మొబైల్ వాహనాలను ప్రారంభించిన సీఎం జగన్
ఈనాడు, అమరావతి: ఇంటి వద్దకే రేషన్ బియ్యం సరఫరా చేసే మొబైల్ వాహనాలను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి గురువారం విజయవాడలో ప్రారంభించారు. అనంతరం కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాలకు 2,500 వాహనాలు ఏకకాలంలో బయల్దేరాయి. బియ్యం తీసుకెళ్లేందుకు తిరిగి ఉపయోగించగలిగే వీలున్న 10, 15 కిలోల సంచుల్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రదర్శించారు. తొలుత వేదిక వద్దకు వచ్చిన సీఎం.. మొబైల్ వాహనాలు, అందులోని ఏర్పాట్లను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. ప్రారంభం అనంతరం జగన్ వాహన డ్రైవర్లకు నమస్కరిస్తూ వేదికపైనే నిల్చున్నారు. పెద్ద ఎత్తున బారులు తీరిన వాహనాలు.. మహాత్మాగాంధీ రోడ్డు నుంచి బెంజిసర్కిల్ మీదుగా ప్రధాన రహదారి ఎక్కి తమ ప్రాంతాలకు సాగిపోయాయి. చివరి వాహనం రోడ్డెక్కడానికి సుమారు 35 నిమిషాలు పట్టింది. అంతసేపూ సీఎం చేతులు జోడించి నిల్చుని ఉన్నారు.
సైరన్ మోగించుకుంటూ..
రేషన్ బియ్యం పంపిణీ వాహనాలకు సైరన్లు బిగించారు. సీఎం ప్రారంభించిన అనంతరం వాటన్నింటి సైరన్లు ఒక్కసారిగా మోగించారు. అలా కార్యక్రమం ముగిసే వరకు శబ్ధం చేస్తూనే ఉన్నాయి. కార్యక్రమంలో మంత్రులు కొడాలి నాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పేర్ని నాని, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, వెలంపల్లి శ్రీనివాసరావు, పౌర సరఫరాలశాఖ కమిషనరు కోన శశిధర్, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
సీఎంను కలిసిన బ్యాంక్ ఆఫ్ బరోడా ఈడీ
బ్యాంక్ ఆఫ్ బరోడా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ముంబయి) విక్రమాదిత్యసింగ్ కిచి సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం ప్రారంభించిన రేషన్ బియ్యమందించే 9,260 వాణిజ్య వాహనాలకు తామే అవసరమైన రుణాలను అందజేసినట్లు తెలిపారు.