ఆర్థిక ఫలితాలపై దృష్టి
close

Published : 17/05/2021 04:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆర్థిక ఫలితాలపై దృష్టి

చాలా తక్కువ శ్రేణిలో ట్రేడింగ్‌ ఎంపిక చేసిన షేర్లలో కదలికలు
ఫార్మాకు లాభాలు, సిమెంటుకు నష్టాలు!
విశ్లేషకుల అంచనాలు
స్టాక్‌ మార్కెట్‌ ఈ వారం

గత వారంలో లాగే ఈ వారమూ దేశీయ మార్కెట్లో మదుపర్లు భారీ పొజిషన్లు తీసుకోవడానికి వెనకాడవచ్చని విశ్లేషకులు అంటున్నారు. మార్కెట్‌ ఎటువైపు వెళుతుందో తెలియకపోవడంతో చాలా తక్కువ శ్రేణికి లోబడే ట్రేడింగ్‌ కొనసాగొచ్చని అంచనా వేస్తున్నారు. బ్యాంకులు, ఆర్థిక షేర్లలో విక్రయాల ఒత్తిడి కనిపిస్తున్నందున ప్రతికూల ధోరణికే ఎక్కువ అవకాశం ఉండొచ్చని చెబుతున్నారు. నిఫ్టీ-50కి 14,500 వద్ద బలమైన మద్దతు లభించవచ్చని.. ఆ స్థాయికి పైన కొనసాగకపోతే స్వల్పకాలంలో నష్టాలు రావొచ్చని 14,400 లేదా అంతకంటే దిగువ స్థాయికి దిద్దుబాటు జరగొచ్చని సాంకేతిక నిపుణులు అంటున్నారు. మరో వైపు, నిఫ్టీ కంపెనీల్లో టాటా మోటార్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, హిందాల్కో, ఇండియన్‌ ఆయిల్‌ కార్ప్‌ వంటివి ఈ వారమే ఫలితాలను ప్రకటించనున్నాయి. ఈ నేపథ్యంలో ఎంపిక చేసిన స్క్రిప్‌లలో కదలికలను అంచనా వేయొచ్చు.  వివిధ రంగాలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..
* చాలా తక్కువ శ్రేణికి లోబడి వాహన షేర్లు చలించొచ్చు. టాటా మోటార్స్‌ మంగళవారం ఫలితాలను వెల్లడించనుంది.  
* టెలికాం కంపెనీల షేర్లలో ఎంపిక చేసిన వాటిలో చలనాలను అంచనా వేయొచ్చు. సోమవారం భారతీ ఎయిర్‌టెల్‌ ఫలితాల నుంచి మదుపర్లు సంకేతాలు అందిపుచ్చుకోవచ్చు.  
* ఎంపిక చేసిన యంత్ర పరికరాల షేర్లలోనే ట్రేడింగ్‌ ఉండొచ్చు. ముఖ్యంగా శుక్రవారం మార్కెట్‌ ముగిశాక ప్రకటించిన ఎల్‌ అండ్‌ టీ ఫలితాల ప్రభావం మార్కెట్లో కనిపించవచ్చు.
* చాలా వరకు ఐటీ కంపెనీల షేర్లు తక్కువ శ్రేణిలోనే కదలాడవచ్చు. అయితే ఇటీవలి వరకూ స్తబ్దుగా ఉన్నందున అవి సానుకూలంలోకి మారే అవకాశం లేకపోలేదు.  
* చమురు కంపెనీలు ఈ వారం అంతర్లీనంగా ప్రతికూల ధోరణితో స్థిరీకరణకు లోనుకావొచ్చు. బుధ, గురు వారాల్లో ఫలితాలను ప్రకటించనున్న ఐఓసీ, హెచ్‌పీసీఎల్‌ షేర్లు వెలుగులోకి రావొచ్చు.  
* బ్యాంకు షేర్లు చాలా తక్కువ శ్రేణికి లోబడి చలించొచ్చు. నిఫ్టీ బ్యాంక్‌ సూచీ 31,900-33,000 శ్రేణిలో కదలాడవచ్చు. ఫెడరల్‌ బ్యాంక్‌, కెనరా బ్యాంక్‌, ఉజ్జీవన్‌స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌, సౌత్‌ ఇండియన్‌ బ్యాంక్‌లు ఈ వారం ఫలితాలను ప్రకటించనున్నాయి.
* లోహ, గనుల కంపెనీల షేర్లు బలహీనంగా కొనసాగనున్నాయి. ఇటీవలి ర్యాలీ నేపథ్యంలో ట్రేడర్లు లాభాలను స్వీకరించే అవకాశం ఉంది.  
* ఎఫ్‌ఎమ్‌సీజీ షేర్లు చాలా తక్కువ శ్రేణికి లోబడి కదలాడవచ్చు. కరోనా మలి విడత నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల నుంచి గిరాకీ బలహీనపడొచ్చన్న అంచనాలు ఇందుకు నేపథ్యం.  
* కీలక సూచీలతో పోలిస్తే ఫార్మా షేర్లు వరుసగా మూడో వారమూ మెరుగ్గా రాణించవచ్చు.కరోనా ఔషధాలు తయారు చేసే కంపెనీలకు సానుకూలతలు కనిపిస్తుండడం; ఫలితాలు కూడా బలంగా నమోదవుతుండడంతో మదుపర్లు ఈ షేర్లపై ఆసక్తి చూపుతున్నారు.
* సిమెంటు కంపెనీల నష్టాలు మరింత పెరగవచ్చు. కరోనా ఆంక్షల వల్ల గిరాకీపై ప్రభావం పడడంతో వీటి భవిష్యత్‌ వ్యాపారంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని