డీజీపీ కార్యాలయానికి రాకుండా అరెస్టులు
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా?
సోము వీర్రాజు ఆగ్రహం
రథయాత్రను నిర్వహించి తీరుతామని స్పష్టీకరణ
ఈనాడు- అమరావతి, న్యూస్‌టుడే- తాడేపల్లి, మంగళగిరి రూరల్: రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై జరిగిన విధ్వంసాల కేసుల్లో భాజపా కార్యకర్తల ప్రమేయం ఉందని డీజీపీ గౌతమ్ సవాంగ్ చేసిన వ్యాఖ్యలపై ఆయన్ను కలిసి మాట్లాడదామని ప్రయత్నించిన భాజపా నేతలను పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. గుంటూరు-విజయవాడ మార్గంలో ప్రత్యేక నిఘా పెట్టారు. తెల్లవారుజాము నుంచే నేతలను గృహ నిర్బంధం చేశారు. తాడేపల్లిలో సోము వీర్రాజును, గుంటూరులో కన్నా లక్ష్మీనారాయణను ఇంట్లో నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు. సోము వీర్రాజును గృహ నిర్బంధం చేయడంతో పార్టీ నేతలు విష్ణువర్ధన్‌రెడ్డి, సీఎం రమేష్ ఆయన నివాసానికి చేరుకున్నారు. అంతకుముందు విజయవాడ విమానాశ్రయంలో ఎంపీ సీఎం రమేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని భాజపా రాష్ట్ర కార్యాలయానికి తరలించారు. పార్టీ నాయకులు పాతూరి నాగభూషణం, సాధినేని యామిని తదితరులను పోలీసులు స్టేషన్‌కు తరలించి తర్వాత విడిచిపెట్టారు. విజయవాడ నుంచి ఎమ్మెల్సీ మాధవ్‌తో పాటు పలువురు కార్యకర్తలు పోలీసుల కళ్లు గప్పి డీజీపీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. పోలీసులు మాధవ్‌ను కార్యాలయం వెలుపలే అరెస్టు చేసి మంగళగిరి స్టేషన్‌కు తరలించారు. రాత్రి 9 గంటల తర్వాత సోము వీర్రాజు తదితరులు వెళ్లి పట్టుబట్టడంతో ఆయన్ను విడుదల చేశారు. తమను డీజీపీ కార్యాలయం వద్దకు ఎందుకు వెళ్లనీయడం లేదని పోలీసులపై సోము వీర్రాజు అసహనం వ్యక్తం చేశారు. ‘డీజీపీతో మాట్లాడటానికి ఆయన కార్యాలయానికి వెళ్లాలని నిర్ణయించాం. ధర్నా, ఆందోళనలకు పిలుపునివ్వలేదు. అయినా పోలీసులు మా ఇళ్లవద్దకు చేరుకుని అడ్డుకోవడమేంటి?’ అని మండిపడ్డారు. రాష్ట్రంలో ఉంది ప్రజాస్వామ్యమా? లేక ఎమర్జెన్సీనా? దీనికి ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండు చేశారు. ‘రాజమండ్రి, శ్రీకాకుళం ఘటనల్లో మా కార్యకర్తల ప్రమేయం లేదు. ఆ ప్రకటనపై డీజీపీ వివరణ ఇవ్వాల్సిందే. రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఫిబ్రవరి 4న యాత్రను నిర్వహిస్తాం’ అని స్పష్టం చేశారు. ప్రభుత్వ అండదండలతోనే రాష్ట్రంలో విగ్రహాల ధ్వంసాలు చోటు చేసుకుంటున్నాయని భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు.
పార్లమెంటులో చర్చిస్తాం: సీఎం రమేశ్
ఏపీలో నియంతృత్వ పాలన కొనసాగుతోందని భాజపా నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ ఆరోపించారు. రాష్ట్రంలో దేవుళ్ల విగ్రహాల ధ్వంసం ఘటనల్లో భాజపా కార్యకర్తల ప్రమేయం ఉందన్న డీజీపీ ప్రకటనపై పార్లమెంటులో సభాహక్కుల ఉల్లంఘన తీర్మానం (ప్రివిలేజ్ మోషన్) ప్రవేశపెడతామని తెలిపారు.