పబ్లిక్‌ ఇష్యూల్లో మరిన్ని సంస్కరణలు
close

Published : 29/07/2021 02:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పబ్లిక్‌ ఇష్యూల్లో మరిన్ని సంస్కరణలు

ప్రిఫరెన్షియల్‌ ఇష్యూ నిబంధనల్లోనూ మార్పులు తెస్తాం

సెబీ ఛైర్మన్‌ అజయ్‌ త్యాగీ

దిల్లీ: తొలి పబ్లిక్‌ ఆఫర్‌ నిబంధనల్లో మరిన్ని సంస్కరణలు తెచ్చేందుకు సెబీ కసరత్తు చేస్తోంది.  బుక్‌ బిల్డింగ్‌, ధరల నిర్ణయ విధానం, ధరల శ్రేణి సహా మరికొన్ని నిబంధనల్లో మార్పులు చేయనున్నామని సెబీ ఛైర్మన్‌ అజయ్‌ త్యాగీ వెల్లడించారు. ఫ్రిఫరెన్షియల్‌ ఇష్యూల్లోనూ సంస్కరణలు తెస్తామని ఫిక్కీ నిర్వహించిన వార్షిక కేపిటల్‌ మార్కెట్‌ సదస్సులో ఆయన చెప్పారు. వివిధ మార్గాల్లో నిధుల సమీకరణ విధానాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూనే ఉంటామని వెల్లడించారు. ఎక్కువ కంపెనీలు పబ్లిక్‌ ఇష్యూకు వచ్చేలా ప్రజల కనీస వాటా పరిమితిని సవరించామని గుర్తు చేశారు. అంకుర సంస్థల నమోదు ప్రక్రియను మరింత సులువు చేసేందుకు ఇన్నోవేటర్స్‌ గ్రోథ్‌ ప్లాట్‌ఫాంలో మార్పులు చేయడంతో, ప్రారంభ దశలోనే పలు కొత్త కంపెనీలు పబ్లిక్‌ ఇష్యూకు రావడం గణనీయంగా పెరిగిందని చెప్పారు.

భారత్‌లోనూ ఎస్‌పీఏసీలు

ప్రపంచవ్యాప్తంగా ఐపీఓల స్వరూపంలో మార్పులు వస్తున్నాయని త్యాగీ తెలిపారు. గతేడాది అమెరికా విపణుల్లో ఎస్‌పీఏసీలు (స్పెషల్‌ పర్పస్‌ అక్వయిజేషన్‌ కంపెనీస్‌) గణనీయంగా పెరిగాయని వెల్లడించారు. నిధుల సమీకరణతో పాటు నేరుగా నమోదు అనే విధానం అమెరికాలో తెరపైకి వచ్చిందన్నారు. భారత్‌లోనూ ఎస్‌పీఎసీ లాంటి విధానాన్ని తీసుకొనే వచ్చే అంశాన్ని ప్రైమరీ మార్కెట్‌ అడ్వయిజరీ కమిటీ పరిశీలిస్తోంది. ప్రత్యేక పబ్లిక్‌ ఇష్యూల ద్వారా నిధులు సమీకరించి, ఆ నిధులను ఏదేని కంపెనీల కొనుగోలుకు ఉపయోగిస్తుంటాయి.

ఆరు రెట్లు పెరిగిన నిధుల సమీకరణ

2011-16 వరకు దేశంలో ఐపీఓల ద్వారా రూ.30,000 కోట్లు సమీకరించగా.. 2016-21లో ఇది ఆరు రెట్లు పెరిగి రూ.1,80,000 కోట్లకు చేరిందని త్యాగి తెలిపారు. ‘నమోదిత కంపెనీల్లో ప్రజల కనీస వాటా పరిమితిని 25 శాతానికి తీసుకొచ్చాం. ఈ పరిమితిని పెంచే ఉద్దేశంలో లేమ’ని స్పష్టం చేశారు. ప్రమోటరు నేతృత్వంలో కంపెనీలు నడిచే విధానాన్ని పక్కకు పెట్టి, వాటాదార్ల నియంత్రణలో కంపెనీలు ఉండే విధానాన్ని తీసుకొచ్చే ఉద్దేశంలో సెబీ ఉందని వివరించారు. మున్ముందు వృత్తి నిపుణులే యజమానులుగా నడిపించే కంపెనీలు ఎక్కువగా ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు.  2022-23 నుంచి తప్పనిసరిగా ఈఎస్‌జీ (పర్యావరణ, సామాజిక, కార్పొరేట్‌ పరిపాలన) విధానానికి మారడానికి నమోదిత కంపెనీలు సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు. డెట్‌ మార్కెట్‌లు అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని కూడా త్యాగీ అన్నారు. చైనా, టర్కీ తరహాలో దేశంలోకి పసిడి దిగుమతులన్నీ ఎలక్ట్రానిక్‌ గోల్డ్‌ రిసీట్‌ (ఈజీఆర్‌) రూపంలో జరిగే విధానానికి మారాలని సెబీ పూర్తి కాల సభ్యుడు జి.మహాలింగం సూచించారు. స్పాట్‌ పసిడి ఎక్స్ఛేంజీని భారత్‌ ఏర్పాటు చేసే యోచనలో ఉన్నందున ఆయన ఈ సలహా ఇచ్చారు.


రోలెక్స్‌ రింగ్స్‌ ఐపీఓకు గంటల వ్యవధిలోనే 100% స్పందన

* రోలెక్స్‌ రింగ్స్‌ పబ్లిక్‌ ఇష్యూకు తొలి రోజైన బుధవారం ఉదయం, 2 గంటల వ్యవధిలోనే 100 శాతానికి పైగా స్పందన లభించింది. మొదటి రోజు ముగిసే నాటికి 3.84 రెట్ల స్పందన లభించింది.

* గ్లెన్‌మార్క్‌ లైఫ్‌ సైన్సెస్‌ పబ్లిక్‌ ఇష్యూకు రెండో రోజైన బుధవారానికి 5.78 రెట్ల స్పందన లభించింది.

రూ.35000 వరకు వేతనంతో 20000 సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌ల నియామకాలు: పేటీఎం

రూ.16,600 కోట్ల భారీ పబ్లిక్‌ ఇష్యూకు రానున్న తరుణంలో ఉద్యోగులను పెంచుకోవడంపై పేటీఎం దృష్టి పెట్టింది. డిజిటల్‌ సేవలపై వ్యాపారులకు అవగాహన పెంచేందుకు 20,000 మంది క్షేత్రస్థాయి సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌లను నియమించుకునేందుకు సన్నాహాలు చేస్తోంది. వీరు వేతనం, కమీషన్‌ రూపంలో రూ.35,000 వరకు ఆర్జించే అవకాశం ఉంటుందని సంస్థ తెలిపింది.

బ్లేజ్‌కు రూ.520 కోట్ల పెట్టుబడులు

ఈనాడు, హైదరాబాద్‌: కృత్రిమ మేధ, కొత్తతరం సాంకేతికతలకు సంబంధించిన సేవలు అందించడంతో పాటు, చిప్‌లను అభివృద్ధి చేస్తున్న బ్లేజ్‌ రూ.528 కోట్ల (71 మి.డాలర్లు) పెట్టుబడులను సమీకరించింది. విద్యుత్‌ వాహనాలు, మొబిలిటీ, స్మార్ట్‌ రిటైల్‌, సెక్యూరిటీ, పారిశ్రామిక అవసరాలు తదితర రంగాల్లో ఈ హైదరాబాదీ సంస్థ సేవలు అందిస్తోంది. సిరీస్‌ డి ఫండింగ్‌లో భాగంగా ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌, టెమాసెక్‌, డెన్సోతో పాటు కొన్ని ఇతర సంస్థలు ఈ పెట్టుబడి పెట్టాయి. దేశ వ్యాప్తంగా తమ కార్యకలాపాల విస్తరణకు ఈ మొత్తాన్ని వినియోగిస్తామని సంస్థ సీఈఓ దినకర్‌ మునగాల తెలిపారు. ఇంజినీర్లు, కృత్రిమ మేధ నిపుణులతో పాటు, హార్డ్‌వేర్‌ డిజైనింగ్‌, సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌, వెరిఫికేషన్‌ తదితర విభాగాల్లో కొత్తగా ఉద్యోగులను నియమించుకోబోతున్నట్లు వెల్లడించారు.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని