Reliance AGM: Sep 10 నుంచి జియో ఫోన్‌ నెక్స్ట్‌ - Reliance AGM Meeting Updates
close

Updated : 24/06/2021 16:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Reliance AGM: Sep 10 నుంచి జియో ఫోన్‌ నెక్స్ట్‌

వార్షిక సర్వసభ్య సమావేశంలో వెల్లడించిన ముకేశ్ అంబానీ

ముంబయి: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ బోర్డులో కొత్త సభ్యులు చేరారు. చమురు విభాగంలో ఈ సంస్థలో భారీ పెట్టుబడులు పెట్టిన సౌదీ అరేబియా సంస్థ సౌదీ ఆరామ్‌కో ఛైర్మన్‌ యాసిర్‌ అల్‌ రుమయాన్‌ రిలయన్స్‌ బోర్డులోకి వస్తున్నారు. ఈ మేరకు రిలయన్స్‌ 44వ వార్షిక సర్వసభ్య సమావేశంలో కంపెనీ అధినేత ముకేశ్‌ అంబానీ ప్రకటించారు. 

‘‘ప్రపంచవ్యాప్తంగా ఎనర్జీ ఫైనాన్స్‌, టెక్నాలజీలో యాసిర్‌ అల్‌ రుమయాన్‌ ప్రముఖ వ్యక్తి. ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీల్లో ఒకటైన సౌదీ ఆరామ్‌కో ఛైర్మన్‌గా ఆయన అనుభవం నుంచి ప్రయోజనం పొందుతామనే విశ్వాసం మాకుంది. రిలయన్స్‌ బోర్డులో ఆయన చేరిక.. రిలయన్స్‌ ప్రపంచీకరణలో మొదటి అడుగుగా భావిస్తున్నాం. అంతర్జాతీయ స్థాయిలో రిలయన్స్‌ ఎదుగుదలకు ఇది ప్రారంభం. భవిష్యత్తులో ఆ ప్రణాళికలు రానున్నాయి. ఆయనను సాదరంగా బోర్డులోకి ఆహ్వానిస్తున్నాం’’ అని ముకేశ్ తెలిపారు. 

సమీకృత ఆదాయం రూ.54,000 వేలకోట్లు..

‘‘రిలయన్స్‌ గతేడాది అద్భుతమైన ప్రదర్శన కనబర్చింది. కంపెనీ సమీకృత ఆదాయం రూ.54,000 కోట్లకు చేరింది. కన్సాలిడేటెడ్‌ ఈబీఐటీడీఏ రూ.98,000 కోట్లుగా నిలిచింది. వీటిల్లో 50శాతం కన్జ్యూమర్‌ వ్యాపారం నుంచే లభించింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ భారత ఆర్థిక వ్యవస్థ ఎగుమతుల్లో 6.8శాతం వాటాను అందించింది. మా కంపెనీలో 75,000 కొత్త ఉద్యోగాలు ఇచ్చాం. ఇక కస్టమ్స్‌, ఎక్సైజ్‌ సుంకం కింద రూ. 21,044 కోట్లు, జీఎస్‌టీ కింద రూ. 85,306 కోట్లు, వ్యాట్‌ రూపంలో రూ.3,213 కోట్లు ఆదాయపు పన్ను చెల్లించాం. రూ.3,24,432 కోట్ల మూలధనాన్ని తీసుకొచ్చాము. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పెట్టుబడుల్లో ఒకటి’’ అని ముకేశ్‌ వివరించారు. 

‘‘జియో ప్లాట్‌ఫామ్స్‌ 37.9 మిలియన్‌ వినియోగదారులను కొత్తగా చేర్చుకున్నాయి. మొత్తం 425మిలియన్ల మందికి సేవలు అందిస్తోంది. రిలయన్స్‌ రిటైల్‌ దేశంలో నెంబర్‌ వన్‌ రిటైల్‌గా ఉంది.  సమీప పోటీదారు కంటే ఆరు రెట్లు ముందు ఉంది. సౌదీ అరామ్‌కోను రిలయన్స్‌ చమురు, రసాయనాల వ్యాపారంలోకి భాగస్వామిగా అధికారికంగా ఆహ్వానిస్తున్నాను. వైసీ త్రివేది బోర్డు నుంచి వైదొలగుతున్నారు. మీ సేవలకు ధన్యవాదాలు. మీరు ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాం’’ అని తన ప్రసంగంలో పేర్కొన్నారు. 

జియోఫోన్‌ నెక్స్ట్‌.. అత్యంత చౌక స్మార్ట్‌ఫోన్‌

‘‘రిలయన్స్‌-గూగుల్‌ భాగస్వామ్యంతో జియోఫోన్‌ నెక్స్ట్‌ను అభివృద్ధి చేశాం. ఈ ఫోన్‌ గణేష్‌ చతుర్థి సందర్భంగా సెప్టెంబర్‌ 10వ తేదీ నుంచి అందుబాటులో ఉంటుంది. ఇది పూర్తిస్థాయి స్మార్ట్‌ఫోన్‌. ఇది గూగుల్‌, జియో సూట్‌లలోని మొత్తం అప్లికేషన్లను సపోర్ట్‌ చేస్తుంది. దీనిలో సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ఉంది. దీనిని గూగుల్‌తో కలిసి అభివృద్ధి చేశాము. ‘జియోఫోన్‌ నెక్స్ట్‌’ భవిష్యత్తులో భారత్‌లోనే కాదు.. ప్రపంచంలోనే అత్యంత చౌక స్మార్ట్‌ఫోన్‌గా నిలుస్తుంది. గూగుల్‌ క్లౌడ్‌ను జియో వినియోగించుకొంటుంది.  వాట్సాప్‌-జియోమార్ట్‌ అనుసంధానంపై జియో, ఫేస్‌బుక్‌లు పరీక్షలు నిర్వహిస్తున్నాయి. జియో ఫైబర్‌ కొవిడ్‌ సమయంలో అనుకున్నంత వేగంగా విస్తరించలేదు. అయినా 20 లక్షల మంది కొత్త ఇళ్లకు చేరింది. రిలయన్స్‌ రిటైల్‌ వృద్ధి శరవేగంగా జరుగుతోంది. వచ్చే 3-5 ఏళ్లలో మూడింతల వేగంతో వృద్ధి సాధిస్తుంది. కొవిడ్‌ సమయంలో రిటైల్‌ విభాగం ఉద్యోగాలను కాపాడటమే కాదు.. కొత్తగా 65,000 ఉద్యోగాలను సృష్టించింది’’ అని ముఖేశ్‌ వెల్లడించారు. 

‘‘గత పదేళ్లలో 90 బిలియన్‌ డాలర్లను పెట్టుబడిగా పెట్టింది. రానున్న పదేళ్లలో భాగస్వాములతో కలిసి 200 బిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నాం. ఇవి మరో 10లక్షలకు పైగా కొత్త ఉద్యోగాలను సృష్టిస్తాయి. వేల సంఖ్యలో కొత్తగా వ్యాపారాలకు బీజం వేస్తాయి. కష్టకాలంలో సానుకూల ధోరణితో ఉండాలని కొవిడ్‌ మహమ్మారి మనకు పాఠం నేర్పింది. అదే ఆశ, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది.’’ అని అంబానీ తన ప్రసంగంలో పేర్కొన్నారు.

‘‘గూగుల్‌ క్లౌడ్‌, జియో మధ్య కుదిరిన 5జీ భాగస్వామ్యం దాదాపు 100 కోట్ల మంది భారతీయులకు  వేగవంతమైన ఇంటర్నెట్‌ అందిస్తుంది. ఇది వారి డిజిటల్‌ మార్పులు, వ్యాపారాలకు సహకరిస్తుంది. తర్వాతి తరం భారత్‌ డిజిటలైజేషన్‌కు పునాది వేస్తుంది. భారత్‌లో వ్యాపారాలు, వాణిజ్యాన్ని బలోపేతం చేయడమే మా ఒప్పందం లక్ష్యం’’

- సుందర్‌ పిచాయ్‌ (గూగుల్‌ సీఈవో)


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని