పూనావాలా ఫిన్‌కార్ప్‌ ఎండీపై సెబీ నిషేధం
close

Published : 16/09/2021 03:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పూనావాలా ఫిన్‌కార్ప్‌ ఎండీపై సెబీ నిషేధం

‘ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌’లో దోషిగా నిర్ధారణ

ముంబయి: మాగ్మా ఫిన్‌కార్ప్‌ షేర్లలో ‘ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌’ చేసి లాభపడ్డారనే ఆరోపణలపై విచారించిన మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ, పూనావాలా ఫిన్‌కార్ప్‌ లిమిటెడ్‌ ఎండీ అభయ్‌ భుటాడాను దోషిగా నిర్ధారిస్తూ, ఆయనను సెక్యూరిటీస్‌ మార్కెట్‌ నుంచి నిషేధించింది. ఆయనతో పాటు మరో ఏడుగురిని దోషులుగా తేల్చింది. మాగ్మా  ఫిన్‌కార్ప్‌ను ఈ ఏడాది ఫిబ్రవరిలో అదర్‌ పూనావాలాకు చెందిన రైజింగ్‌ సన్‌ హోల్డింగ్స్‌ (ఆర్‌ఎస్‌హెచ్‌పీఎల్‌) కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఫిబ్రవరి 10న వెలువడింది. యాజమాన్యం మారిన తర్వాత మాగ్మా ఫైనాన్స్‌ను, పూనావాలా ఫిన్‌కార్ప్‌గా పేరు మార్చారు. మాగ్మా ఫిన్‌కార్ప్‌ను కొనుగోలు చేస్తున్న సమాచారాన్ని ముందుగానే తెలుసుకున్న అభయ్‌ భుటాడాతో పాటు సౌమిల్‌ షా, సురభి కిషోర్‌ షా, అమిత్‌ అగ్రవాల్‌, మురళీధర్‌ బగ్రాంగ్‌లాల్‌ అగ్రవాల్‌, అభిజిత్‌ పవార్‌ తదితరులు ముందుగానే మాగ్మా షేర్లు కొనుగోలు చేసి రూ.13.58 కోట్ల మేరకు లాభపడ్డారని సెబీ నిర్ధారించింది. లావాదేవీలు, అనుమానితుల సెల్‌ఫోన్ల కాల్‌ డేటాను విశ్లేషించటంతో పాటు మాగ్మా షేర్లను కొనుగోలు చేసిన వారి ఖాతాలను ఈ సందర్భంగా విశ్లేషించింది. ఆర్‌ఎస్‌హెచ్‌పీఎల్‌కు సబ్సిడరీ కంపెనీ అయిన పూనావాలా ఫైనాన్స్‌కు అప్పట్లో ఎండీ- సీఈఓగా ఉన్న అభయ్‌ భుటాడా మాగ్మా ఫిన్‌కార్ప్‌ను కొనుగోలు చేసే వ్యవహారంలో కీలక పాత్ర పోషించారని, దీనికి సంబంధించిన చర్చలు, సంప్రదింపుల్లో ఆయన పాల్గొన్నారని సెబీ వివరించింది. ఆ సమాచారాన్ని ఆయన తన సన్నిహితులతో పంచుకుని, ముందస్తుగా షేర్ల క్రయవిక్రయాల్లో నిమగ్నమయ్యారని ఆరోపించింది. మాగ్మా ఫైనాన్స్‌, పూనావాలా ఫిన్‌కార్ప్‌కు మారిన తర్వాత దీనికి ఎండీగా అభయ్‌ భుటాడా నియమితులయ్యారు. ‘ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌’కు పాల్పడినట్లు, అందులో ఆయనతో పాటు మరో ఏడుగురి పాత్ర ఇందులో ఉన్నట్లు స్పష్టం చేస్తూ, వారిపై  చర్యలు తీసుకుంది. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ వల్ల లాభపడిన రూ.13.58 కోట్ల మొత్తాన్ని 15 రోజుల్లోగా ‘ఎస్క్రో’ ఖాతాలో జమ చేయాలని సెబీ ఆదేశించింది.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని