ముద్రగడ మద్దతు కోరిన బీసీ సంఘాల నేతలు
కిర్లంపూడి, న్యూస్‌టుడే: రాష్ట్రంలో బీసీలు పెట్టే పార్టీకి మద్దతునిచ్చి అండగా నిలవాలని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంను బీసీ సంఘాల నాయకులు కోరారు. రాష్ట్రంలో 52 శాతంగా ఉన్న బీసీలు, 35 శాతం పైబడి ఉన్న కాపులు కలిసి ముందుకు నడిస్తే రాష్ట్రంలో రాజ్యాధికారం సాధ్యమని ఈ సందర్భంగా ఆ సంఘాల నాయకులు పేర్కొన్నారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశిన శంకర్రావు, 13 జిల్లాల బీసీ సంఘాల నాయకులు తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో గురువారం ముద్రగడను కలిశారు. మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో ఆయన నివాసానికి చేరుకుని సాయంత్రం 6.30 వరకూ ఆయనతో సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా ముద్రగడ స్పందిస్తూ.. పార్టీ పెట్టే యోచన ఉంటే ముందుగా అన్ని జిల్లాల్లోని బీసీ కులాలతో సమన్వయ సమావేశాలు ఏర్పాటుచేసి వారి ఆలోచన ఎలా ఉంది..? ఎంత వరకు కలిసి వస్తారు..? తదితర విషయాలను తెలుసుకోవాలని సూచించినట్లు సంఘం నాయకులు చెప్పారు. సమావేశం అనంతరం కేశిన శంకర్రావు విలేకర్లతో మాట్లాడుతూ.. రాష్ట్ర స్థాయిలో రాజకీయ మేధోమథన రాజకీయ సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. అందులో భాగంగా 13 జిల్లాల బీసీ సంఘాల నాయకులతో ముద్రగడను కలిసినట్లు చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీవర్గాల కలయిక రాష్ట్రంలో ప్రస్తుతం ఎంతో అవసరం ఉందన్నారు. భవిష్యత్తులో మాతో కలిసి నడుస్తానని ముద్రగడ హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. బీసీ సంక్షేమ సంఘం యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కమ్మర క్రాంతి కుమార్ మాట్లాడుతూ.. ఈ ఏడాదే బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పార్టీ పెడతామని ప్రకటించారు. బీసీ 96 సంఘాల సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాళ్ల సత్యనారాయణ, జంగమ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మారుతి నాగలింగం, వివిధ జిల్లాల నుంచి వచ్చిన బీసీ సంఘాల నాయకులు గురసా రంగనాథ్, వర్తనపల్లి కాశీ, కాకు మల్లికార్జునరావు, మట్టపర్తి సూర్యచంద్ర, కొల్లికొండ సుబ్రమణ్యం, పెంటకోట శ్రీరాములు, తదితరులు పాల్గొన్నారు.