టీకా వేసే సమయ పరిమితి ఎత్తివేత
కేంద్ర మంత్రి హర్షవర్ధన్ వెల్లడి
ఈనాడు, దిల్లీ: కరోనా టీకా కోసం దేశవ్యాప్తంగా ఆసుపత్రుల్లో 60 ఏళ్లపైబడిన వృద్ధుల రద్దీ పెరగడంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా టీకా వేసే సమయ పరిమితిని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. ఇక నుంచి ప్రజలు 24 గంటల్లో ఎప్పుడైనా కొవిడ్ టీకా తీసుకునేందుకు వీలు కల్పిస్తున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసేందుకే టీకా పంపిణీ సమయంపై ఉన్న ఆంక్షలను తొలగించినట్లు చెప్పారు. ఎక్కువ మందికి టీకా అందించడమే దీని ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ప్రజలు వారికి అనువైన సమయంలో 24×7 ఎప్పుడైనా టీకా తీసుకోవచ్చని వెల్లడించారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపపత్రులు ఏ సమయంలోనైనా టీకా పంపిణీ చేయవచ్చని తెలిపారు. ‘‘ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజల ఆరోగ్యంతోపాటు, వారి సమయ విలువనూ బాగా అర్థం చేసుకుంటారు’’ అని ఈ సందర్భంగా హర్షవర్ధన్ ట్విటర్ ద్వారా పేర్కొన్నారు.
టీకా వేయించుకున్న రాష్ట్రపతి
దేశవ్యాప్తంగా కొనసాగుతున్న రెండో విడత కరోనా వ్యాక్సినేషన్‌లో భాగంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ టీకా తొలి డోసు తీసుకున్నారు. బుధవారం దిల్లీలోని ఆర్మీ రిసెర్చ్ అండ్ రిఫరల్ ఆసుపత్రిలో రాష్ట్రపతి టీకా వేయించుకున్నారు. రాష్ట్రపతి వెంట ఆయన కుమార్తె కూడా ఉన్నారు. ఆ చిత్రాలను రాష్ట్రపతి ట్విటర్ హ్యాండిల్‌లో పోస్ట్ చేశారు. చరిత్రలో అతిపెద్ద టీకా పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా చేపడుతున్న వైద్యులు, నర్సులు, వైద్య సిబ్బందికి రామ్‌నాథ్ కోవింద్ అభినందనలు తెలిపారు. అర్హులైన పౌరులందరూ తప్పనిసరిగా టీకా వేయించుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.
కేరళ, గోవా సీఎంలు కూడా..
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, గోవా సీఎం ప్రమోద్ సావంత్‌లు బుధవారం కొవిడ్ టీకా వేయించుకున్నారు. అదేవిధంగా కేంద్రమంత్రి హర్‌దీప్ సింగ్ పూరీ దంపతులు దిల్లీలో కొవిడ్-19 టీకా తొలి డోసు తీసుకున్నారు.