సంక్షిప్త వార్తలు
close

Updated : 22/06/2021 11:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సంక్షిప్త వార్తలు

లిస్టింగ్‌ నిబంధనల సడలింపు
5 శాతం వాటానే విక్రయించొచ్చు
రూ.లక్ష కోట్ల మార్కెట్‌ క్యాప్‌ కంపెనీలకే
ప్రతిపాదిత ఎల్‌ఐసీ ఐపీఓకు ప్రయోజనాలు

దిల్లీ: రూ.లక్ష కోట్ల కంటే ఎక్కువ మార్కెట్‌ విలువ ఉన్న కంపెనీలకు లిస్టింగ్‌ నిబంధనల విషయంలో సడలింపు లభించింది. తాజా సవరణల ప్రకారం నమోదు సమయానికి రూ.లక్ష కోట్ల కంటే ఎక్కువ మార్కెట్‌ విలువ ఉన్న కంపెనీలు కేవలం 5 శాతం వాటాను విక్రయించుకోవచ్చు. రెండేళ్లలో 10 శాతానికి; అయిదేళ్లలో కనీసం 25 శాతానికి ప్రజల వాటాను పెంచుకోవాల్సి ఉంటుంది. ఆ మేరకు సెక్యూరిటీస్‌ కాంట్రాక్ట్స్‌(రెగ్యులేషన్‌) రూల్స్‌ను ఆర్థిక శాఖ ఆధ్వర్యంలోని ఆర్థిక వ్యవహారాల విభాగం సవరించింది. తాజా సవరణలు ప్రతిపాదిత ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఇష్యూకు ప్రయోజనాలను కలగజేసే అవకాశం ఉంది.

‘తాజా సవరణతో పెద్ద కంపెనీలు తమ ఇష్యూ పరిమాణాన్ని 5 శాతానికి పరిమితం చేసుకోవచ్చు(అంతక్రితం 10 శాతం). ఇది ఆ కంపెనీలకు చాలా వెసులుబాటు కలిగించినట్లవుతుంది. అయితే చాలా వరకు ఇష్యూలకు ఈ సవరణ వర్తించదు. ఎల్‌ఐసీ ఐపీఓకు మాత్రం ఇది ప్రయోజనాలను అందిస్తుంద’ని మార్కెట్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే భారత కంపెనీలు అంతక్రితం కంటే భారీ స్థాయికి చేరుకున్నాయని ఈ సవరణ గుర్తించినట్లయిందంటున్నారు.

ప్రైవేటీకరణ జాబితాలో సెంట్రల్‌ బ్యాంక్‌, ఐఓబీ

దిల్లీ: ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియలో భాగంగా, ప్రైవేటీకరించడానికి సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్‌ (ఐఓబీ)ల పేర్లను ఖరారు చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ రెండు బ్యాంకుల్లో ప్రభుత్వం 51 శాతం వాటా విక్రయించనుంది. పెట్టుబడుల ఉపసంహరణ కోసం పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో బ్యాంకింగ్‌ నియంత్రణ చట్టం, ఇతర బ్యాంకింగ్‌ చట్టాలకు ప్రభుత్వం సవరణ చేయనుంది. 2021-22 బడ్జెట్‌లో ప్రకటించిన విధంగా రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఒక సాధారణ బీమా సంస్థను ప్రైవేటీకరణ చేయడానికి పేర్లను ఖరారు చేసే పనిని నీతి ఆయోగ్‌కు అప్పగించారు. నీతి ఆయోగ్‌ ఈ రెండు బ్యాంకుల పేర్లతో నివేదికను పెట్టుబడుల ఉపసంహరణపై ఏర్పాటైన కార్యదర్శుల బృందానికి అందించిందని ఆంగ్లపత్రికలు పేర్కొన్నాయి.

చిన్న మదుపర్లకు అదనంగా రూ.1850 కోట్లు!
యోచిస్తున్న డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ రుణ సంస్థలు

ముంబయి: తాము సొంతంగా వసూలు చేసిన రుణ బకాయిల నుంచి ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌దార్లు, రిటైర్‌మెంట్‌ ఫండ్‌ల లాంటి చిన్న మదుపర్లకు అదనంగా మరో రూ.1850 కోట్లు చెల్లించాలని డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ రుణ సంస్థలు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ‘ఓటింగ్‌ ఇంకా జరుగుతోంది. మంగళవారం రాత్రి వరకు ఇది కొనసాగుతుంది. బిడ్‌ విలువలో ఎలాంటి మార్పు లేకపోతే.. ట్రైబ్యునల్‌ సూచన ప్రకారమే డబ్బులు చెల్లింపు ఉంటుంద’ని రుణ సంస్థల కమిటీలో భాగంగా ఉన్న ఓ ఉన్నతాధికారి తెలిపారు. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ దివాలా పరిష్కార ప్రక్రియ నిమిత్తం పిరమాల్‌ గ్రూపు సమర్పించిన రూ.37,200 కోట్ల విలువైన బిడ్‌కు ఈ నెల 7న ఎన్‌సీఎల్‌టీ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. లక్షల సంఖ్యలో ఉన్న చిన్న మదుపర్లకు ప్రయోజనం కలిగేలా కేటాయింపులపై పునరాలోచన చేయాలని రుణ సంస్థల కమిటీని ముంబయి బెంచ్‌ కోరింది.

కరోనా సమయంలో 4జీ లేని భారత్‌ను ఊహించలేం
ముకేశ్‌ అంబానీ

దిల్లీ: దేశాల మధ్య, దేశాల లోపల డిజిటల్‌ అంశంలో ఉన్న విభజనను దూరం చేయాల్సిన అవసరం ఉందని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధిపతి ముకేశ్‌ అంబానీ పేర్కొన్నారు. అనుసంధానత (కనెక్టివిటీ), సమాచారం (కమ్యూనికేషన్‌) ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కులుగా మారాయని ఖతార్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌ సమావేశంలో తెలిపారు. కరోనా సమయంలో 4జీ నెట్‌వర్క్‌ లేకుండా భారత్‌ను ఊహించడం చాలా కష్టమని వివరించారు. కరోనాకు చాలా ముందే డిజిటల్‌ ఇండియా ఆవిష్కరణకు ప్రధాని మోదీ పిలుపునివ్వడం దేశాన్ని రక్షించిందని ఆయన అన్నారు. ‘ప్రపంచంలోనే అతిపెద్ద టీకా కార్యక్రమానికి ఈ డిజిటల్‌ మౌలిక వసతులే ఉపయోగపడుతున్నాయి. కొవిడ్‌ ఉద్ధృతిలోనూ చదువులు, పెద్దల ఆఫీసులు ఇంటి నుంచే 4జీ ఆధారంగా జరిగాయి. అన్ని దేశాలు తమ మౌలిక వసతులను ఏకీకృతం చేస్తే కరోనా సంక్షోభ సమయంలో ఉపయోగకరంగా ఉంటుంద’ని అన్నారు.

స్వదేశీ 5జీ నెట్‌వర్క్‌ సొల్యూషన్ల అభివృద్ధి
ఎయిర్‌టెల్‌, టాటా గ్రూపు జట్టు

దిల్లీ: దేశీయంగా అభివృద్ధి చేసిన 5జీ నెట్‌వర్క్‌ సొల్యూషన్లను అందుబాటులోకి తెచ్చే నిమిత్తం భారతీ ఎయిర్‌టెల్‌, టాటా గ్రూపులు వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఓపెన్‌ రేడియో యాక్సెస్‌ నెట్‌వర్క్‌ (ఓ-రాన్‌) ఆధారిత ‘రేడియో, ఎన్‌ఎస్‌ఏ/ ఎస్‌ఏ (నాన్‌ స్టాండలోన్‌/ స్టాండలోన్‌) కోర్‌ను టాటా గ్రూపు అభివృద్ధి చేసింది. దీనిని పూర్తి దేశీయంగా రూపొందించిన టెలికాం వ్యవస్థను అనుసంధానం చేశాం. ఇది గ్రూపు, దాని భాగస్వాముల సామర్థ్యాలను పెంచుతుంద’ని ఇరు సంస్థలు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపాయి. ఎయిర్‌టెల్‌ ఈ 5జీ సొల్యూషన్లను 2022 జనవరిలో ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రయోగాత్మకంగా పరీక్షిస్తుందని తెలిపాయి.

అల్టెజా విస్తరణకు రూ.100 కోట్ల పెట్టుబడి
అపర్ణ ఎంటర్‌ప్రైజెస్‌

ఈనాడు, హైదరాబాద్‌: నిర్మాణ సామగ్రిని ఉత్పత్తి చేసే అపర్ణ ఎంటర్‌ప్రైజెస్‌ తమ అల్యూమినియం, డోర్‌ సిస్టమ్‌ బ్రాండు అల్టెజాను మరింత విస్తరించేందుకు  నాలుగేళ్లలో రూ.100 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు వెల్లడించింది. ఈ మొత్తంతో తయారీ కేంద్రం, రిటైలింగ్‌ సదుపాయాలను అభివృద్ధి చేస్తామని అపర్ణ ఎంటర్‌ప్రైజెస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అశ్విన్‌రెడ్డి తెలిపారు. దేశీయంగా అల్యూమినియం కిటికీలు, తలుపుల మార్కెట్‌ విలువ రూ.20వేల కోట్ల వరకు ఉందని,  ఏటా 7.9 శాతం వృద్ధి నమోదవుతోందన్నారు. గిరాకీకి అనుగుణంగా ఉత్పత్తులు తెచ్చేందుకు కొత్త పెట్టుబడులను ప్రతిపాదించామని, ఈ ఏడాది చివరి నాటికి 100 మందికి పైగా ఉద్యోగులను నియమించుకుంటున్నట్లు తెలిపారు.

బీడీఎల్‌కు రూ.260.36 కోట్ల త్రైమాసిక లాభం

ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వ రంగ సంస్థ భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ (బీడీఎల్‌) జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.1,162.08 కోట్ల ఆదాయాన్ని, రూ.260.36 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. త్రైమాసిక ఈపీఎస్‌ రూ.14.21 ఉంది. 2019-20 ఇదే త్రైమాసికంలో ఆదాయం రూ.1,462.44 కోట్లు, నికరలాభం రూ.309.72 కోట్లు, ఈపీఎస్‌ రూ.16.90 ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరం (2020-21) పూర్తికాలానికి బీడీఎల్‌ ఆదాయం రూ.20,083.37 కోట్లు ఉండగా, దీనిపై రూ.257.76 కోట్ల నికరలాభం, రూ.14.06 ఈపీఎస్‌ నమోదయ్యాయి. ఒక్కో షేరుకు 65 పైసల చొప్పున తుది డివిడెండ్‌ చెల్లించాలని కంపెనీ యాజమాన్యం ప్రతిపాదించింది.

పోకర్ణ లాభం రూ.3.79 కోట్లు  

ఈనాడు, హైదరాబాద్‌: పోకర్ణ లిమిటెడ్‌ ఏకీకృత ఖాతాల ప్రకారం జనవరి- మార్చి త్రైమాసికానికి రూ.95.61 కోట్ల ఆదాయాన్ని, రూ.3.79 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. త్రైమాసిక ఈపీఎస్‌ రూ.1.22గా నమోదైంది. 2019-20 ఇదేకాలంలో ఆదాయం రూ.90.31 కోట్లు, నికరలాభం  రూ.3.18 కోట్లు, ఈపీఎస్‌ రూ.1.03 గా ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరం (2020-21) పూర్తికాలానికి పోకర్ణ ఆదాయం రూ.301.09 కోట్లు ఉండగా, దీనిపై రూ.28.28 కోట్ల నికరలాభం, రూ.9.12 ఈపీఎస్‌ నమోదయ్యాయి. వాటాదార్లకు  30 శాతం చొప్పున (రూ.2 ముఖ విలువ గల ఒక్కో షేరుకు 60 పైసల చొప్పున) డివిడెండ్‌ చెల్లించాలని బోర్డు ప్రతిపాదించింది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని