గురువారం, ఆగస్టు 06, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

ప్రధానాంశాలు

రాష్ట్రంలో పడిపోయిన వృద్ధి రేటు

వైకాపా చేతగాని పాలనతో  పెరిగిన పేదరికం: యనమల

ఈనాడు, ఈనాడు డిజిటల్‌ - అమరావతి: వైకాపా చేతగాని పాలనవల్లే రాష్ట్రంలో పేదరికం, అసమానతలు పెరిగాయని శాసన మండలిలో ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. తెదేపా హయాంలోని రెండంకెల వృద్ధి రేటు.. ప్రస్తుతం ఒక అంకె (సింగిల్‌ డిజిట్‌)కు పడిపోయిందని విమర్శించారు. ద్రవ్యోల్బణం 6.5 శాతానికి చేరడంతో.. బలహీనవర్గాల కొనుగోలు శక్తి నశించిందని ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ‘మానవాభివృద్ధి సూచీల్లోనూ ఆంధ్రప్రదేశ్‌ 27వ స్థానానికి దిగజారింది. తలసరి ఆదాయం క్షీణించింది. చదువుకున్న యువతలో నిరుద్యోగిత 23 శాతానికి పెరిగిపోయింది. పరిశ్రమలు పెడతామని వచ్చిన కంపెనీలను వైకాపా నేతలు బెదిరించి తరిమేయడంతో వేలాది ఉద్యోగాలు పోయాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల సంక్షేమానికి 2018-19లో తెదేపా ప్రభుత్వం రూ.6,149 కోట్లు వ్యయం చేస్తే.. వైకాపా సర్కారు 2019-20లో రూ.3,382 కోట్లకు తగ్గించింది. సంక్షేమ పథకాల రద్దుతో గత 14 నెలల్లో పేదలకు అందాల్సిన రూ.18,026 కోట్లను దూరం చేశారు. జగన్‌ పథకాలన్నీ మాయపేలాలే. నవశకం పేరుతో 18 లక్షల రేషన్‌ కార్డులు, 6 లక్షల పింఛన్లు తొలగించారు. ఎన్టీఆర్‌ వైద్యసేవ, సీఎంఆర్‌ఎఫ్‌ లబ్ధిని పేదలకు దూరం చేశారు’ అని మండిపడ్డారు.

3 లక్షల ఉద్యోగాలను తొలగించారు: కళా
‘ఏటా జనవరిలో ఉద్యోగాల క్యాలెండర్‌ ప్రకటిస్తామని అధికారంలోకి వచ్చిన జగన్‌ ఏడాదిలోనే 3 లక్షల ఉద్యోగాలను తొలగించారు. ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగాలనూ తొలగించే కుట్ర జరుగుతోంది.  ఎంబీఏ, బీటెక్‌ చేసిన వాళ్లని మద్యం దుకాణాల్లో బేరర్లుగా మార్చారు. అధికారంలోకి వస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని జగన్‌ హామీ ఇచ్చారు.  ఇప్పటివరకు 10సార్లు దిల్లీ వెళ్లారు. ఎన్నిసార్లు కేంద్రం మెడలు వంచారు?’ అని తెదేపా ఏపీ అధ్యక్షుడు    కళా వెంకట్రావు నిలదీశారు.

లోపాలను ఎత్తిచూపితే కేసులు: చినరాజప్ప
‘ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపే వారిపై వైకాపా నేతలు తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు. సామాన్య ప్రజల నుంచి తెదేపా కార్యకర్తలు, ప్రభుత్వ ఉద్యోగుల వరకు అందరిపైనా దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. వైకాపా అధికారంలోకి వచ్చిన 13 నెలల్లో 800 మంది తెదేపా కార్యకర్తలపై దాడులు చేశారు. 11 మందిని హత్య చేశారు. పేదలను బెదిరించి భూములు లాక్కుంటున్నారు’ అని మాజీ మంత్రి చినరాజప్ప విమర్శించారు.

పెద్ద జిల్లాలను విభజిస్తే చాలు: సోమిరెడ్డి
ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గాన్ని ఓ జిల్లాగా చేస్తామనడంలో న్యాయం లేదని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. ‘నెల్లూరు పార్లమెంట్‌ నియోజకవర్గాన్ని జిల్లా చేస్తే, కృష్ణపట్నం పోర్ట్‌, షార్‌, శ్రీసిటీ వంటివి అన్నీ తిరుపతి పరిధిలోకి వెళతాయి. అప్పుడు నెల్లూరు జిల్లా ప్రాముఖ్యత కోల్పోతుంది. శ్రీకాకుళం జిల్లాను రెండుగా చేయొద్దని వైకాపా    సీనియర్‌ నేత ధర్మాన ప్రసాదరావు కూడా డిమాండ్‌ చేశారు.. శ్రీకాకుళం, విజయనగరం, నెల్లూరు, కడప వంటి జిల్లాలను విభజించాల్సిన అవసరం లేదు.  అనంతపురం, చిత్తూరు, కృష్ణా, గుంటూరు, విశాఖ, ఉభయ గోదావరి వంటి జిల్లాలను విభజిస్తే ప్రజలకు సౌలభ్యంగా ఉంటుంది...’ అని పేర్కొన్నారు.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని