పన్ను ఆదాకు.. టాపప్‌ రుణం తీసుకోవచ్చా?
close

Updated : 04/06/2021 08:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పన్ను ఆదాకు.. టాపప్‌ రుణం తీసుకోవచ్చా?

* నాకు రూ.2లక్షల మేరకు వ్యక్తిగత రుణం ఉంది. దీనికి 13 శాతం వడ్డీ చెల్లిస్తున్నాను. నేను మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేసిన మొత్తం రూ.2,10,000 వరకూ ఉంది. కాస్త లాభంలోనే ఉన్నాను. ఈ మొత్తాన్ని వెనక్కి తీసుకొని, రుణాన్ని తీర్చేయడం మంచిదేనా? - రవి
వ్యక్తిగత రుణంపై 13 శాతం వడ్డీ చెల్లిస్తున్నాను అంటున్నారు.. ఇది చాలా ఎక్కువే. ఈ రుణాన్ని వ్యవధికి ముందే తీర్చేస్తే ముందస్తు చెల్లింపు రుసుము విధిస్తారు. ఒకసారి బ్యాంకును సంప్రదించి, ఈ రుసుముల గురించి తెలుసుకోండి. మీ మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడి లాభాల్లో ఉంది కాబట్టి.. ఇందులో నుంచి డబ్బు తీసుకొని, రుణాన్ని తీర్చేయండి. దీనివల్ల మీకు వడ్డీ ఆదా అవుతుంది. మీరు రుణానికి చెల్లిస్తున్న ఈఎంఐని క్రమానుగత పెట్టుబడి విధానం (సిప్‌)ద్వారా ఫండ్లలో మదుపు చేయండి.
నా వయసు 57 ఏళ్లు. మరో ఏడాదిలో పదవీ విరమణ ఉంది. నాకు నాలుగు నెలల క్రితం గుండెకు శస్త్ర చికిత్స జరిగింది. ఇప్పుడు టర్మ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ తీసుకునేందుకు అవకాశం ఉంటుందా? - నరేందర్‌
* సాధారణంగా ఏదైనా జబ్బు చేసినా.. శస్త్రచికిత్స జరిగినప్పుడు.. పాలసీ ఇచ్చేందుకు బీమా సంస్థలు ఆరు నెలల నుంచి.. రెండు సంవత్సరాల వరకూ వేచి ఉండే వ్యవధిగా పరిగణిస్తాయి. మీరు ముందుగా బీమా తీసుకోబోయే సంస్థలో ఈ విషయాన్ని స్పష్టంగా తెలుసుకోండి. బీమా కంపెనీలను బట్టి, ఈ వ్యవధి మారుతుంది. పాలసీ తీసుకునేటప్పుడు మీకు ఆరోగ్య పరీక్షలు చేయిస్తారు. ప్రీమియంలో కొంత లోడింగ్‌నూ విధిస్తారు. బీమా సంస్థ విచక్షణ మేరకు మీకు పాలసీ వచ్చేదీ లేనిదీ ఆధారపడుతుంది.
*  మా అమ్మ పేరు మీద ఉన్న బీమా పాలసీ నుంచి రూ.3లక్షల వరకూ వస్తున్నాయి. తన వయసు 59 ఏళ్లు. ఈ డబ్బుతో తనకు నెలనెలా ఆదాయం వచ్చేలా కార్పొరేట్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను ఎంచుకోవచ్చా? కనీసం రూ.2,500లు వచ్చేలా ఎక్కడ మదుపు చేయాలి? - స్వప్న
పెట్టుబడులపై వడ్డీ ఎక్కువ వస్తుంది అంటే.. అక్కడ నష్టభయం అంతర్లీనంగా ఉంటుందని గమనించాలి. ప్రస్తుతం మన దేశంలో వడ్డీ రేట్లు చాలా తక్కువగా ఉన్నాయి. డిపాజిట్లు, సురక్షితమైన పెట్టుబడి పథకాల్లో 5.5%-6.5% వరకూ రాబడి వచ్చే అవకాశం ఉంది. మీరు చెప్పినట్లుగా రూ.3లక్షలపై రూ.2,500 రావాలంటే.. దాదాపు 10శాతం వడ్డీ రావాలి. మంచి క్రెడిట్‌ నాణ్యత ఉన్న కార్పొరేట్‌ డిపాజిట్లపై 6.5శాతం వరకూ వడ్డీ రావచ్చు. 10 శాతం వడ్డీ రావడం కొంచెం కష్టమే. దీనికి బదులుగా మీరు పోస్టాఫీసులో నెలవారీ ఆదాయ పథకం (ఎంఐఎస్‌)ను పరిశీలించవచ్చు. ఇందులో 6.6శాతం వడ్డీ చెల్లిస్తున్నారు. రూ.3లక్షలకు నెలకు రూ.1,650 వడ్డీ అందుతుంది.
* నేను పదేళ్ల క్రితం గృహరుణం తీసుకున్నాను. దాదాపు ముగింపు దశకు వచ్చింది. వడ్డీతో పెద్దగా ఆదాయపు పన్ను మినహాయింపు లభించడం లేదు. ఇప్పుడు టాపప్‌ లోన్‌ తీసుకుంటే మేలా? వడ్డీ 8 శాతం ఉండే అవకాశం ఉంది. - విజయ్‌
ఆదాయపు పన్ను మినహాయింపు కోసం రుణాలు తీసుకోవడం అంత మంచిది కాదు. అవసరానికి రుణం తీసుకున్నప్పుడు.. దానికి చెల్లించే వడ్డీకి, అసలుకు ఆదాయపు పన్ను మినహాయింపులు లభిస్తే అది అదనపు ప్రయోజనం చేకూరినట్లు. టాపప్‌ లోన్‌ తీసుకున్నప్పుడు దేనికోసం వాడుతున్నారన్నదీ ముఖ్యమే. మీకు టాపప్‌ లోన్‌పై పన్ను మినహాయింపు కావాలంటే.. ఆ మొత్తాన్ని మీ ఇంటి మరమ్మతులు, విస్తరణ కోసం వాడుకోవాలి. ఇతర అవసరాలకు వినియోగిస్తే.. పన్ను మినహాయింపు వర్తించదు. పైగా వడ్డీ భారం ఉంటుంది.

- తుమ్మ బాల్‌రాజ్‌


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని