ఎయిరిండియాకు టాటాల బిడ్‌
close

Published : 16/09/2021 03:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎయిరిండియాకు టాటాల బిడ్‌

స్పైస్‌జెట్‌ అధిపతి అజయ్‌ సింగ్‌ సైతం!

దిల్లీ: భారీ నష్టాల్లో ఉన్న ఎయిరిండియాను కొనుగోలు చేయడం కోసం టాటా సన్స్‌తో పాటు స్పైస్‌జెట్‌ అధిపతి అజయ్‌ సింగ్‌ ఆర్థిక బిడ్‌లను దాఖలు చేశారు. ‘ఎయిరిండియాలో ప్రభుత్వ వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ లావాదేవీకి అనువుగా ఆర్థిక బిడ్‌లు వచ్చాయి. తుది దశకు ఈ ప్రక్రియను తీసుకెళ్తామ’ని దీపమ్‌ కార్యదర్శి తుహిన్‌ కాంత పాండే ట్వీట్‌ చేశారు. ఎయిరిండియా కోసం పలు ఆర్థిక బిడ్‌లు వచ్చినట్లు తెలిపినా,  ఎన్ని కంపెనీలు, ఏ కంపెనీలు రేసులో ఉన్నాయన్నది మాత్రం వెల్లడించలేదు.

టాటా సన్స్‌ ప్రతినిధి ఒకరు ఎయిరిండియా కోసం తమ గ్రూప్‌ బిడ్‌ దాఖలు చేసినట్లు స్పష్టం చేశారు. అయితే ఎయిరేషియా ఇండియా ద్వారానా లేదా సొంతంగా బిడ్‌ వేశారో స్పష్టం కాలేదు.

స్పైస్‌జెట్‌ ఛైర్మన్‌, ఎండీ అజయ్‌ సింగ్‌ వ్యక్తిగత హోదాలో ఆర్థిక బిడ్‌ దాఖలు చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.  

ఇదీ ప్రక్రియ..:  బయటకు వెల్లడించని రిజర్వ్‌ ధరపై ఆర్థిక బిడ్‌లు దాఖలవుతాయి. ఆ ధర కంటే అత్యధికంగా వేసిన బిడ్‌ను అంగీకరిస్తారు. దీనిని మంత్రివర్గ ఆమోదానికి సిఫారసు చేసే ముందు లావాదేవీ సలహాదారు దానిని పరిశీలిస్తారు.
ఎయిరిండియాలో వాటా విక్రయ ప్రక్రియను కేంద్రం జనవరి 2020లో ప్రారంభించినా, కరోనా వల్ల ఇబ్బందులు ఎదురయ్యాయి. ఏప్రిల్‌ 2021లో ఆర్థిక బిడ్‌లకు ఆహ్వానం పలికింది. సెప్టెంబరు 15 అందుకు చివరి తేదీగా నిర్ణయించింది. డిసెంబరు 2020లో ప్రాథమిక ఆసక్తి వ్యక్తీకరణ చేసిన పలు కంపెనీల్లో టాటా గ్రూప్‌ కూడా ఒకటి.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని