టీకా ప్రక్రియనూ కొనసాగించండి
రెంటినీ విజయవంతం చేయండి
ఎన్నికలపై 37 పేజీల తీర్పు ఇచ్చిన హైకోర్టు
షెడ్యూలును నిలుపుదల చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల రద్దు
ఈనాడు - అమరావతి
ఎన్నికల షెడ్యూలు విడుదల చేయడం ద్వారా రాజ్యాంగం నిర్దేశించిన బాధ్యతను నెరవేర్చడంతో పాటు, రెండున్నరేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పంచాయతీ ఎన్నికలకు ఎస్‌ఈసీ తన అధికారాన్ని వినియోగించారు. ఈ క్రమంలో ఆయన దురుద్దేశంతో వ్యవహరిస్తే.. ఆ విషయాన్ని తగిన సాక్ష్యాలతో కోర్టుకు వివరించాలి. కానీ ప్రభుత్వం అలా చెప్పలేకపోయింది.
- హైకోర్టు ధర్మాసనం
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు మార్గం సుగమం చేస్తూ హైకోర్టు ధర్మాసనం కీలక తీర్పు ఇచ్చింది. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ఇచ్చిన షెడ్యూలును సస్పెండ్ చేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను రద్దుచేసింది. ఎన్నికలు నిర్వహించాలని స్పష్టం చేసింది. ఎన్నికలు, కరోనా టీకా ప్రక్రియ రెండూ ప్రజలకు ప్రాధాన్యం ఉన్న కార్యక్రమాలని.. ఈ రెండింటినీ సజావుగా నిర్వహించి విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఎన్నికల షెడ్యూలును నిలుపుదల చేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు.. ఎన్నికల సంఘానికి రాజ్యాంగం ప్రసాదించిన హక్కులపై ప్రభావం చూపుతున్నాయని తేల్చిచెప్పింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి, జస్టిస్ సి.ప్రవీణ్ కుమార్‌తో కూడిన ధర్మాసనం గురువారం 37 పేజీల తీర్పు వెల్లడించింది.
అప్పీలుకు విచారణార్హత ఉంది
ఎస్‌ఈసీ దాఖలు చేసిన అప్పీలుకు విచారణార్హత లేదని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్(ఏజీ) శ్రీరామ్ చేసిన వాదనలను ధర్మాసనం తోసిపుచ్చింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులు కూడా తీర్పేనని, అప్పీలుకు విచారణ అర్హత ఉందని స్పష్టం చేసింది. లోతైన విచారణ జరపకుండా, ఇరుపక్షాల హక్కులు, బాధ్యతల్ని పరిగణనలోకి తీసుకోకుండా సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు తుది ఆదేశాల్లా ఉన్నాయని ఎస్‌ఈసీ తరఫు సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు చేసిన వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది. పంచాయతీ ఎన్నికల కాలపరిమితి ముగియడంతో కమిషనర్ తన చట్టబద్ధమైన అధికారాన్ని వినియోగించారని తేల్చి చెప్పింది. అధికార పార్టీ సీనియర్ నాయకుడు ఏప్రిల్, మే నెలల్లో ఎన్నికలు ఉంటాయని చెప్పిన విషయాన్ని పరిగణనలోకి తీసుకొని ఎన్నికల షెడ్యూలు ఇచ్చారంటూ ఏజీ చేసిన వాదనలను అంగీకరించలేమని తెలిపింది. కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించారని గుర్తుచేసింది. ఎన్నికల నిర్వహణను వివిధ హైకోర్టులు, సుప్రీంకోర్టు సమర్థించాయని తెలిపింది. టీకా కార్యక్రమం గురించి కమిషనర్ స్పష్టంగా చర్చించారని.. టీకా కార్యక్రమం విజయవంతం కావడంలో దిగువస్థాయి నాయకత్వం కీలకపాత్ర పోషిస్తుందని ఆయన తెలిపారని గుర్తుచేసింది.
సంప్రదింపుల ప్రక్రియ జరిగింది
‘ఎన్నికల కమిషనర్ ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ను పరిశీలిస్తే.. టీకా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం లేవనెత్తిన ప్రతి అంశాన్నీ కమిషనర్ పరిగణనలోకి తీసుకున్నట్లు స్పష్టం అవుతోంది. ప్రభుత్వ అభిప్రాయాలతో కమిషనర్ అంగీకరించి ఉండకపోవచ్చు. సంప్రదింపుల ప్రక్రియ మాత్రం జరిగింది. సింగిల్ జడ్జి పేర్కొన్నట్లు సంప్రదింపుల ప్రక్రియ జరగలేదని చెప్పలేం. ప్రభుత్వం సమర్పించిన ఏ వివరాల్ని పరిగణనలోకి తీసుకోవడంలో కమిషనర్ విఫలమయ్యారో సింగిల్ జడ్జి కారణాల్ని పేర్కొనలేదు. ఎన్నికలు నిర్వహించాలన్న ఎస్‌ఈసీ నిర్ణయం టీకా ప్రక్రియకు ఎలా అవరోధం కలిగిస్తుందో కూడా సింగిల్ జడ్జి వెల్లడించలేదు. ప్రభుత్వం సమర్పించిన అన్ని వివరాలూ పరిశీలించాకే ఎన్నికలు, టీకా ప్రక్రియ రెండు సమన్వయంతో నిర్వహించొచ్చని ఎస్‌ఈసీ నిర్ణయం తీసుకుంది’ అని ధర్మాసనం పేర్కొంది.
ఎన్నికలు నిలిచిపోకుండా న్యాయస్థానం రక్షణగా ఉండాలి
‘సుప్రీంకోర్టు తీర్పులను పరిశీలిస్తే.. ఎన్నికల ప్రక్రియ నిలిచిపోకుండా, జాప్యం జరగకుండా, అడ్డంకులు కలగకుండా న్యాయస్థానం రక్షణగా నిలవాలి. భారత ఎన్నికల సంఘానికి ఉన్న అధికారాలే.. రాష్ట్ర ఎన్నికల సంఘాలకూ ఉంటాయని ‘కిషన్‌సింగ్ తోమర్’ కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎస్‌ఈసీ స్వతంత్రంగా విధులు నిర్వర్తించొచ్చని పేర్కొంది. ఎన్నికల నిర్వహణ అధికారం పూర్తిగా ఎన్నికల సంఘానికి ఉంటుందని విస్పష్టంగా తెలిపింది. అంతేకాక అధికరణ 243(కె)(3) ప్రకారం రాష్ట్ర ఎన్నికల సంఘానికి స్వతంత్ర హోదా ఉంటుంది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని.. ఎన్నికల షెడ్యూలు విషయంలో ఎస్‌ఈసీ ఈనెల 8న ఇచ్చిన ఉత్తర్వులను సింగిల్ జడ్జి సస్పెండ్ చేయడం సరికాదని అభిప్రాయపడుతున్నాం. ఆ ఉత్తర్వులను రద్దు చేస్తున్నాం. ఎన్నికలు, టీకా కార్యక్రమాల్ని సజావుగా విజయవంతం చేయాలని ఆదేశిస్తున్నాం’ అని ధర్మాసనం తీర్పులో పేర్కొంది. ‘గతేడాది మార్చిలో స్థానిక ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చింది. కరోనా కారణంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీలు, నగర పంచాయతీ ఎన్నికలను నిలిపేస్తూ ఎస్‌ఈసీ 2020 మార్చి 15న ఉత్తర్వులిచ్చింది. కరోనా కారణంగా ప్రజారోగ్యానికి హానికరమనే అభిప్రాయంతో ఎన్నికలను వాయిదా వేసింది. దీనిపై రాష్ట్రప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఎస్‌ఈసీ నిర్ణయంలో జోక్యానికి సుప్రీం నిరాకరించింది. తర్వాత ఎన్నికలు నోటిఫై చేసేముందు రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించాలని ఎస్‌ఈసీని ఆదేశించింది’ అని ధర్మాసనం గుర్తుచేసింది. ఆ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో జనవరి 8న సంప్రదింపులు జరిపిన తర్వాతే ఎస్‌ఈసీ ఎన్నికల షెడ్యూలును విడుదల చేశారని తెలిపింది.
టీకా ప్రక్రియ ముగిసేవరకూ ఎన్నికలు ఆపడం సరికాదు
‘ఎన్నికల షెడ్యూలు ఉత్తర్వులను సింగిల్ జడ్జి సస్పెండ్ చేయడం నిబంధనలకు విరుద్ధం. ప్రభుత్వం సమర్పించిన వివరాలన్నింటినీ చూశాకే ఎస్‌ఈసీ ఎన్నికల షెడ్యూలు జారీచేసిన విషయాన్ని సింగిల్ జడ్జి పరిగణనలోకి తీసుకోలేదు. టీకా కార్యక్రమం ముగిసేవరకూ ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే ఎన్నికలను నిలువరించడం సరికాదు’ అని న్యాయమూర్తులు అన్నారు.