రూ.14,000 కోట్ల సమీకరణకు బోర్డు ఆమోదం: ఎస్‌బీఐ - Board approves Rs 14000 crore mobilization SBI
close

Updated : 22/06/2021 11:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రూ.14,000 కోట్ల సమీకరణకు బోర్డు ఆమోదం: ఎస్‌బీఐ

దిల్లీ: బాసెల్‌-3 నిబంధనలకు అనుగుణంగా బాండ్ల జారీ ద్వారా రూ.14,000 కోట్ల నిధుల్ని సమీకరించాలన్న ప్రతిపాదనకు బ్యాంక్‌ కేంద్ర బోర్డు (సెంట్రల్‌ బోర్డు) ఆమోదం తెలిపిందని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) సోమవారం తెలిపింది. ఈ బాండ్లను భారతీయ లేదా అమెరికా డాలర్ల రూపంలో జారీ చేయాలని ప్రతిపాదించినట్లు ఎక్స్ఛేంజీలకు సమాచారమిచ్చింది.

ఎన్‌సీడీల జారీ ద్వారా 5,000 కోట్లు: ఐఐఎఫ్‌ఎల్‌ హోమ్‌ ఫైనాన్స్‌ తమ రుణ వ్యాపారానికి ఊతమిచ్చేందుకు మార్పిడి రహిత డిబెంచర్లను (ఎన్‌సీడీలు) జారీ చేసి రూ.5,000 కోట్ల వరకు నిధుల్ని సమీకరించాలని ప్రణాళిక సిద్ధం చేసింది. బాండ్ల జారీకి సంబంధించిన పబ్లిక్‌ ఇష్యూ కోసం కంపెనీ స్టాక్‌ ఎక్స్ఛేంజీలైన ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈలకు ముసాయిదా దాఖలు చేసింది.

ఏసీసీ బ్యాటరీల తయారీకే  రూ.18100 కోట్ల పీఎల్‌ఐ పథకం

దిల్లీ: అధునాతన కెమిస్ట్రీ సెల్‌ (ఏసీసీ) బ్యాటరీల తయారీని ప్రోత్సాహించేందుకు ప్రభుత్వం రూ.18,100 కోట్ల ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు (పీఎల్‌ఐ) పథకాన్ని నోటిఫై చేసింది. ఏసీసీ బ్యాటరీల ఉత్పత్తి  సంస్థలు మాత్రమే ఈ ప్రోత్సాహకాలను పొందే సౌలభ్యం ఉంటుంది. భారీ పరిశ్రమల శాఖ జారీ చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం..  ఇప్పటికే తయారీ కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంప్రదాయ బ్యాటరీల విభాగానికి ఈ ప్రోత్సాహకాలను అందించరు. ఈ ఏడాది మేలో ఈ పథకానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం భారత్‌ ఏసీసీ బ్యాటరీల అవసరాలకు పూర్తిగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. నోటిఫికేషన్‌ ప్రకారం.. లబ్ధిదారు సంస్థ కనీసం 5 గిగావాట్‌ హవర్ల ఏసీసీ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఒక్కో సంస్థకు సబ్సిడీ రాయితీని 20 గిగావాట్‌ హవర్ల పరిమితి విధించారు.

ఐటీ పోర్టల్‌లో కొనసాగుతున్న సమస్యలు
నేడు చర్చించనున్న ఆర్థిక శాఖ, ఇన్ఫోసిస్‌

దిల్లీ: పన్ను చెల్లింపుదారులకు రిటర్నుల దాఖలును మరింత సులభతరం చేసేందుకు ఐటీ విభాగం రెండు వారాల క్రితం ఆవిష్కరించిన కొత్త పోర్టల్‌లో సమస్యలు తీరడం లేదు. ఈ నెల 7 ప్రారంభమైన ‌్ర్ర్ర.i-‘్న్ఝ’ ్మ్చ్ల.్ణ్న‌్ర.i- వెబ్‌సైటులో ఇంకా సమస్యలు ఉండటంతో.. సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేలా  చూసేందుకు మంగళవారం ఇన్ఫోసిస్‌ ప్రతినిధులతో సమావేశం అవ్వాలని ఆర్థిక శాఖ అధికారులు నిర్ణయించారు. ఈ సమావేశానికి ఐసీఏఐ సభ్యులు, ఆడిటర్లు, కన్సల్టెంట్లు కూడా హాజరు కానున్నారు.  ఈ పోర్టల్‌ను రూపొందించిన ఇన్ఫోసిస్‌.. వెబ్‌సైటుకు సంబంధించి సాంకేతిక ఇబ్బందులు తొలగించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు వార్షిక సాధారణ సమావేశంలో కూడా వెల్లడించింది. తొలినాళ్లలో వచ్చిన చాలా సాంకేతిక సమస్యలను పరిష్కరించామని, రోజుకు కొన్ని లక్షల మంది ఈ వెబ్‌సైటు వినియోగిస్తున్నారని ఇన్ఫోసిస్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ ప్రవీణ్‌రావు తెలిపారు.

ఆయిల్‌ ఇండియా లాభం రూ.848 కోట్లు

దిల్లీ: దేశీయంగా చమురు ఉత్పత్తి చేసే రెండో అతిపెద్ద సంస్థ ఆయిల్‌ ఇండియా మార్చి త్రైమాసికానికి రూ.847.56 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. 2019-20 ఇదే త్రైమాసికంలో ఆర్జించిన లాభం రూ.925.65 కోట్ల కంటే ఇది 8 శాతం తక్కువ. ప్రతి బ్యారల్‌ ముడిచమురుపై ఆర్జించే మొత్తం ఏడాది వ్యవధిలో 5.18 డాలర్ల నుంచి 59.80 డాలర్లకు పెరిగింది. గ్యాస్‌ ఉత్పత్తిలో తేడా లేకున్నా, చమురు ఉత్పత్తి 5.28 శాతం తగ్గింది. మొత్తం టర్నోవర్‌ రూ.3583.72 కోట్ల నుంచి 3909.61 కోట్లకు పెరిగింది. 2020-21 పూర్తి ఆర్థిక సంవత్సరానికి నికరలాభం రూ.1741.59 కోట్లు కాగా, 2019-20లో రూ.2584.06 కోట్లు. బ్యారల్‌ ముడిచమురు సగటు ధర 60.75 డాలర్ల నుంచి 43.98 డాలర్లకు తగ్గడమే ఇందుకు కారణం. ప్రతి షేరుకు రూ1.50 చొప్పున తుది డివిడెండును బోర్డు సిఫారసు చేసింది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని