ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల్లో క్రమంగా పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. జనవరి 26 తర్వాత తొలిసారిగా 133 కేసులు నమోదయ్యాయి. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి బుధవారం ఉదయం 9 గంటల మధ్య 36,980 నమూనాలను పరీక్షించారు. వీటి ద్వారా 0.36% మందికి వైరస్ సోకినట్లు తేలింది. గరిష్ఠంగా చిత్తూరు జిల్లాలో 31 కేసులు రికార్డయ్యాయి. విశాఖ జిల్లాలో 23 నమోదవడంతో వైరస్ వ్యాప్తి క్రమేణా పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. కృష్ణా, అనంతపురం, శ్రీకాకుళం, కర్నూలు జిల్లాల్లో 10 నుంచి 15 మధ్య నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో ఒకరు మరణించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తంమ్మీద 1,40,47,1674 నమూనాలు పరీక్షించారు. 8,90,215 మందికి వైరస్ సోకింది. 8,82,219 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 826 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 7,170 మంది ప్రాణాలు విడిచారు.