వాహన-డ్రోన్‌ రంగాలకు రూ.25,953 కోట్ల ప్రోత్సాహకాలు
close

Published : 16/09/2021 03:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వాహన-డ్రోన్‌ రంగాలకు రూ.25,953 కోట్ల ప్రోత్సాహకాలు

7.5 లక్షల ఉద్యోగాల సృష్టికి వీలు

దిల్లీ: దేశీయ తయారీ సామర్థ్యాలను బలోపేతం చేసే లక్ష్యంతో వాహన, వాహన విడిభాగాలు, డ్రోన్‌ పరిశ్రమలకు రూ.25,938 కోట్ల విలువైన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల (పీఎల్‌ఐ)కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వచ్చే అయిదేళ్లలో ఆయా పరిశ్రమలకు ఈ మొత్తాన్ని ప్రోత్సాహకాల రూపంలో ఇవ్వనున్నట్లు కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ వెల్లడించారు. వాహన పరిశ్రమకు ప్రకటించిన పీఎల్‌ఐ పథకంతో రూ.42,500 కోట్లకు పైగా తాజా పెట్టుబడులు వస్తాయని, రూ.2.3 లక్షల కోట్లకు పైగా ఉత్పత్తి పెరుగుతుందని, అదనంగా 7.5 లక్షలకు పైగా ఉద్యోగాల సృష్టికి వీలు కలుగుతుందని ఠాకూర్‌ వివరించారు. 2021-22 కేంద్ర బడ్జెట్‌లో 13 రంగాలకు రూ.1.97 లక్షల కోట్ల కేటాయింపుతో ప్రకటించిన ప్రోత్సాహకాల్లో భాగంగా తాజా పథకాన్ని తీసుకొచ్చారు. దేశీయంగా అధునాత సాంకేతికతతో వాహన ఉత్పత్తులను తయారీ చేయడానికి అవసరమైన పెట్టుబడులను ఆకర్షించే అవకాశం కలుగుతుందని అనురాగ్‌ ఠాకూర్‌ అభిప్రాయపడ్డారు.

కొత్త పెట్టుబడిదార్లకు సైతం: ఈ పథకాన్ని ప్రస్తుత వాహన కంపెనీలతో పాటు వాహన, వాహన విడిభాగాల తయారీ వ్యాపారాల్లోకి కొత్తగా పెట్టుబడి పెట్టేవారూ పొందే వీలుంది. ఈ పథకాన్ని ఛాంపియన్‌ ఓఈఎం ఇన్సెంటివ్‌ స్కీమ్‌, కాంపోనెంట్‌ ఛాంపియన్‌ ఇన్సెంటివ్‌ స్కీమ్‌గా నిర్దేశించారు.

ఛాంపియన్‌ ఓఈఎం ఇన్సెంటివ్‌ స్కీమ్‌: బ్యాటరీ విద్యుత్‌ వాహనాలు, హైడ్రోజన్‌ ఫ్యూయల్‌ సెల్‌ వాహనాలు తయారు చేసే పరిశ్రమలకు వర్తిస్తుంది.

కాంపోనెంట్‌ ఛాంపియన్‌ ఇన్సెంటివ్‌ స్కీమ్‌: వాహన అధునాతన విడిభాగాల సంస్థలు, పూర్తిగా సిద్ధంచేసిన (సీకేడీ)/పాక్షికంగా సిద్ధం చేసిన (ఎస్‌కేడీ) కిట్‌ల తయారీకి వర్తిస్తుంది.  ద్విచక్ర, 3 చక్రాల వాహనాలు, ప్రయాణికుల-వాణిజ్య వాహనాల, ట్రాక్టర్ల  విడిభాగాలసంస్థలకూ ఇది వర్తిస్తుంది.

డ్రోన్లు: డ్రోన్లు, డ్రోన్‌ విడిభాగాల తయారీ సంస్థలకు మూడేళ్ల కాలవ్యవధితో రూ.120 కోట్ల పీఎల్‌ఐ పథకాన్ని అందించనున్నట్లు కేంద్ర పౌరవిమానయాన శాఖ తెలిపింది. ఆయా సంస్థలు అదనంగా జోడించే విలువలో 20 శాతం ప్రోత్సాహకంగా ఇవ్వనున్నట్లు వెల్లడించింది. దీంతో మూడేళ్ల  లో రూ.5000 కోట్ల పెట్టుబడులు, రూ.1500 కోట్ల అమ్మకాల వృద్ధి, 10000 ఉద్యోగాల సృష్టి జరగనుందని అంచనా.

ఇప్పటికే అడ్వాన్స్‌డ్‌ కెమిస్ట్రీ బ్యాటరీ పరిశ్రమకు రూ.18,100 కోట్లు, విద్యుత్తు వాహనాల తయారీ, వినియోగానికి రూ.10,000 కోట్ల ప్రోత్సాహక పథకాలను ప్రకటించినందున, అవీ వాహన రంగానికి ఉపకరిస్తాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.


కొత్త టెక్‌ ఉత్పత్తులే లక్ష్యం

విద్యుత్‌, హైడ్రోజన్‌ వాహనాల వంటి అధునాతన టెక్నాలజీ ఉత్పత్తుల తయారీని ప్రోత్సహించేలా  వాహన రంగ పీఎల్‌ఐ పథకం ఉంది. దేశంలో పెట్రోల్‌, డీజిల్‌, సీఎన్‌జీ వాహనాల (ఐసీఈ) విభాగం గత 100 ఏళ్లుగా అభివృద్ధి చెందడంతో పాటు వీటి ఉత్పత్తి సమృద్ధిగా ఉన్నందున, ప్రత్యేకంగా ప్రయోజనాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. సరఫరా వ్యవస్థలు బలహీనంగా ఉన్న అధునాతన వాహన విభాగాలకు తాజా ప్రోత్సాహకాలు ఉపకరిస్తాయి.

సవరించిన పీఎల్‌ఐ పథకం సంపూర్ణమైనది: అశోక్‌ లేలాండ్‌  పీఎల్‌ఐ పథకం సంపూర్ణంగా ఉందని, ఎగుమతుల వృద్ధికి భారీ అవకాశాలు కల్పించనుందని అశోక్‌ లేలాండ్‌ ఎండీ, సీఈఓ విపిన్‌ సోంధీ అన్నారు. అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలపై భారత వాహన పరిశ్రమ ఆధారపడుతున్న సమయంలో ఈ పథకం వల్ల దేశీయంగా ఉత్పత్తి పెరుగుతుందన్నారు.  

- భారీ పరిశ్రమల కార్యదర్శి అరుణ్‌ గోయల్‌


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని