగాలను ఇవి ప్రతిబింబిస్తుంటాయి. జూన్‌లో ఈపీఎఫ్‌ఓలో 11.16 లక్షల మంది, జులైలో 14.65 లక్షల మంది కొత్త ఉద్యోగులు చేరారు. 2017 సెప్టెంబరు నుంచి 2021 జులై మధ్య దాదాపు 4.51 కోట్ల మంది ఈపీఎఫ్‌ఓ చందాదారులుగా మారారు.


బీర్ల విక్రయాలు, సరఫరాలో కుమ్మక్కు
యూబీఎల్‌, కార్ల్స్‌బర్గ్‌, ఏఐబీఏలపై రూ.873 కోట్ల జరిమానా: సీసీఐ

దిల్లీ: బీర్ల విక్రయాలు, సరఫరాలో కుమ్మక్కయ్యాయని తేలడంతో యునైటెడ్‌ బ్రూవరీస్‌, కార్ల్స్‌బర్గ్‌, ఆల్‌ ఇండియా బ్రూవరీస్‌ అసోసియేషన్‌ (ఏఐబీఏ)తో పాటు మరో 11 మంది వ్యక్తులపై రూ.873 కోట్ల జరిమానాను కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) విధించింది. భవిష్యత్‌లో ఇటువంటి పనులకు పాల్పడవద్దని, పోటీ నిబంధనలను ఉల్లంఘించవద్దని పేర్కొంది. విచారణకు ఆదేశించిన నాలుగేళ్ల తర్వాత సీసీఐ ఈ ఆదేశాలను జారీ చేయడం గమనార్హం. యునైటెడ్‌ బ్రూవరీస్‌, ఎస్‌ఏబీ మిల్లర్‌ (ప్రస్తుతం ఏబీ ఇన్‌బేవ్‌గా పేరు మారింది), కార్ల్స్‌బర్గ్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌, మరికొన్ని సంస్థలకు ఈ ఆదేశాలను సీసీఐ జారీ చేసింది. ఏబీ ఇన్‌బేవ్‌కు ఎలాంటి జరిమానాను విధించలేదు. యూబీఎల్‌కు రూ.752 కోట్లు, కార్ల్స్‌బర్గ్‌కు రూ.121 కోట్ల జరిమానా వేసింది. ఏఐబీఏ, మరికొంత మంది వ్యక్తులకు రూ.6.25 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. 2009 నుంచి 2018 అక్టోబరు 10 మధ్య జరిగిన కుమ్మక్కు వ్యవహారంపై ఈ ఆదేశాలను సీసీఐ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్‌, పశ్చిమ బెంగాల్‌, దిల్లీ, పుదుచ్చేరిలలో ఈ తరహా కార్యకలాపాలకు బీర్ల కంపెనీలు పాల్పడ్డాయని దర్యాప్తులో తేలింది.


రూ.200 కోట్లు సమీకరించిన ప్రీమియర్‌ ఎనర్జీస్‌

ఈనాడు, హైదరాబాద్‌: సౌర విద్యుత్‌ పరికరాలను తయారు చేసే హైదరాబాదీ సంస్థ ప్రీమియర్‌ ఎనర్జీస్‌ రూ.200 కోట్ల పెట్టుబడులు సమీకరించింది. జీఈఎఫ్‌ క్యాపిటల్‌ ప్రైవేట్‌ ఈక్విటీ రూపంలో దీన్ని సమకూర్చింది. ఈ మొత్తాన్ని సోలార్‌ పీవీ సెల్‌, మాడ్యూళ్ల తయారీ సామర్థ్యం పెంచుకునేందుకు వినియోగిస్తామని ప్రీమియర్‌ ఎనర్జీస్‌ ఒక ప్రకటనలో తెలిపింది. రాబోయే రెండేళ్లలో రూ.1,200 కోట్లతో విస్తరణ ప్రణాళికలు చేపడుతున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు, మేనేజింగ్‌ డైరెక్టర్‌ చిరంజీవ్‌ సలుజా తెలిపారు. ఇందులో భాగంగా పెట్టుబడులను సమీకరిస్తున్నట్లు వెల్లడించారు. జులైలో ఈ సంస్థ హైదరాబాద్‌ ఇ-సిటీలో కొత్త ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించింది.


పీఎల్‌ఐ పథకంలోకి ప్రీ-అప్రూవ్డ్‌ ఏఏటీ వాహనాలు, విడిభాగాలు

దిల్లీ: వాహన రంగానికి ప్రకటించిన రూ.25,938 కోట్ల ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహకాల (పీఎల్‌ఐ) పథకం ప్రీ-అప్రూవ్డ్‌ అడ్వాన్స్‌డ్‌ ఆటోమోటివ్‌ టెక్నాలజీ (ఏఏటీ) వాహనాలు, అన్ని వాహనాల విడిభాగాలు తయారు చేసే సంస్థలు ప్రయోజనం పొందొచ్చని భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. మిలిటరీ వినియోగానికి వాడే వాహనాలతో పాటు మొత్తం వాహన రంగ పీఎల్‌ఐ పథకానికి సంబంధించి ఈ నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఈ పథకానికి దరఖాస్తు చేసుకుని అనుమతులు పొందిన సంస్థ వరుసగా అయిదు ఆర్థిక సంవత్సరాల పాటు ప్రయోజనాలు పొందొచ్చు. ప్రీ-అప్రూవ్డ్‌ ఏఏటీ వాహనాలు, ప్రీ-అప్రూవ్డ్‌ ఏఏటీ విడిభాగాలు, సీకేడీ/ఎస్‌కేడీ కిట్లు, ద్విచక్ర, త్రిచక్ర, ప్రయాణికుల, వాణిజ్య వాహనాలు, ట్రాక్టర్లు, మిలిటరీ వాహనాలు తయారుచేసే సంస్థలు ఈ పథకం కింద ప్రయోజనం పొందొచ్చు.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని