గరిష్ఠ స్థాయుల్లో స్థిరీకరణ!
close

Published : 14/06/2021 02:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గరిష్ఠ స్థాయుల్లో స్థిరీకరణ!

సమీక్ష: సానుకూల దేశీయ సంకేతాలతో గత వారం మార్కెట్లు రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. దేశీయంగా కొవిడ్‌ ఉద్ధృతి తగ్గడం, టీకా ప్రక్రియ వేగవంతం కావడం, లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపు, కంపెనీల ఆకర్షణీయ త్రైమాసిక ఫలితాలు ఇందుకు అండగా నిలిచాయి. రుతుపవనాల పురోగతి ఆశాజనకంగా ఉండటమూ తోడైంది. పలు రాష్ట్రాల్లో వ్యాపార కార్యకలాపాలు పుంజుకోవడం సెంటిమెంట్‌ను మెరుగుపరిచింది. ఈ నెల మొదటి వారంలో దేశ ఎగుమతులు 52.4 శాతం పెరిగి 7.71 బిలియన్‌ డాలర్లకు చేరాయి. జీఎస్‌టీ వసూళ్లు వరుసగా ఎనిమిదో నెలైన మేలో రూ.లక్ష కోట్లను మించాయి. ఏప్రిల్‌తో పోలిస్తే మాత్రం 28 శాతం తగ్గి రూ.1.02 లక్షల కోట్లకు చేరాయి. కంపెనీల త్రైమాసిక ఫలితాలతో షేరు/రంగం ఆధారిత కదలికలు మార్కెట్లను నడిపించాయి. బ్యారల్‌ ముడిచమురు ధర 1.3 శాతం పెరిగి 72.7 డాలర్లకు చేరగా, డాలర్‌తో పోలిస్తే రూపాయి 73.1కు బలహీనపడింది. మేలో అమెరికా వినియోగదారు ద్రవ్యోల్బణం పెరగడం, బలహీన ఉద్యోగ గణాంకాలతో అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. మొత్తం మీద ఈ పరిణామాలతో గత వారం సెన్సెక్స్‌ 0.7 శాతం లాభంతో 52,475 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 0.8 శాతం పెరిగి 15,799 పాయింట్ల దగ్గర స్థిరపడింది. విద్యుత్‌, ఐటీ, ఆరోగ్య సంరక్షణ షేర్లు రాణించాయి. చమురు- గ్యాస్‌, బ్యాంకింగ్‌, యంత్ర పరికరాల స్క్రిప్‌లు నీరసపడ్డాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్‌ఐఐలు) నికరంగా రూ.1738 కోట్ల షేర్లను కొనుగోలు చేయగా, డీఐఐలు రూ.869 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. ఈనెలలో 11వ తేదీ వరకు విదేశీ పోర్టుఫోలియో మదుపర్లు నికరంగా రూ.13,424 కోట్లు పెట్టుబడులు పెట్టారు.  
లాభపడ్డ, నష్టపోయిన షేర్ల నిష్పత్తి 7:6గా నమోదు కావడం.. మార్కెట్‌లో కొనుగోళ్లను సూచిస్తోంది.

ఈవారంపై అంచనా : వరుసగా నాలుగో వారం రాణించిన సెన్సెక్స్‌.. తాజా జీవనకాల గరిష్ఠాన్ని తాకింది. ప్రస్తుత జోరు 53,200- 53,800 పాయింట్ల వరకు కొనసాగే అవకాశం ఉంది. మరోవైపు సెన్సెక్స్‌కు 51000- 51200 పాయింట్ల శ్రేణిలో తక్షణ మద్దతు లభించొచ్చు. గరిష్ఠ స్థాయుల్లో కొంత స్థిరీకరణకు అవకాశం లేకపోలేదు.
ప్రభావిత అంశాలు : అంతర్జాతీయ మార్కెట్ల సంకేతాలకు అనుగుణంగా దేశీయ సూచీలు కదలాడొచ్చు. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ పరపతి సమీక్ష, వడ్డీ రేట్ల కాలపట్టిక ప్రకటన కీలకం కానున్నాయి. పలు రాష్ట్రాల అన్‌లాక్‌ నిర్ణయాలు, రుతుపవనాల పురోగతి మార్కెట్‌ సెంటిమెంట్‌పై ప్రభావం చూపొచ్చు. త్రైమాసిక ఫలితాలు, వార్షిక సాధారణ సమావేశాల నేపథ్యంలో షేరు ఆధారిత కదలికలు చోటుచేసుకోవచ్చు. దేశీయంగా చూస్తే.. మే రిటైల్‌, టోకు ద్రవ్యోల్బణం, రుణాల వృద్ధి, వాణిజ్య లోటు, ఆర్‌బీఐ పరపతి నిర్ణయాలపై మదుపర్లు దృష్టి పెట్టొచ్చు. కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ పరిణామాలపైనా కన్నేయొచ్చు. ఈ వారం కోల్‌ ఇండియా, ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌, నాట్కో ఫార్మా వంటి సంస్థలు ఫలితాలు వెలువరించనున్నాయి. ఈ వారం రూ.9100 కోట్ల సమీకరణ లక్ష్యంతో నాలుగు పబ్లిక్‌ ఇష్యూలు రానున్నాయి. వీటికొచ్చే స్పందన నుంచీ సంకేతాలు తీసుకోవచ్చు. అంతర్జాతీయంగా బ్యాంక్‌ ఆఫ్‌ జపాన్‌ పరపతి సమీక్ష, చైనా పారిశ్రామికోత్పత్తి గణాంకాలు, అమెరికా ట్రెజరీ రాబడులనూ గమనిస్తారు. డాలర్‌తో పోలిస్తే రూపాయి కదలికలు, ముడిచమురు ధరలు, ఎఫ్‌ఐఐ పెట్టుబడుల నుంచి సంకేతాలు అందిపుచ్చుకోవచ్చు. చమురు ధరలు భారీగా పెరిగితే భారత్‌ వంటి దేశాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది.
తక్షణ మద్దతు స్థాయులు: 51,717, 51,179, 50,891
తక్షణ నిరోధ స్థాయులు: 53,000, 53,270, 53,800
గరిష్ఠ స్థాయుల్లో మార్కెట్‌ స్థిరీకరించుకోవచ్చు.

- సతీశ్‌ కంతేటి, జెన్‌ మనీ


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని