close

Updated : 25/01/2021 07:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఊగిసలాటకు అవకాశం

ఫెడ్‌ సమావేశం, డెరివేటివ్‌ల గడువు నేపథ్యం

సిమెంటు షేర్లకు సానుకూలతలు

మంగళవారం మార్కెట్లకు సెలవు

విశ్లేషకుల అంచనాలు

స్టాక్‌ మార్కెట్‌

ఈ వారం

దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈ వారం ఊగిసలాటకు గురికావొచ్చని మార్కెట్‌ నిపుణులు అంటున్నారు. కొవిడ్‌ అనంతరం తొలి బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న  ఆర్థిక మంత్రి పార్లమెంటులో ప్రవేశ పెట్టనున్నారు. జనవరి డెరివేటివ్‌ సిరీస్‌ గడువు గురువారం ముగియనుంది. గణతంత్ర దినోత్సవ సందర్భంగా మంగళవారం స్టాక్‌ మార్కెట్లు పనిచేయవు కాబట్టి ఈ వారం ట్రేడింగ్‌ నాలుగు రోజులకే పరిమితం కానుంది. ఇవన్నీ ప్రభావం చూపుతాయి. నిఫ్టీ-50కి ఈ వారం 14,170-14,200 మధ్య బలమైన మద్దతు లభించవచ్చని.. 14,600-14,650 శ్రేణిలో నిరోధం ఎదురుకావొచ్చని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. అమెరికా ఫెడరల్‌ సమావేశం కూడా ఊగిసలాటలను పెంచే అవకాశం ఉంది. వివిధ రంగాలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..
* ఔషధ కంపెనీల త్రైమాసిక ఫలితాలపై ఆధారపడి ఆయా సంస్థల షేర్లు కదలాడవచ్చు. బడ్జెట్లో ఈ రంగానికిచ్చే ప్రోత్సాహకాలూ దిశానిర్దేశం చేయొచ్చు. ఈ వారం సన్‌ఫార్మా, సిప్లా, లుపిన్‌, లారస్‌ లాబ్స్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ఫలితాలు వెల్లడించనున్నాయి.
* ఐటీ షేర్లు స్థిరంగా, తక్కువ శ్రేణిలో చలించొచ్చు. శుక్రవారం ఫలితాల వెల్లడి నేపథ్యంలో టెక్‌ మహీంద్రా షేర్లు వెలుగులోకి రావొచ్చు.
* ప్రభుత్వ రంగ చమురు కంపెనీల షేర్లు స్థిరీకరణకు లోనుకావొచ్చు. వీటిలో అంతర్లీనంగా సానుకూలతలు కనిపిస్తున్నాయి. అప్‌స్ట్రీమ్‌ కంపెనీల స్క్రిప్‌లు ముడి చమురు ధరల ఆధారంగా చలించొచ్చు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఫలితాలు అంచనాలను మించడంతో నేడు ఆ షేర్లపై ప్రభావం ఉంటుంది.
* ఎంపిక చేసిన టెలికాం షేర్లలో చలనాలు ఉండొచ్చు. నవంబరు నెల వినియోగదార్ల సంఖ్యను ఈ వారం ట్రాయ్‌ విడుదల చేయనుంది. ఫిబ్రవరి 3న ఫలితాల నేపథ్యంలో భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు రాణించవచ్చు.  
* ఎల్‌ అండ్‌ టీ ఫలితాలు (సోమ), ఆర్డర్లపై ఆ కంపెనీ వ్యాఖ్యలను బట్టి యంత్ర పరికరాల షేర్లు కదలాడొచ్చు. కీలక సూచీల నుంచీ సంకేతాలను అందిపుచ్చుకోవచ్చు.  
* బడ్జెట్‌ సమీపించినందున బ్యాంకు షేర్లు పెద్దగా కదలాడకపోవచ్చు. యూకో బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, కెనరా బ్యాంక్‌, ఆర్‌బీఐఎల్‌ బ్యాంక్‌, ఐడీబీఐ బ్యాంక్‌ల ఫలితాలను బట్టి ఆయా షేర్లలో ట్రేడింగ్‌ జరగొచ్చు. బ్యాంక్‌ నిఫ్టీకి 31,000 వద్ద మద్దతు లభించవచ్చు.
* బుధవారం వెలువడే హిందుస్థాన్‌ యునిలీవర్‌ కంపెనీ ఆర్థిక ఫలితాల నుంచి ఎఫ్‌ఎమ్‌సీజీ షేర్లు సంకేతాలను అందిపుచ్చుకోవచ్చు.
* వాహన కంపెనీల షేర్లు ఒక శ్రేణికి లోబడి చలించొచ్చు. బడ్జెట్‌లో ప్రోత్సాహకాలుంటే కంపెనీల విక్రయాలు మెరుగు పడతాయి. గురువారం మారుతీ ఫలితాలను గమనిస్తారు.
* సానుకూల ధోరణితో, చాలా తక్కువ శ్రేణిలో సిమెంటు కంపెనీల షేర్లు కదలాడొచ్చు. మెరుగైన విక్రయాల నేపథ్యంలో డిసెంబరు ఫలితాలు బాగుంటాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
* లోహ, గనుల కంపెనీల షేర్లూ ఊగిసలాటకు గురికావొచ్చు. జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ ఫలితాలు అంచనాలను మించడం సానుకూలాంశం. బుధవారం బోర్డు సమావేశంలో షేర్ల బైబ్యాక్‌ను పరిశీలించనున్న నాల్కో షేర్లపైనా మదుపర్లు దృష్టి సారించవచ్చు.

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని