ఆదివారం, ఏప్రిల్ 05, 2020
సమీప సంచారంతో వేగంగా వ్యాప్తి

కొవిడ్‌-19పై సిమ్యులేటర్‌ రూపొందించిన ట్రిపుల్‌ ఐటీ ఆచార్యుడు

ఈనాడు, హైదరాబాద్‌: దూర ప్రాంతాలకు ప్రయాణించే సమయంలో కంటే, సమీప ప్రాంతాల్లో సంచరించడం ద్వారా కరోనా (కొవిడ్‌-19) వైరస్‌ అధికంగా వ్యాప్తి చెందుతుందని ట్రిపుల్‌ ఐటీ ఆచార్యుడి పరిశోధనలో వెలుగు చూసింది. దీన్ని గుర్తించేందుకు హైదరాబాద్‌ ట్రిపుల్‌ ఐటీలోని డేటా సైన్సెస్‌ అండ్‌ అనలైటిక్స్‌ సెంటర్‌ ఆచార్యుడు విక్రమ్‌ పూడి ప్రత్యేకంగా ‘వైరస్‌ వ్యాప్తి సిమ్యులేటర్‌’ను అభివృద్ధి చేశారు. ప్రపంచంలోని వివిధ దేశాల్లో వేర్వేరు దేశాల జనాభా సంచారంపై అధ్యయనం చేసి, ఈ విషయం గుర్తించారు. వేర్వేరు దేశాలకు వెళ్లడం, మరణాల సంభావ్యత, వైరస్‌ వ్యాప్తి, వ్యాప్తి చెందే దూరం, సమయంపై పరిశోధన చేశారు. తద్వారా వైరస్‌ ఏ విధంగా, ఎంత వేగంగా వ్యాప్తి చెందుతుందో తెలుసుకునే వీలు కలిగింది. దూర ప్రయాణాల కంటే అనుమానిత వ్యక్తి నివాసముండే ప్రాంతాల్లోనే ఎక్కువగా వైరస్‌ వ్యాప్తి జరుగుతోందని సిమ్యులేటర్‌ ద్వారా తెలిసింది. ఎక్కువగా సంచారం లేకుండా ఇంటికే పరిమితం కావడం ద్వారా వైరస్‌ వ్యాప్తి వేగం కావడం లేదని గుర్తించారు. ‘జనాభా ఎక్కువగా ఉంటే వైరస్‌ వ్యాప్తి వేగంగా జరుగుతోంది. ఒక వ్యక్తి ఎంతగా బయట తిరుగుతాడనే విషయంలో వ్యాధి సోకే అవకాశం ఆధారపడి ఉంది. ఒకే ప్రాంతంలో ఉండటం ఎంతో ముఖ్యం. మనం ఇంటికే పరిమితం కావడం అవసరం’ అని విక్రమ్‌ పూడి తెలిపారు. అన్ని అండ్రాయిడ్‌ ఫోన్లలో ఈ సిమ్యులేటర్‌ పనిచేస్తుందని, హిందీ, ఇంగ్లిషు, తెలుగులో అందుబాటులో ఉందన్నారు.