సంక్షిప్త వార్తలు
close

Published : 19/06/2021 01:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సంక్షిప్త వార్తలు

ఆ రెండు కంపెనీల వాటాదార్లకు సున్నానే
బకాయిల కంటే కొనుగోలు విలువ తక్కువగా ఉండటం వల్లే
వీడియోకాన్‌ గ్రూపు సంస్థల షేర్ల డీలిస్టింగ్‌ వ్యవహారం

దిల్లీ: వీడియోకాన్‌ గ్రూపులో నమోదిత సంస్థలైన వీడియోకాన్‌ ఇండస్ట్రీస్‌, వ్యాల్యూస్‌ ఇండస్ట్రీస్‌ వాటాదార్లకు చివరకు ఏమీ మిగిలేలా లేదు. ఆ షేర్లను స్టాక్‌ ఎక్స్ఛేంజీల నుంచి తొలగిస్తుండగా (డీలిస్టింగ్‌) వాటాదార్లకు ఒక్క పైసా కూడా రావట్లేదు. అంటే వాళ్ల పెట్టుబడుల విలువ ‘సున్నా’ అవుతుందన్న మాట. దివాలా పరిష్కార ప్రక్రియలో భాగంగా ఈ రెండు సంస్థల కొనుగోలుకు లెక్కగట్టిన విలువ.. ఇవి చెల్లించాల్సిన బకాయిల కంటే బాగా తక్కువగా ఉండటమే ఇందుకు కారణం. వీడియోకాన్‌ గ్రూపు దివాలా పరిష్కార ప్రక్రియ ప్రణాళికకు అనుమతి లభించడంతో వీడియోకాన్‌ ఇండస్ట్రీస్‌, వ్యాల్యూ ఇండస్ట్రీస్‌ షేర్లను డీలిస్ట్‌ చేయనున్న సంగతి తెలిసిందే. షేర్ల డీలిస్టింగ్‌ సమయంలో ఈ రెండు కంపెనీలకు చెందిన ఏ ఒక్క వాటాదారుకి ఎలాంటి ఆఫర్లు ఉండటం లేదని శుక్రవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఇరు సంస్థలు వెల్లడించాయి. షేర్లను ఎక్స్ఛేంజీల నుంచి తొలగించాలనుకునే కంపెనీలు.. సెబీ నిబంధనల ప్రకారం ప్రస్తుత వాటాదార్లకు ఏదేని ఆఫర్‌ను ప్రకటించాల్సి ఉంటుంది. బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల నుంచి షేర్ల డీలిస్టింగ్‌కు రికార్డు తేదీగా ఈనెల 18ని వీడియోకాన్‌ ఇండస్ట్రీస్‌ నిర్ణయించింది. వ్యాల్యూస్‌ ఇండస్ట్రీస్‌ కూడా వీడియోకాన్‌ ఇండస్ట్రీస్‌లో భాగం కానుంది. సెబీ నిబంధనలు పాటించనందున వ్యాల్యూస్‌ షేర్లు 2018 మార్చి 28 నుంచే ట్రేడింగ్‌ కావడం లేదు.  

ముగిసిన కిమ్స్‌, దొడ్ల డెయిరీ పబ్లిక్‌ ఇష్యూలు

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌కు చెందిన కిమ్స్‌ హాస్పిటల్స్‌, దొడ్ల డెయిరీ తొలి పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ) లు  శుక్రవారంతో ముగిశాయి. ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) తో కలిసి కిమ్స్‌ హాస్పిటల్స్‌ ఐపీఓ పరిమాణం సుమారు రూ.2,150 కోట్లు కాగా, దొడ్ల డెయిరీ రూ.520 కోట్లకు ఐపీఓ చేపట్టింది. కిమ్స్‌ హాస్పిటల్స్‌ ఇష్యూకు మొత్తం మీద 3.86 రెట్లు అధిక సబ్‌స్క్రిప్షన్‌ లభించింది. క్యూఐబీ విభాగంలో అధికంగా 5.27 రెట్లు సబ్‌స్క్రిప్షన్‌ వచ్చినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి.  దొడ్ల డెయిరీకి 45.62 రెట్లు అధిక సబ్‌స్క్రిప్షన్‌ వచ్చింది. ఈ సంస్థకు కూడా క్యూఐబీ విభాగంలో అధికంగా  84.88 రెట్లు సబ్‌స్క్రిప్షన్‌ లభించింది.

పిట్టీ ఇంజినీరింగ్‌కు అధిక లాభాలు

ఈనాడు, హైదరాబాద్‌: పిట్టీ ఇంజినీరింగ్‌ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ.170.34 కోట్ల ఆదాయాన్ని, రూ.21.21 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. లాభాల శాతం 11.19 వరకు ఉండటం ఆసక్తికర అంశం. 2019-20 ఇదేకాలంలో ఆదాయం రూ.112.95 కోట్లు, నికరలాభం రూ.1.53 కోట్లు మాత్రమే. గత ఆర్థిక సంవత్సరం పూర్తికాలానికి రూ.518.17 కోట్ల ఆదాయంపై రూ.28.78 కోట్ల నికరలాభం ఆర్జించింది. 2019-20లో ఆదాయం రూ.525.06 కోట్లు కాగా, నికరలాభం రూ.17.10 కోట్లు మాత్రమే. తమకు వివిధ కంపెనీల నుంచి పెద్దఎత్తున ఆర్డర్లు లభిస్తున్నాయని, సమీప భవిష్యత్తులో ఇదే విధంగా వృద్ధి బాటలో ముందుకు సాగే అవకాశం ఉందని పిట్టీ ఇంజినీరింగ్‌ వైస్‌ఛైర్మన్‌, ఎండీ అక్షయ్‌ ఎస్‌.పిట్టి పేర్కొన్నారు.

జీఎంఆర్‌ ఇన్‌ఫ్రాకు నష్టాలు

ఈనాడు, హైదరాబాద్‌: జీఎంఆర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ ఏకీకృత ఖాతాల ప్రకారం జనవరి- మార్చి త్రైమాసికానికి రూ.2519.25 కోట్ల ఆదాయాన్ని, రూ.882.76 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. 2019-20 ఇదేకాలంలో ఆదాయం రూ.2,554.31 కోట్లు, నికర నష్టం రూ.1291.91 కోట్లు ఉన్నాయి. దీంతో పోల్చితే నష్టాలు కొంతమేరకు తగ్గినట్లు స్పష్టమవుతోంది. గత ఆర్థిక సంవత్సరం (2020-21) పూర్తికాలానికి జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా ఆదాయం రూ.6,863.46 కోట్లు ఉండగా, నికరనష్టం రూ.3,230.13 కోట్లుగా నమోదైంది. 2019-20లో ఆదాయం రూ.9,222 కోట్లు, నష్టం రూ.2,178 కోట్లుగా నమోదైంది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని