ఎస్‌ఈసీ ప్రయత్నాలు ప్రశంసనీయం
చట్టం చెబుతున్నందునే మధ్యంతర ఉత్తర్వులిస్తున్నాం: హైకోర్టు
ఈనాడు, అమరావతి: పురపాలక ఎన్నికల్లో 14 డివిజన్లు, వార్డుల్లో మళ్లీ నామినేషన్ దాఖలుకు వీలు కల్పిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఈనెల 1న ఇచ్చిన ఉత్తర్వుల అమలును హైకోర్టు నిలుపుదల చేసింది. నామినేషన్ల అడ్డగింతలు, బలవంతపు ఉపసంహరణ విషయంలో ఫిర్యాదులు స్వీకరించాలని కలెక్టర్లకు గత నెల 16న ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్ చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులు బుధవారం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. ‘నామినేషన్ల దాఖలు దశ నుంచి ఫలితాల వెల్లడి వరకు వచ్చే ఫిర్యాదులను ఎస్‌ఈసీ పరిగణనలోకి తీసుకోవడానికి వీల్లేదని చట్టం, నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల్లో అక్రమాలు, మోసం, వంచన చోటుచేసుకుంటే ప్రత్యామ్నాయ మార్గంగా ‘ఎన్నికల పిటిషన్’ వేసుకోవాలి. నామినేషన్ వేయడానికి అడ్డంకులు ఎదుర్కొన్న అభ్యర్థులు ట్రైబ్యునళ్లనే ఆశ్రయించాలి. ఈ నేపథ్యంలో మళ్లీ నామినేషన్ దాఖలుకు ఎస్‌ఈసీ ఉత్తర్వులు ఇవ్వడానికి వీల్లేదని కోర్టు అభిప్రాయపడుతోంది. స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా ఎన్నికల నిర్వహణకు ఎస్‌ఈసీ చేస్తున్న ప్రయత్నాలు ప్రశంసించదగినవి అయినా చట్టం పిటిషనర్లకు అనుకూలంగా ఉంది. ఎస్‌ఈసీ చర్యలు సమాజం మంచి కోసమే అయినా చట్టం నిర్దేశిస్తున్నందు వల్ల న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంది. ఎస్‌ఈసీ ఉత్తర్వుల అమలును నిలుపుదల చేస్తున్నాం’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు.
వాలంటీర్లను ఎన్నికలకు దూరం పెట్టడంపై స్టే
వార్డు వాలంటీర్లను మున్సిపల్ ఎన్నికలకు దూరంగా ఉంచాలంటూ ఎస్‌ఈసీ ఫిబ్రవరి 28న ఇచ్చిన ఉత్తర్వుల అమలును హైకోర్టు నిలుపుదల చేసింది. న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులు బుధవారం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. ఎస్‌ఈసీ ఉత్తర్వులపై గ్రామ, వార్డు వాలంటీర్ గ్రామ, వార్డు సచివాలయం శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.అజయ్‌జైన్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. మంగళవారం విచారణ జరిపిన న్యాయమూర్తి బుధవారం నిర్ణయాన్ని వెల్లడించారు. ‘మొబైల్ ఫోన్లు ఉన్నా, లేకపోయినా ఆధునిక కాలంలో సమాచారం లభ్యమవుతోంది. ఫోన్ లేకపోయినా వాలంటీర్లు బెదిరించగలరని కోర్టు ప్రాథమికంగా అభిప్రాయపడుతోంది. వృద్ధాప్య పింఛన్లే నేరుగా లబ్ధిదారులకు ఇస్తున్నారు. మిగిలిన పథకాల సొమ్మును ఖాతాలో జమచేస్తున్నారు. వాలంటీర్ల విధినిర్వహణకు అనుమతించాలని కోర్టు అభిప్రాయపడుతోంది. ప్రయోజనాలను నిలిపేస్తామంటూ ఓటర్లను బెదిరిస్తే ఎస్‌ఈసీ చర్యలు తీసుకోవచ్చు. ఫిర్యాదుల స్వీకరణకు కాల్ సెంటర్లను ఏర్పాటు చేయవచ్చు. ఫలానా నిబంధనల ప్రకారం ఫిర్యాదు చేయవచ్చని ఎస్‌ఈసీ విస్తృత ప్రచారం కల్పించొచ్చు. ఈ నేపథ్యంలో ఎస్‌ఈసీ ఫిబ్రవరి 28న ఇచ్చిన ఉత్తర్వుల అమలును నిలుపుదల చేస్తున్నాం’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఇదే విషయంలో విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాల్లో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాల్సిన అవసరం లేదని న్యాయమూర్తి పేర్కొన్నారు.