ఆదాయపు పన్ను వెబ్‌సైట్‌లో ఇంకా కొన్ని సమస్యలు - Some more issues on the income tax website
close

Published : 16/09/2021 03:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆదాయపు పన్ను వెబ్‌సైట్‌లో ఇంకా కొన్ని సమస్యలు

దిల్లీ: ఆదాయపు పన్ను కొత్త వెబ్‌సైట్‌  www.incometax.gov.in లో ఇంకా కొన్ని సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నెల 15 నాటికి ఈ వెబ్‌సైటులో ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, వెబ్‌సైటును సిద్ధం చేసిన ఇన్ఫోసిస్‌కు సూచించారు. వెబ్‌సైటు పనితీరు ఇంకా మెరుగవ్వాల్సి ఉందని పలువురు పన్ను నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా 2013-14కు ముందు మదింపు సంవత్సరాలకు సంబంధించిన పాత రిటర్నులు కనిపించకపోవడం, రిఫండ్‌ వివరాలు లేకపోవడం లాంటి సమస్యలను ప్రస్తావిస్తున్నారు. ఆదాయపు పన్ను మొత్తం చెల్లించినప్పటికీ.. జులై 31 తర్వాత రిటర్నులు దాఖలు చేస్తున్న వారికి 1 శాతం వడ్డీ పడుతోందని, ఈ సమస్య ఇంకా పరిష్కారం కాలేదని పేర్కొంటున్నారు. రిటర్నుల దాఖలుకు డిసెంబరు 31 వరకు గడువున్న నేపథ్యంలో ఇప్పటికే మొత్తం పన్నును చెల్లించిన వారికి వడ్డీని ప్రభుత్వం రద్దు చేసింది. కొన్ని రోజులు వెబ్‌సైట్‌ సరిగా పనిచేయడం, మరికొన్ని రోజులు మెరాయించడం జరుగుతోందని పన్ను నిపుణులు పేర్కొంటున్నారు.


టాటా గ్రూప్‌లో నిర్మాణాత్మక మార్పుల్లేవు
టాటా సన్స్‌ ఛైర్మన్‌ చంద్రశేఖరన్‌

దిల్లీ: టాటా గ్రూప్‌ హోల్డింగ్‌ కంపెనీ టాటా సన్స్‌లో కొత్తగా సీఈఓ పదవిని సృష్టించనున్నట్లు వస్తున్న వార్తలను టాటా సన్స్‌ ఛైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌ కొట్టిపారేశారు. ప్రస్తుతానికి గ్రూప్‌లో ఎటువంటి నిర్మాణాత్మక మార్పులు చేయబోవడం లేదని స్పష్టం చేశారు. కార్పొరేట్‌ పరిపాలన మెరుగుపరిచేందుకు కొత్తగా ముఖ్య కార్యనిర్వాహణ అధికారి (సీఈఓ) పదవిని సృష్టించడానికి టాటా సన్స్‌ యోచిస్తున్నట్లు బ్లూమ్‌బర్గ్‌ వార్త ఇచ్చిన నేపథ్యంలో చంద్రశేఖరన్‌ తాజా ప్రకటన చేశారు. బోర్డు నామినేషన్‌, రెమ్యూనరేషన్‌ కమిటీ అటువంటి నిర్ణయాలు ఏమీ తీసుకోలేదని వెల్లడించారు. సాధారణ కార్యకలాపాలకు ఇటువంటి వార్తలు ఆటంకం కలిగిస్తాయని అన్నారు. గ్రూప్‌లో భారీ మార్పులు చోటుచేసుకోనున్నట్లు వచ్చిన ఊహాగానాలు తనను తీవ్రంగా నిరుత్సాహపరిచాయని టాటా ట్రస్ట్స్‌ ఛైర్మన్‌ రతన్‌ టాటా పేర్కొన్నారు.


న్యూయార్క్‌ కోర్టు విచారణపై స్టే కోరిన కెయిర్న్‌, ఎయిరిండియా  

దిల్లీ: 1.2 బిలియన్‌ డాలర్ల మధ్యవర్తిత్వ తీర్పు అమలు నిమిత్తం ఎయిరిండియాను లక్ష్యం చేసుకుని కెయిర్న్‌ ఎనర్జీ దాఖలు చేసిన దావాకు సంబంధించి తదుపరి విచారణపై స్టే ఇవ్వాలని కెయిర్న్‌ ఎనర్జీ, ఎయిరిండియాలు సంయుక్తంగా విజ్ఞప్తి చేశాయి. దేశంలో వెనకటి తేదీ నుంచి పన్ను(రెట్రోస్పెక్టివ్‌ టాక్స్‌) వసూలును రద్దు చేయడం కోసం భారత ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకువచ్చింది. దీని ప్రభావంతో కెయిర్న్‌పై విధించిన రూ.10,247 కోట్ల పన్ను నోటీసులను ఉపసంహరించుకున్నట్లు అయింది. అదే సమయంలో కెయిర్న్‌ కట్టిన రూ.7900 కోట్ల పన్నును రిఫండ్‌ చేయడానికి సైతం గత నెలలోనే కేంద్రం అంగీకరించింది. ఈ నేపథ్యంలోనే ఇరు కంపెనీలు సంయుక్తంగా స్టే ఇవ్వాలని యూఎస్‌ డిస్ట్రిక్ట్‌ న్యాయమూర్తి పాల్‌ గార్డెఫ్‌కు విన్నవించాయి. రూ.7,900 కోట్లు అందిన వెంటనే విదేశాల్లో ఆస్తుల జప్తును కోరుతూ దాఖలు చేసిన దావాలను వెనక్కి తీసుకుంటామని కెయిర్న్‌ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని