కుటుంబాల రుణాలు రూ.75 లక్షల కోట్లు - Family loans are Rs 75 lakh crore
close

Published : 16/09/2021 03:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కుటుంబాల రుణాలు రూ.75 లక్షల కోట్లు

జూన్‌ త్రైమాసికంపై ఎస్‌బీఐ నివేదిక అంచనా

ముంబయి: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కుటుంబ అప్పులు స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) 34 శాతానికి దిగి వచ్చాయని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) పరిశోధనా నివేదిక ఎకోరాప్‌ అంచనా వేసింది. కొవిడ్‌-19 పరిణామాల ప్రభావంతో గత ఆర్థిక సంవత్సరంలో (2020-21) కుటుంబాల అప్పు జీడీపీలో 37.3 శాతానికి పెరిగిందని, 2019-20లో 32.5 శాతంగా ఉందని తెలిపింది. అంకెల్లో చూస్తే.. కుటుంబాల అప్పు 2020-21 జూన్‌ త్రైమాసికంలో రూ.73.59 లక్షల కోట్లు కాగా, 2021-22 జూన్‌ త్రైమాసికంలో రూ.75 లక్షల కోట్లుగా ఉండొచ్చని పేర్కొంది. భారత అప్పు-పెట్టుబడి సర్వే (ఏఐడీఐఎస్‌) నివేదిక 2018 ప్రకారం, 2012-18 మధ్య గ్రామీణ, పట్టణ కుటుంబాల్లో సరాసరి అప్పు పెరిగిందని ఎస్‌బీఐ వెల్లడించింది.

ఈ నివేదిక ప్రకారం..

2018తో ముగిసిన ఆరేళ్ల కాలానికి గ్రామీణ, పట్టణ కుటుంబాల్లో అప్పు వరుసగా 84 శాతం, 42 శాతం పెరిగింది. ఈ కాలంలో 18 రాష్ట్రాల్లో గ్రామీణ కుటుంబాల సరాసరి అప్పు గత ఆరేళ్లలో రెట్టింపు కంటే ఎక్కువగా ఉంది. 7 రాష్ట్రాల్లో పట్టణ ప్రాంత  కుటుంబాల అప్పు కూడా ఇదే విధంగా పెరిగింది.
మహారాష్ట్ర, రాజస్థాన్‌, అసోంతో సహా 5 రాష్ట్రాల్లో 2012-18 మధ్య గ్రామీణ, పట్టణ కుటుంబాల్లో సరాసరి అప్పులు రెట్టింపయ్యాయి.
ఏఐడీఐఎస్‌ నివేదిక ప్రకారం గ్రామీణ కుటుంబాల సగటు రుణం రూ.59,748 కాగా, పట్టణ ప్రాంత కుటుంబాల అప్పు రూ.1.20 లక్షలుగా ఉన్నాయి.
కొవిడ్‌ మహమ్మారి ప్రభావంతో 2021లో గ్రామీణ కుటుంబాల సగటు అప్పు రూ.1.16 లక్షలకు,  పట్టణ కుటుంబాల అప్పు రూ.2.33 లక్షలకు చేరి ఉండొచ్చు.
అప్పు-ఆస్తి నిష్పత్తి గ్రామీణ కుటుంబాల్లో 2012లో 3.2 శాతం ఉండగా, 2018 నాటికి అది 3.8 శాతానికి చేరింది. పట్టణ ప్రాంత కుటుంబాల్లో 3.7 శాతం నుంచి 4.4 శాతానికి చేరింది.


ఆర్‌అండ్‌డీలో నియామకాలు: మీడియాటెక్‌

దిల్లీ: చిప్‌సెట్‌ కంపెనీ మీడియాటెక్‌ భారత్‌లో పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని మరింత విస్తరిస్తోంది. ఇందుకోసం కృత్రిమ మేధ, స్మార్ట్‌హోం, 5జీ, వైర్‌లెస్‌ కమ్యూనికేషన్స్‌ విభాగాల్లో నిపుణులను నియమించుకోనున్నట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న కార్యాలయాల్లో ఈ నియామకాలు ఉంటాయి. బెంగళూరు, నోయిడాలలో ఉన్న ప్రొడక్ట్‌ డిజైన్‌ కేంద్రాల్లో పరిశోధనలకు ఎక్కువ మందిని నియమించుకోనుంది.


హైదరాబాద్‌లో ‘హౌసర్‌ కో-లివింగ్‌’ విస్తరణ

ఈనాడు, హైదరాబాద్‌: కో-లివింగ్‌ సేవల సంస్థ హౌసర్‌  హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌, కొండాపూర్‌ ప్రాంతాల్లో రెండు కొత్త ప్రాంగణాలు సిద్ధం చేసినట్లు తెలిపింది. ఈ సంవత్సరాంతం లోగా హైదరాబాద్‌లో 10- 12 ప్రాంగాణాలను నిర్వహించే స్థాయికి ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం ఈ సంస్థ ఎన్‌సీఆర్‌ దిల్లీ, పుణె, హైదరాబాద్‌లలో కార్యకలాపాలు సాగిస్తోంది. 2022 చివరి నాటికి దేశవ్యాప్తంగా విస్తరించాలనేది తమ లక్ష్యమని హౌసర్‌ సీఈఓ దీపక్‌ ఆనంద్‌ తెలిపారు. త్వరలో బెంగళూరు, చెన్నై నగరాల్లో కార్యకలాపాలు ప్రారంభిస్తామని వివరించారు.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని