రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు
ఈనాడు, అమరావతి: తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కె.కళా వెంకటరావుపై పోలీసులు అక్రమంగా కేసుపెట్టి, అదుపులోకి తీసుకున్నారంటూ తెదేపా శ్రేణులు బుధవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు, ధర్నాలు చేశాయి. మహాత్మాగాంధీ, అంబేడ్కర్ విగ్రహాలకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాలాభిషేకాలు నిర్వహించి, వినతిపత్రాలు అందజేశారు. పార్టీ అధినేత చంద్రబాబు పిలుపు మేరకు రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోనూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరిగాయని తెదేపా ఒక ప్రకటనలో పేర్కొంది. ‘తెదేపా నాయకులు జగన్‌రెడ్డి ఉన్మాద పాలనపై ధ్వజమెత్తారు. రాష్ట్రంలో బీసీ నాయకత్వాన్ని అణచివేసేందుకు వైకాపా సాగిస్తున్న కుట్రలను బీసీలంతా ఏకమై తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. దేవాలయాలపై దాడుల్ని, దేవుళ్ల విగ్రహాల ధ్వంసాన్ని ఖండించారు. తెదేపా నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టడంపై మండిపడ్డారు’ అని ఆ ప్రకటనలో తెదేపా తెలిపింది. విశాఖపట్నంలో జీవీఎంసీ కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద వెలగపూడి రామకృష్ణబాబు, పల్లా శ్రీనివాసరావు, మచిలీపట్నం బస్టాండ్ సెంటరులోని ఎన్టీఆర్ విగ్రహంవద్ద కొల్లు రవీంద్ర, మైలవరంలోని గాంధీ విగ్రహం వద్ద దేవినేని ఉమామహేశ్వరరావు, రాజమండ్రిలో గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ఆదిరెడ్డి అప్పారావు, గన్నికృష్ణ తదితరులు, ఒంగోలులో దామచర్ల జనార్థన్, గిద్దలూరులో అశోక్‌రెడ్డి, గోపాలపురంలో ముప్పిడి వెంకటేశ్వరరావు తదితరుల ఆధ్వర్యంలో నిరసనలు జరిగినట్లు తెలిపింది.
శ్రీకాకుళం జిల్లాలో..
ఈనాడు డిజిటల్, శ్రీకాకుళం: కళా వెంకటరావును పోలీసులు బుధవారం రాత్రి అదుపులోకి తీసుకోవడంపై శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు భగ్గుమన్నాయి. ఎంతో సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్న ఆయనపై ఈ ప్రతీకార చర్యలేంటని ప్రశ్నిస్తూ జిల్లాకు చెందిన తెదేపా ముఖ్య నేతలు, కార్యకర్తలు గురువారం నిరసనలు చేశారు. పలుచోట్ల కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు. రామతీర్థం ఘటనలో తప్పు చేసిన వారిని పట్టుకోలేని పోలీసులు ఆ తప్పును నిలదీసిన వారిపై కేసులు బనాయించడాన్ని తప్పుబట్టారు. పోలీసుల అదుపులో నుంచి విడుదలైన కళా వెంకటరావును కలవడానికి స్వగ్రామం నుంచి బయలుదేరిన ఇచ్ఛాపురం శాసనసభ్యులు బెందాళం అశోక్‌ను స్థానిక పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. ఇదే అణచివేత ధోరణిని కొనసాగిస్తే మరింత ఉద్యమిస్తామని తెదేపా నేతలు స్పష్టం చేశారు.