అదానీకి షాక్‌.. గంటలో రూ.55వేల కోట్ల నష్టం - Adani Group stocks tumble amid reports of NSDL freezing 3 FPI accounts
close

Updated : 14/06/2021 13:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అదానీకి షాక్‌.. గంటలో రూ.55వేల కోట్ల నష్టం

ఎఫ్‌పీఐ ఖాతాలను స్తంభింపజేయడంతో షేర్ల పతనం

ముంబయి: ఆసియా అపర కుబేరుడు గౌతమ్‌ అదానీకి నేషనల్ సెక్యూరిటీస్‌ డిపాజిటరీ లిమిటెడ్‌(ఎన్‌ఎస్‌డీఎల్‌) షాకిచ్చింది. అదానీ గ్రూప్‌ కంపెనీల్లో భారీ పెట్టుబడులు పెట్టిన మూడు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల ఖాతాలను స్తంభింపజేసింది. ఈ మేరకు ఎకనమిక్‌ టైమ్స్‌ కథనం వెల్లడించింది. ఈ వార్తలతో నేటి స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో అదానీ గ్రూప్‌ షేర్లు కుప్పకూలాయి. కేవలం గంట వ్యవధిలోనే షేర్లన్నీ ‘లోయర్‌ సర్క్యూట్‌’ను తాకాయి. దీంతో అదానీ నికర సంపద 7.6 బిలియన్‌ డాలర్ల(దాదాపు రూ.55వేల కోట్లు) మేర ఆవిరైపోయింది. 

ఎన్‌ఎస్‌డీఎల్‌ స్తంభింపజేసిన అల్బులా ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌, క్రెస్టా ఫండ్‌, ఏపీఎంఎస్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌లకు.. అదానీ గ్రూప్‌కు చెందిన నాలుగు కంపెనీల్లో రూ.43,500 కోట్ల విలువైన షేర్లు ఉన్నాయి. అయితే మనీ లాండరింగ్‌ నివారణ చట్టం ప్రకారం.. ఈ ఖాతాల యాజమాన్యానికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించలేదు. దీంతో మే 31 లేదా అంతకంటే ముందే ఈ ఖాతాలను ఫ్రీజ్‌ చేసినట్లు ఎకనమిక్‌ టైమ్స్‌ కథనం వెల్లడించింది. ఖాతాలు స్తంభించడం వల్ల ఈ ఫండ్స్‌ పాత సెక్యూరిటీలని అమ్మడం లేదా కొత్త సెక్యూరిటీలను కొనుగోలు చేయడానికి అవకాశం ఉండదు.

నూతన మార్కెట్‌ నిబంధనల ప్రకారం.. ఎఫ్‌ఐపీల కస్టమర్ డాక్యుమెంటేషన్‌ను వెల్లడించడం తప్పనిసరి. అంటే ఫండ్‌ మేనేజర్స్‌, కామన్‌ ఓనర్‌షిప్‌ వంటి వివరాలను వెల్లడించాల్సి ఉంటుంది. లేదంటే వారి డీమ్యాట్‌ ఖాతాలను ఫ్రీజ్‌ చేస్తారు. అదానీ గ్రూప్‌ విషయంలోనూ అదే జరిగింది. ఆ వివరాలేవీ వెల్లడించకపోవడంతో మూడు ఎఫ్‌పీఐల ఖాతాలను నిలిపివేశారు.

అంతేగాక, సెబీ రిజిస్ట్రేషన్‌ ప్రకారం.. ఈ మూడు ఎఫ్‌పీఐ కంపెనీలకు మారిషస్‌లోని పోర్ట్‌లూయిస్‌కు చెందిన ఒకే అడ్రస్‌ ఉంది. వీటికి ప్రత్యేక వెబ్‌సైట్లు కూడా లేవు. అంటే డొల్ల కంపెనీలతో పెట్టుబడులు పెట్టి ఉంటారనే అనుమానాలు తలెత్తుతున్నాయి.  ఈ మూడు ఫండ్‌ కంపెనీలకు కలిపి అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో 6.82శాతం, అదానీ ట్రాన్స్‌మిషన్‌లో 8.03శాతం, అదానీ టోటల్‌ గ్యాస్‌లో 5.92శాతం, అదానీ గ్రీన్‌లో 3.58శాతం షేర్లు ఉన్నాయి. మరోవైపు గతేడాది అదానీ గ్రూప్‌ షేర్లు 200 నుంచి 1000శాతం మేర పెరిగాయి. దీనిపై సెబీ దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

ఈ వార్తల నేపథ్యంలో అదానీ గ్రూప్‌ షేర్లు అమాంతం పడిపోయాయి. స్టాక్ మార్కెట్లలో అదానీ గ్రూప్‌కు ఆరు షేర్లు లిస్టింగ్‌ అయి ఉండగా.. ఇవన్నీ కేవలం గంట వ్యవధిలోనే లోయర్‌ సర్క్యూట్‌ లెవల్‌ను తాకాయి. ఉదయం 10 గంటలకు అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ షేరు 25శాతం పతనమై రూ.1,201.10 కనిష్ఠ స్థాయిని తాకింది. అదానీ పోర్ట్స్‌, అదానీ గ్రీన్‌ ఎనర్జీ, అదానీ టోటల్‌ గ్యాస్‌, అదానీ పవర్‌, అదానీ ట్రాన్స్‌మిషన్‌ షేర్లు కూడా పతనమయ్యాయి. దీంతో వీటి ట్రేడింగ్‌ను కొంతసేపు నిలిపివేశారు. ఉదయం ట్రేడింగ్‌లో అదానీ నికర సంపద 7.6బిలియన్ డాలర్ల మేర తగ్గింది. ప్రస్తుతం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ షేరు విలువ 11.34శాతం నష్టంతో ట్రేడ్‌ అవుతోంది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని