సంక్షిప్త వార్తలు
close

Updated : 29/07/2021 07:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సంక్షిప్త వార్తలు

కేవలం జీడీఆర్‌ ఖాతాలే స్తంభన

3 ఎఫ్‌పీఐ పెట్టుబడులపై ఎన్‌ఎస్‌డీఎల్‌ స్పష్టత 

4% వరకు పెరిగిన అదానీ గ్రూప్‌ షేర్లు

దిల్లీ: నిబంధనల ఉల్లంఘన కారణంగా ఫ్రీజ్‌ చేసిన విదేశీ ఫండ్‌ సంస్థల (ఎఫ్‌పీఐ) ఖాతాలపై నేషనల్‌ సెక్యూరిటీస్‌ డిపాజిటరీ (ఎన్‌ఎస్‌డీఎల్‌) స్పష్టత ఇచ్చింది. ఈ ఎఫ్‌పీఐలలో, అదానీ గ్రూపులో దాదాపు రూ.40,000 కోట్లు పెట్టుబడులు పెట్టిన అల్బులా ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌, క్రెస్టా ఫండ్‌, ఏపీఎమ్‌ఎస్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ కూడా ఉన్నాయి. ఈ 3 ఫండ్‌ సంస్థల జీడీఆర్‌ (గ్లోబల్‌ డిపాజిటరీ రిసీట్స్‌) ఖాతాలు మాత్రమే ఫ్రీజ్‌ అయ్యాయని, వీటి ఇతర ట్రేడింగ్‌ ఖాతాల కార్యకలాపాలు యథాతథంగా కొనసాగుతున్నాయని తెలిపింది. ఈ మూడు ఎఫ్‌పీఐల ఖాతాలను ఫ్రీజ్‌ చేశారనే వార్తల నేపథ్యంలో గత నెలలో అదానీ గ్రూపు సంస్థల షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనై, మార్కెట్‌ విలువ రూ.50,000 కోట్లకు పైగా హరించుకు పోయింది. తన వెబ్‌సైట్‌లో విదేశీ ఫండ్‌ సంస్థల్లో కొన్నింటి పేర్ల పక్కన ‘జీడీఆర్‌’ అని ఎన్‌ఎస్‌డీఎల్‌ చేర్చింది. తాజా స్పష్టతతో అదానీ గ్రూప్‌ షేర్లు బుధవారం 4% వరకు పెరిగాయి.  


వచ్చే వారం నుంచి ధరల పెంపు: టాటా మోటార్స్‌

దిల్లీ: ఉక్కుతో పాటు రోడియం, పల్లాడియం తదితర విలువైన లోహాల ధరలు పెరిగినందున, వచ్చే వారం నుంచి ప్రయాణికుల వాహన ధరలను టాటా మోటార్స్‌ పెంచనుంది. ఏ మోడల్‌పై ఎంత మొత్తం పెంచాలనే విషయాన్ని పరిశీలిస్తోంది.‘గత ఏడాది కాలంగా లోహాల ధరలు పెరగడంతో మా ఆదాయంపై 8-8.5 శాతం మేర భారం పడింది. ఇందులో కొంత భారాన్ని (2.5-3 శాతం) ఇప్పటికే వినియోగదార్లపై మోపాం. వచ్చే వారం నుంచి ప్రయాణికుల వాహన ధరలు పెంచక తప్పడం లేద’ని టాటా మోటార్స్‌ ప్రెసిడెంట్‌ ప్యాసింజర్‌ వెహికల్స్‌ బిజినెస్‌ యూనిట్‌ (పీవీబీయూ) శైలేష్‌ చంద్ర వెల్లడించారు.


సీపీఎస్‌ లావాదేవీల్లో ఫిన్‌టెక్‌ సంస్థలూ

ముంబయి: ఆర్‌టీజీఎస్‌ (రియల్‌టైమ్‌ గ్రాస్‌ సెటిల్‌మెంట్‌), నెఫ్ట్‌ (నేషనల్‌ ఎలక్ట్రానిక్‌ ఫండ్‌ ట్రాన్స్‌ఫర్‌) వంటి కేంద్రీకృత చెల్లింపు వ్యవస్థల్లో పాల్గొనేందుకు నాన్‌బ్యాంక్‌ చెల్లింపు వ్యవస్థల (సీపీఎస్‌)కు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) అనుమతి ఇచ్చింది. ఇందువల్ల ఫోన్‌పే, పేటీఎం వంటి సంస్థలకూ ఈ లావాదేవీలను ప్రాసెస్‌ చేసే వీలు లభిస్తుంది. ప్రీపెయిడ్‌ చెల్లింపు సాధనాలు (పీపీఐ), కార్డు నెట్‌వర్క్‌లు, వైట్‌లేబుల్‌ ఏటీఎం సంస్థలు, ట్రేడ్‌ రిసీవబుల్స్‌ డిస్కౌంటింగ్‌ వ్యవస్థలు నిర్వహించేవారు ఇందుకు అర్హులు. ఇందువల్ల చెల్లింపు విఫలం కావడం - బ్యాంకులపై ఆధారపడటం తగ్గుతుంది.


ఈవీలపై అశోక్‌ లేలాండ్‌ రూ.1500 కోట్లు

దిల్లీ: బ్రిటన్‌ అనుబంధ సంస్థ స్విచ్‌ మొబిలిటీ ద్వారా విద్యుత్‌ వాహనాలపై 200 మిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.1500 కోట్లు) పెట్టుబడులు పెట్టనున్నట్లు అశోక్‌ లేలాండ్‌ తెలిపింది. కొత్త తరం విద్యుత్‌ బస్‌, తేలిక పాటి వాణిజ్య వాహనాలను స్విచ్‌ మొబిలిటీ అభివృద్ధి చేస్తోంది. ఈ ఏడాది చివర్లో భారత్‌లో విద్యుత్‌ తేలికపాటి వాణిజ్య వాహనాన్ని విడుదల చేయడానికి అశోక్‌ లేలాండ్‌ సన్నాహాలు చేస్తోంది. అమెరికా, ఐరోపా, జపాన్‌ వంటి మార్కెట్లలో విస్తరించి.. అంతర్జాతీయంగా అగ్రగామి 10 వాణిజ్య వాహన సంస్థల్లో అశోక్‌ లేలాండ్‌ చేరడానికి స్విచ్‌ మొబిలిటీ కీలక పాత్ర పోషిస్తుందని సంస్థల ఛైర్మన్‌ ధీరజ్‌ హిందుజా తెలిపారు.


కోటక్‌ నుంచి కొవిడ్‌-19 వ్యక్తిగత రుణం

ఈనాడు, హైదరాబాద్‌: కొవిడ్‌-19 చికిత్స కోసం వినియోగించుకునేందుకు అత్యవసర వ్యక్తిగత రుణాలు రూ.1-5 లక్షల మేర అందిస్తున్నట్లు కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ తెలిపింది. బ్యాంకు ఖాతాదారులతో పాటు, కొత్త వినియోగదారులకూ ఈ రుణ సదుపాయం లభిస్తుందని పేర్కొంది. వ్యక్తిగతంగా, కుటుంబ సభ్యులు ఎవరైనా కొవిడ్‌ బారిన పడినా, చికిత్స కోసం ఈ మొత్తాన్ని వినియోగించుకోవచ్చు. ఏడాది నుంచి నాలుగేళ్లలో దీన్ని తీర్చేయాలి. వార్షిక వడ్డీ రేటు 10శాతం నుంచి ప్రారంభం అవుతుంది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని