close

Updated : 02/03/2021 12:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రూ.10లక్షల బడ్జెట్‌లో మంచి మైలేజ్‌ ఇచ్చే కార్లు

రోజురోజుకీ పెట్రో ధరలు మండిపోతున్నాయి. సామాన్యుడు వాహనం బయటకు తీయాలంటేనే బెంబేలెత్తిపోతున్నాడు. ఇక కొత్తగా కారు తీసుకోవాలనుకునే వారిని వాహన ధర కంటే ఇంధన రేట్లే భయపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో తక్కువ ధరలో మంచి మైలేజ్‌ ఇచ్చే పెట్రోల్‌ కార్లపై వినియోగదారులు దృష్టి సారిస్తున్నారు. మార్కెట్లో ఎక్స్‌షోరూం ధర రూ.పది లక్షల బడ్జెట్‌లో ఎక్కువ మైలేజ్ ఇచ్చే.. మంచి ఫీచర్లు ఉన్న కొన్ని చిన్న కార్లపై లుక్కేద్దాం..!


మారుతీ సుజుకీ డిజైర్‌

భారత్‌లో మంచి ఇంధన సామర్థ్యం గల పెట్రోల్‌ కార్లలో మారుతీ సుజుకీ డిజైర్‌ది ప్రత్యేక స్థానం. ఆటోమోటివ్‌ రీసెర్చి అసోసియేషన్‌ ఆఫ్ ఇండియా(ఏఆర్‌ఏఐ) సమాచారం ప్రకారం.. ఇది లీటరుకు 23.16 నుంచి 24.12 కి.మీ మైలేజీనిస్తుంది. దీని ధర వేరియంట్‌ను బట్టి రూ.5.94-8.90 లక్షల (ఎక్స్‌షోరూం) మధ్య ఉంది. 1.2 లీటర్‌ ఇంజిన్‌ గల ఈ కారు 88 హెచ్‌పీ శక్తిని, 113 ఎన్‌ఎం టార్క్‌ను విడుదల చేస్తుంది.


మారుతీ సుజుకీ స్విఫ్ట్‌

స్వల్ప మార్పులతో ఇటీవల మార్కెట్లోకి వచ్చిన మారుతీ సుజుకీ స్విఫ్ట్‌ మైలేజీ ఏఆర్‌ఏఐ వివరాల ప్రకారం.. మాన్యువల్‌ వేరియంట్‌ లీటర్‌ పెట్రోల్‌కు 23.20 కి.మీ, ఆటోమేటిక్‌ వేరియంట్‌ 23.76 కి.మీ దూరం ప్రయాణిస్తుంది. ఇక దీని ధర విషయానికి వస్తే వేరియంట్‌ను బట్టి రూ.5.73-8.41 లక్షల మధ్య ఉంది. దీనిలో ఆటోమేటిక్‌ వెర్షన్‌ ధర రూ.6.86 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.


డాట్సన్‌ రెడీ-గో

హ్యాచ్‌బ్యాగ్ విభాగంలో భారత్‌లో అత్యంత చౌకగా.. మెరుగైన ఇంధన సామర్థ్యంలో లభిస్తున్న కారు డాట్సన్‌ రెడీ-గో. 1.0 ఇంజిన్‌ కలిగిన ఈ కారు లీటర్‌ పెట్రోల్‌కు 22 కి.మీ మైలేజీ ఇస్తుంది. ఇక దీని ధర రూ.2.71 లక్షల నుంచి రూ.4.37 లక్షల మధ్య ఉంది. 3-సిలిండర్‌ ఇంజిన్‌తో వస్తున్న ఈ కారు 54 హెచ్‌పీ శక్తిని, 72 ఎన్‌ఎం టార్క్‌ని విడుదల చేస్తుంది.


మారుతీ సుజుకీ ఆల్టో

భారత మార్కెట్లో అత్యంత ఆదరణ కలిగిన కార్లలో ఆల్టో ఒకటి. దీని ప్రారంభ ధర రూ.2.99 లక్షలుగా ఉంది. దీంట్లో టాప్‌ వేరియంట్‌ ధర రూ.4.48 లక్షలు. 1.0 లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌తో అందుబాటులో ఉన్న ఈ కారు లీటరుకి 22.05 కి.మీ మైలేజీనిస్తుంది.


రెనో క్విడ్‌

ఇక బడ్జెట్‌లో మంచి మైలేజ్‌ ఇచ్చే మరో కారు రెనో క్విడ్‌. మారుతీ సుజుకీ ఆల్టోకి పోటీగా వచ్చిన ఈ కారు లీటర్‌ పెట్రోల్‌తో అత్యధికంగా 22 కి.మీ దూరం ప్రయాణిస్తుంది. 1.0 లీటర్‌ 3-సిలిండర్‌ ఇంజిన్‌ కలిగిన ఈ కారు ధర వేరియంట్‌ను బట్టి రూ.3.12 లక్షల నుంచి రూ.5.31 లక్షల మధ్య ఉంది.


మారుతీ సుజుకీ వేగనార్‌

వేగనార్‌ను మారుతీ సుజుకీ రెండు రకాల ఇంజిన్లతో విక్రయిస్తోంది.1.0 లీటర్‌ 3-సిలిండర్‌ ఇంజిన్‌తో వస్తున్న ఈ కారు  లీటరుకి 21.79 కి.మీ దూరం ప్రయాణిస్తుంది. ఇక  1.2 లీటర్‌ 4-సిలిండర్‌ ఇంజిన్ కారు‌ లీటర్‌ పెట్రోల్‌కు 20.52 కి.మీ వెళుతుంది. వేరియంట్‌ను బట్టి ధర రూ.4.65 లక్షల నుంచి రూ.6.18 లక్షల వరకు ఉంది.


మారుతీ సుజుకీ ఎస్‌-ప్రెసో

మారుతీలో మంచి ఇంధన సామర్థ్యం కలిగిన మరో కారు ఎస్‌-ప్రెసో. 1.0 లీటర్‌, 3 సిలిండర్ కలిగిన ఈ కారు ఇంజిన్‌ 21.7 కి.మీ, 5 స్పీడ్‌ మాన్యువల్‌ గేర్‌బాక్స్‌తో వచ్చే కారు 21.4 కి.మీ మైలేజీనిస్తుంది. దీని ధర 3.70 లక్షల నుంచి రూ.4.53 మధ్య ఉంది.


హ్యుందాయ్‌ గ్రాండ్‌ ఐ10 నియోస్‌

ఇక ఈ జాబితాలోకి వచ్చే ఒక హ్యుందాయ్‌ కారు గ్రాండ్‌ ఐ10 నియోస్‌. ఇది 1.0 లీటర్‌, 1.2 లీటర్‌.. రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. 1.2 లీటర్‌ ఇంజిన్‌తో వచ్చే వేరియంట్‌ లీటరుకి 20.7 కి.మీ మైలేజీనిస్తుంది. ఇక దీని ధర రూ.5.19 లక్షల నుంచి రూ.8.40 లక్షల మధ్య ఉంది.


మారుతీ సుజుకీ సెలెరియో

లీటరుకి 21.63 కి.మీ దూరం ప్రయాణించ గల సామర్థ్యం ఉన్న మరో మారుతీ కారు సెలెరియో. దీని ప్రారంభ ధర శ్రేణి రూ.4.53-5.78 లక్షల మధ్య ఉంది. వేగనార్‌లో అమర్చిన ఇంజిన్నే దీనికీ అమర్చారు. శక్తి, టార్క్‌ విషయంలోనూ ఒకే రకమైన సామర్థ్యాన్ని కలిగి ఉంది.


హోండా అమేజ్‌

ఈ జాబితాలోకి వచ్చే హోండా కారు అమేజ్‌. దీని ధర శ్రేణి రూ.6.22 లక్షల నుంచి రూ.9.99 లక్షల వరకు ఉంది. వేరియంట్‌ను బట్టి 1199 సీసీ నుంచి 1498 సీసీ సామర్థ్యంతో 98.63 బీహెచ్‌పీ శక్తిని విడుదల చేయగల ఇంజిన్‌ ఉన్న ఈ కారు అత్యధికంగా లీటర్‌ పెట్రోల్‌కు 24.7 కి.మీ మైలేజ్‌ ఇస్తుంది.


టాటా టియాగో

టాటాలో తక్కువ ధరలో మంచి మైలేజ్‌ ఇచ్చే కార్లలో టాటా టియాగో ముందుంటుంది. దీని ప్రారంభ ధర రూ.4.85 లక్షలు. 1199 సీసీ సామర్థ్యం ఇంజిన్‌ గల ఈ కారు గరిష్ఠంగా లీటర్‌కు 23.84 కి.మీ ప్రయాణిస్తుంది. 6000 ఆర్‌పీఎం వద్ద 84.48 బీహెచ్‌పీ శక్తిని విడుదల చేస్తుంది.


ఫోర్డ్‌ ఆస్పైర్‌

ఇక ఫోర్డ్‌లో రూ.10లక్షల లోపు మంచి మైలేజ్ ఇచ్చే కారు ఫోర్డ్‌ ఆస్పైర్‌. దీని ధర శ్రేణి రూ. 7.24 లక్షల నుంచి రూ.8.69 వరకు ఉంది. ఇది గరిష్ఠంగా లీటర్‌కు 18.5 కి.మీ మైలేజ్‌ ఇస్తుంది. 


- ఇంటర్నెట్‌ డెస్క్‌

ఇవీ చదవండి...

వాహన విక్రయాలు భేష్‌

బీఎండబ్ల్యూ నుంచి రూ.24లక్షల బైక్‌!

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని