మయన్మార్‌లో నిరసనకారులపై పోలీసుల తూటాల వర్షం
మరో 33 మంది దుర్మరణం
యాంగూన్: మయన్మార్‌లో సైనిక పాలనకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు బుధవారం మరోసారి రక్తసిక్తమయ్యాయి! భద్రతా బలగాల తూటాల ధాటికి మొత్తం 33 మంది ఉద్యమకారులు మృతిచెందినట్టు స్థానిక వార్తా సంస్థలు వెల్లడించాయి. ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని పునరుద్ధరించాలంటూ రోడ్లెక్కి నినదిస్తున్న వారిపై పోలీసులు రబ్బరు బుల్లెట్లు, బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. కొన్నిచోట్ల మందుగుండుతో కూడిన ఆయుధాలను ఉపయోగించారు. బుధవారం ఉదయం మైంగియాన్‌లో 14 ఏళ్ల బాలుడిని పోలీసులు కాల్చి చంపినట్టు సామాజిక మాధ్యమాల్లో వార్తలు వచ్చాయి. కొద్దిసేపటికే మరో ఉద్యమకారుడు చనిపోయాడు. ఈ క్రమంలోనే వివిధ ప్రాంతాల్లో ఆందోళనలు ఉద్ధృతమయ్యాయి. దీంతో నిరసనకారులపై పోలీసులు కాల్పులు జరిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను కొందరు ఎప్పటికప్పుడు ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. ఏ ఉద్యమకారుడు, ఎప్పుడు, ఎక్కడ, ఎలా చనిపోయాడన్నది అందులో వివరంగా పేర్కొన్నారు. భద్రతా బలగాల కాల్పుల్లో మొత్తం 33 మంది ఉద్యమకారులు మృతిచెందినట్టు పలు వార్తా సంస్థలు లెక్క తేల్చాయి. గత నెలలో దేశాధ్యక్ష స్థానం నుంచి ఆంగ్ సాన్ సూకీని సైన్యం పదవీచ్యుతురాలిని చేసినప్పటి నుంచి... ప్రజాస్వామ్యవాదులు ఆందోళనలు చేపడుతూనే ఉన్నారు.
బ్రిటన్ ఒత్తిడితో ప్రత్యేక సమావేశం...
ఆదివారం నాటి పోలీసుల కాల్పుల్లో 18 మంది నిరసనకారులు మృతిచెందిన నేపథ్యంలో... మయన్మార్ సంక్షోభంపై వెంటనే చర్చించాలని ఐరాస భద్రతా మండలిపై బ్రిటన్ ప్రభుత్వం ఒత్తిడి తెచ్చింది. దీంతో శుక్రవారం మండలి సమావేశం కానున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
* హింసకు ముగింపు పలకాలని, సమస్యను చర్చల ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని మయన్మార్ సైనిక ప్రభుత్వానికి ఆగ్నేయాసియా దేశాల సమాఖ్య సూచించింది.
* దేశంలో జరుగుతున్న పరిణామాలను వెలుగులోకి తెచ్చిన అసోసియేటెడ్ ప్రెస్ (ఏపీ) జర్నలిస్ట్ థెయిన్ ఝా, మరో ఐదుగురు పాత్రికేయులను మయన్మార్ అధికారులు అరెస్టు చేశారు. ప్రజా భద్రతా చట్టం ఉల్లంఘన కింద వారిపై అభియోగాలు నమోదు చేశారు.