డాక్టర్‌ రెడ్డీస్‌కు రూ.571 కోట్ల లాభం
close

Updated : 28/07/2021 06:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

డాక్టర్‌ రెడ్డీస్‌కు రూ.571 కోట్ల లాభం

స్ధిరంగా ఉత్తర అమెరికా అమ్మకాలు
దేశీయ మార్కెట్లో ఆకర్షణీయ వృద్ధి 
ఈనాడు - హైదరాబాద్‌

గ్రశ్రేణి ఔషధ సంస్థ డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ ఏకీకృత ఖాతాల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.571 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదేకాల నికరలాభం రూ.579 కోట్లతో పోల్చితే ఈసారి 1 శాతం తగ్గింది. డాక్టర్‌ రెడ్డీస్‌ ఇంతకంటే అధిక లాభాన్ని ఆర్జిస్తుందని మార్కెట్‌ వర్గాలు ఆశించినా, అందుకు భిన్నంగా నమోదైంది. ఇదే కాలంలో ఆదాయం రూ.4417 కోట్ల నుంచి 11 శాతం పెరిగి, రూ.4919 కోట్లు నమోదైంది. ఫలితాలపై డాక్టర్‌ రెడ్డీస్‌ సహ-ఛైర్మన్‌, ఎండీ జీవీ ప్రసాద్‌ స్పందిస్తూ, అమ్మకాలు పెరిగాయని, వచ్చే త్రైమాసికాల్లో లాభాలు సైతం పెరుగుతాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. కొత్తగా విడుదల చేసిన ఔషధాలు, అధికోత్పత్తి ఇందుకు దోహదపడగలవని అన్నారు. న్యూట్రిషన్‌, నేరుగా వినియోగదార్లకు ఔషధాలు అందించడం, డిజిటల్‌ హెల్త్‌- వెల్‌నెస్‌ సేవలు.. తదితర విభాగాల్లో నూతన వ్యాపార అవకాశాలు  అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

* ఉత్తర అమెరికా ఆదాయాల్లో 1 శాతం వృద్ధే నమోదైనా, మనదేశంలో అమ్మకాలు అత్యంత ఆకర్షణీయంగా 69 శాతం మేరకు పెరిగాయి. ఐరోపాలో 12 శాతం, వర్థమాన దేశాల్లో  14 శాతం వృద్ధి కనిపించింది.

ఒకేడోసు టీకాకు యత్నం

రష్యా సంస్థ అయిన ఆర్‌డీఐఎఫ్‌ నుంచి సింగిల్‌ డోస్‌ కొవిడ్‌-19 టీకా అయిన ‘స్పుత్నిక్‌ లైట్‌’ ను మనదేశానికి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ వెల్లడించింది. దీనిపై రష్యాలో మూడో దశ క్లినికల్‌ పరీక్షలు జరుగుతున్నాయని, ఆ సమాచారంతో మనదేశంలో దీనికి అనుమతి తీసుకునే ఆలోచన ఉన్నట్లు పేర్కొంది. కొవిడ్‌-19 బాధితులు త్వరగా కోలుకునేందుకు ఉపకరిస్తుందని భావిస్తున్న మోల్నుపిరవిర్‌ ఔషధాన్ని మనదేశంలో విడుదల చేసే ఉద్దేశంతో, మరో 5 దేశీయ ఔషధ కంపెనీలతో కలిసి క్లినికల్‌ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వివరించింది. ఇవే కాకుండా బారిసిటినిబ్‌, మరికొన్ని కొవిడ్‌-19 ఔషధాలపై పనిచేస్తున్నట్లు వెల్లడించింది.

షేరు ధర 10 శాతం పతనం

మొదటి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ఆశాజనకంగా లేకపోవడానికి తోడు అమెరికా సెక్యూరిటీస్‌ మార్కెట్‌ నియంత్రణ సంస్థ అయిన సెక్‌ (సెక్యూరిటీస్‌ ఎక్స్ఛేంజి కమిషన్‌) నుంచి డాక్టర్‌ రెడ్డీస్‌కు ‘సీఐఎస్‌ దేశాల్లో నిర్వహిస్తున్న వ్యాపారానికి సంబంధించిన పత్రాలు అందించాలనే నోటీసు (సబ్‌పోనా)’ జారీ అయినట్లు వెల్లడి కావటంతో స్టాక్‌మార్కెట్లో డాక్టర్‌ రెడ్డీస్‌ షేరు అమ్మకాల ఒత్తిడికి లోనైంది. అనూహ్యంగా 10 శాతానికి పైగా షేరు ధర క్షీణించింది. సోమవారం బీఎస్‌ఈలో డాక్టర్‌ రెడ్డీస్‌ షేరు ముగింపు ధర రూ.5409 కాగా, మంగళవారం రూ.5421 వద్ద ట్రేడింగ్‌ మొదలైంది. గరిష్ఠంగా రూ. 5445 వరకు పెరిగింది. కానీ ఆ తర్వాత పతనం అవుతూ రూ.4,781కు దిగివచ్చింది. చివర్లో రూ.4844 ముగింపు ధర నమోదైంది. క్రితం రోజు ముగింపు ధరతో పోల్చితే ఇది 10.44 శాతం తక్కువ.

 


ఐసీఐసీఐ లాంబార్డ్‌ భాగస్వామ్యంతో నగదు రహిత అవుట్‌ పేషెంట్‌ సేవలు

గదు రహిత అవుట్‌ పేషెంట్‌ సేవలను విస్తృత స్థాయిలో అందించే లక్ష్యంతో డాక్టర్‌ రెడ్డీస్‌ అనుబంధ సంస్థ అయిన శ్వాస్‌ వెల్‌నెస్‌ లిమిటెడ్‌, ఐసీఐసీఐ లాంబార్డ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. దీని కోసం ఒక పైలెట్‌ ప్రాజెక్టు చేపట్టనున్నట్లు ఈ సంస్థలు ప్రకటించాయి. దీంతో తన డిజిటల్‌ హెల్త్‌ సొల్యూషన్‌ ‘శ్వాస్‌’ ను డాక్టర్‌ రెడ్డీస్‌ లాంఛనంగా ప్రారంభించినట్లు అవుతోంది. అదే సమయంలో ఆరోగ్య సేవల విభాగంలోకి ఐసీఐసీఐ లాంబార్డ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ అడుగుపెట్టినట్లుగా భావిస్తున్నారు. అవుట్‌ పేషెంట్‌ సేవల్లో.. డాక్టర్‌కు చూపించుకోవడం, రోగ నిర్థారణ పరీక్షలు- సేవలు, మందులు తీసుకోవడం, బీమా తదితర అవసరాలుంటాయి. ఈ సేవలను ఐసీఐసీఐ లాంబార్డ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ, తన ‘ఐఎల్‌ టేక్‌కేర్‌ యాప్‌’ ద్వారా వినియోగదార్లకు అందించాలని యోచిస్తోంది. శ్వాస్‌ వెల్‌నెస్‌ లిమిటెడ్‌, ఐసీఐసీఐ లాంబార్డ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ కలిసి తొలి దశలో ఈ సేవలను హైదరాబాద్‌, విశాఖపట్నం నగరాల్లో అందిస్తాయి. తదుపరి ఇతర నగరాలకు విస్తరిస్తారు.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని