close

Updated : 25/01/2021 08:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
48365 దిగితే దిద్దుబాటు!

సమీక్ష: చరిత్రలో తొలిసారిగా 50000 పాయింట్ల ఎగువకు చేరిన సెన్సెక్స్‌.. లాభాల స్వీకరణ ఎదురుకావడంతో దిద్దుబాటుకు లోనైంది. అంతర్జాతీయ సంకేతాలూ ప్రభావం చూపాయి. బడ్జెట్‌ సమీపిస్తున్న తరుణంలో మదుపర్లు అమ్మకాలకు మొగ్గుచూపారు. భారత ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబరు త్రైమాసికంలో జీడీపీ సానుకూలంగా నమోదుకావొచ్చని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) అంచనావేసింది. దేశంలో కొవిడ్‌ వ్యాక్సిన్‌ అమలు ప్రక్రియ పురోగతిపై మదుపర్లు దృష్టిపెట్టారు. కంపెనీల ఫలితాలు ఇప్పటివరకు ఆకర్షణీయంగానే ఉండటం సెంటిమెంట్‌కు దన్నుగా నిలిచింది. అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్‌ ప్రమాణస్వీకారం సాఫీగా పూర్తికావడంతో అంతర్జాతీయ మార్కెట్లు లాభపడ్డాయి. బ్యారెల్‌ ముడిచమురు 0.6 శాతం పెరిగింది. రూపాయి 9 పైసలు పెరిగి 72.97 వద్ద ముగిసింది. మొత్తం మీద ఈ పరిణామాలతో గత వారం సెన్సెక్స్‌ 0.3 శాతం నష్టంతో 48,879 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 0.4 శాతం తగ్గి 14,372 పాయింట్ల దగ్గర స్థిరపడింది. వాహన, మన్నికైన వినిమయ వస్తువులు, యంత్ర పరికరాల షేర్లు రాణించాయి. లోహ, స్థిరాస్తి, ఆరోగ్య సంరక్షణ స్క్రిప్‌లు నీరసపడ్డాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్‌ఐఐలు) నికరంగా రూ.4,176 కోట్ల విలువైన షేర్లు కొనుగోలు చేయగా, డీఐఐలు రూ.3,436 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. ఈ నెలలో ఇప్పటివరకు భారత మార్కెట్లలోకి ఎఫ్‌పీఐలు నికరంగా రూ.18,456 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఈక్విటీల్లో రూ.24,469 కోట్లు చొప్పించగా, డెట్‌ విభాగంలో రూ.6,013 కోట్ల మేర వెనక్కి తీసుకున్నారు.

లాభపడ్డ, నష్టపోయిన షేర్ల నిష్పత్తి 1:2గా నమోదు కావడం..
మార్కెట్‌లో లాభాల స్వీకరణను సూచిస్తోంది.

ఈవారంపై అంచనా : గతవారం మార్కెట్‌ బలహీనంగా ప్రారంభమై.. 48404 పాయింట్లకు పడిపోయింది. మళ్లీ కోలుకుని 50184 పాయింట్ల వద్ద జీవనకాల గరిష్ఠాన్ని తాకి, వెనక్కి వచ్చేసింది. ప్రస్తుతం సెన్సెక్స్‌కు 48365 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు, అనంతరం 47594 పాయింట్ల దగ్గర కీలక మద్దతు దక్కే అవకాశం ఉంది. ఈ స్థాయిని కోల్పోతే మాత్రం స్వల్పకాలంలో దిద్దుబాటుకు ఆస్కారం ఉంటుంది.

ప్రభావిత అంశాలు: బడ్జెట్‌ సమావేశాలు సమీపిస్తున్న తరుణంలో మార్కెట్లు ఒడుదొడుకుల మధ్య కదలాడే అవకాశం ఉంది. జనవరి డెరివేటివ్‌ కాంట్రాక్టుల గడువు వచ్చే గురువారం ముగియనుండటం, మంగళవారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా సెలవు కావడంతో మదుపర్లు ఆచితూచి వ్యవహరించనున్నారు. కార్పొరేట్‌ ఫలితాల నేపథ్యంలో షేరు ఆధారిత కదలికలు, కంపెనీల వ్యాఖ్యలు మార్కెట్లకు దిశానిర్దేశం చేయనున్నాయి. ఈ వారం యాక్సిస్‌ బ్యాంక్‌, కోటక్‌ బ్యాంక్‌, ఎల్‌ అండ్‌ టీ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, హెచ్‌యూఎల్‌, కోల్గేట్‌, ఇండిగో, ఐఆర్‌సీటీసీ, మారుతీ, పిడిలైట్‌, టీవీఎస్‌ మోటార్స్‌, సిప్లా, డాబర్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, డీఎల్‌ఎఫ్‌, ఐఓసీ, సన్‌ఫార్మా, టాటా మోటార్స్‌, టెక్‌ మహీంద్రా, యూపీఎల్‌, వేదాంతా, ఐసీఐసీఐ బ్యాంక్‌ వంటి దిగ్గజ సంస్థలు ఫలితాలు ప్రకటించనున్నాయి. చైనాలో కరోనా మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లు అప్రమత్తతతో వ్యవహరించొచ్చు. అమెరికా ఉద్దీపన ప్యాకేజీ వార్తలు కీలకం కానున్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి కదలికలు, ముడిచమురు ధరలు, ఎఫ్‌ఐఐ పెట్టుబడుల నుంచి కూడా సంకేతాలు అందిపుచ్చుకోవచ్చు. చైనాలో కొత్త ఆంక్షల నేపథ్యంలో గిరాకీ తగ్గితే, చమురు ధరలు పడే అవకాశం ఉంది.

తక్షణ మద్దతు స్థాయిలు: 48,365, 47,594, 47,055
తక్షణ నిరోధ స్థాయిలు: 49,500, 50,184, 50,800
సెన్సెక్స్‌ 48,365 పాయింట్ల దిగువకు చేరితే మరింత దిద్దుబాటుకు గురికావొచ్చు.

- సతీశ్‌ కంతేటి, జెన్‌ మనీ

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని