చపాటా రకానికి భౌగోళిక గుర్తింపు సాధన లక్ష్యంగా పరిశోధనలు
ఈనాడు డిజిటల్, మహబూబాబాద్: చపాటా (టమాట) మిర్చి.. ఎక్కువ కారం లేకుండా కొంచెం తీపిగా ఉంటుంది. ఈ పంట సాగు ఉమ్మడి వరంగల్ జిల్లాకే ప్రత్యేకం. లోకల్ రకంగా పిలిచే ఈ మిర్చికి భౌగోళిక గుర్తింపు తీసుకువచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర మార్కెటింగ్‌శాఖ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా మల్యాలలోని జేవీఆర్ ఉద్యాన పరిశోధన స్థానం కృషి చేస్తోంది. పూర్తిస్థాయి వివరాలతో రెండు నెలల్లో భౌగోళిక గుర్తింపు(జీఐ) ఇండియాకు దరఖాస్తు చేయనున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొన్ని మండలాల్లో సుమారు 70 ఏళ్లుగా చపాటా మిర్చి సాగు చేస్తున్నారు. ప్రస్తుతం 5 వేల ఎకరాల్లో సాగవుతోందని అంచనా. ఎకరాకు 15-16 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది.
విదేశాలకు ఎగుమతి..
కాప్సంథిన్ అనే పదార్థం ఉండటంతో పాటు అధిక రంగు కలిగిన ఈ మిర్చిని థాయిలాండ్, మలేసియా, జపాన్, అమెరికా, ఇంగ్లాండ్ తదితర దేశాలకు, దేశీయంగా అహ్మదాబాద్, నాగ్‌పుర్, ముంబయి నగరాలకు ఎగుమతి చేస్తున్నారు. ఈ కారంతో చేసే నిల్వ పచ్చళ్లు చాలా రోజుల పాటు చెడిపోకుండా మంచి రంగుతో ఉంటాయి. నూనె ఉత్పత్తితో పాటు సహజ రంగులనూ తయారు చేస్తారు. ఈ రంగులను ఫుడ్ కలర్స్, లిప్‌స్టిక్, ఐస్‌క్రీమ్‌ల తయారీలో వినియోగిస్తుంటారు.
దేశంలోనే అరుదైన రకం..
‘‘వరంగల్ చపాటా మిర్చి దేశంలోనే అరుదైన రకం. ఇలాంటి లావుపాటి రకాలు అయిదారు మాత్రమే ఉన్నాయి. భౌగోళిక గుర్తింపు వస్తే రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది’’ అని శాస్త్రవేత్త కె.భాస్కర్ తెలిపారు.