న్యాయమూర్తులు మారినా న్యాయం మారదు
ఎన్నికల గురించి రాష్ట్ర ప్రభుత్వమే మాట్లాడుతుందా?
అలాగైతే ఎన్నికల కమిషన్ ఎందుకు?
మండిపడ్డ చంద్రబాబు
ఈనాడు, అమరావతి: చట్టాలు కొంతమందికి చుట్టాలు కాదని.. న్యాయమూర్తులు మారినంత మాత్రాన న్యాయం మారదని తెదేపా అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. పంచాయతీ ఎన్నికలను నిర్వహించాల్సిందేనన్న హైకోర్టు తీర్పుపై ఆయన స్పందిస్తూ.. ‘మేజిస్ట్రేట్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు చెక్స్ అండ్ బ్యాలెన్సులు ఉంటాయి. కొన్నిసార్లు ఒక స్థాయిలో పొరపాట్లు జరిగినా పై స్థాయిలో వాటిని చక్కదిద్దుతారు. అంతిమంగా న్యాయం నిలబడుతుంది’ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో స్థానిక ఎన్నికల్లో 25 శాతం ఏకగ్రీవమైన సందర్భాలు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా అని ప్రశ్నించారు. అప్పట్లో కరోనా ఉందని ఎన్నికలను వాయిదా వేస్తే కమిషనరునే మార్చేయాలనుకున్నారని, ఇప్పుడు కరోనా తగ్గాక ఎన్నికలు పెడతామంటే అడ్డుకోవాలని చూస్తున్నారని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఎన్నికల గురించి రాష్ట్ర ప్రభుత్వమే మాట్లాడితే ఎన్నికల కమిషన్ ఎందుకు? రాబోయే రోజుల్లో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలూ తానే పెట్టుకుంటానని జగన్ అంటారేమో’ అని చంద్రబాబు ఎద్దేవా చేశారు. తెదేపా కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు గురువారం విలేకరులతో మాట్లాడారు.
డీజీపీ మోనార్క్‌ను అనుకుంటున్నారా?
డీజీపీ తానో మోనార్క్‌ను అనుకుంటున్నారని.. కోర్టు, ప్రజలు చీవాట్లు పెట్టినా లెక్కలేదని చంద్రబాబు మండిపడ్డారు. సజ్జల రామకృష్ణారెడ్డిని పక్కన పెట్టుకుని ఇష్టానుసారం చేస్తామంటే కుదరదని హెచ్చరించారు. ‘రాష్ట్రంలో ఇండియన్ పీనల్ కోడ్ అమలు చేస్తున్నారా? జగన్ పీనల్ కోడ్ అమలు చేస్తున్నారా? పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి మీ ఇంట్లో ఉన్నాడా? జగన్ ఇంట్లో ఉన్నాడా? అతనిపై రహస్య విచారణ ఎందుకు చేస్తున్నారో? ఎందుకు రాచమర్యాదలు చేస్తున్నారో చెప్పాలి’ అని డీజీపీని నిలదీశారు. కళా వెంకటరావు చేసిన తప్పేంటని, ఆయనను ఎందుకు అరెస్టు చేశారని ప్రశ్నించారు. ఒక ఎస్పీని బహిరంగసభలో తిట్టిన వైకాపా ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డిపై ఎందుకు కేసు పెట్టలేదన్నారు. ‘ముఖ్యమంత్రి, హోం మంత్రి, డీజీపీ ఒకే మతంవాళ్లు ఉంటే ఏం న్యాయం జరుగుతుందని సూటిగానే ప్రశ్నిస్తున్నా. వాళ్లంతా కలసి కుట్ర పన్నుతున్నారు. రాష్ట్రంలో ఓటు బ్యాంకు రాజకీయాల కోసం బలవంతపు మత మార్పిళ్లు జరుగుతున్నాయి. మీరు ఒక మతంపై కక్షగట్టినట్టు ప్రవర్తిస్తుంటే నేను అడిగితే తప్పా? తిరుపతిలో తెదేపా చేపట్టిన ధర్మపరిరక్షణ యాత్రకు అనుమతిచ్చి, మళ్లీ ఎందుకు రద్దు చేశారు’ అని మండిపడ్డారు.
‘రామతీర్థంలో రాముడి విగ్రహానికి శిరచ్ఛేదం చేసిన ఐదో రోజున అక్కడికి వెళ్లా. ప్రతిపక్ష నేత పర్యటనకు అనుమతిచ్చాక.. దానికి రెండు గంటల ముందుగా ఒక కరడుగట్టిన నేరస్థుడిని అక్కడికి పోలీసులు ఎలా అనుమతిస్తారు? రామతీర్థంలో రాముడి విగ్రహం తల తొలగించారని భక్తులు ఆందోళన చేస్తున్నారు. వాళ్లలో ఎవరైనా ఒకరిద్దరు కోపంతో ఏదో చేస్తే.. మాపై కేసులు పెడతారా? నేను అమరావతిలో పర్యటించినప్పుడు ఎవరో రాళ్లు, చెప్పులు విసిరితే వాళ్లు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రైతులు అని డీజీపీ ప్రకటించారు. మరి ఇప్పుడు వైకాపా నేత వాహనంపై ఎవరో రాళ్లు విసిరితే మాపై ఎందుకు కేసులు పెడుతున్నారు?’ అని చంద్రబాబు నిలదీశారు.
మేం ఎవర్నైనా చంపేశామా?
‘69 ఏళ్ల కళా వెంకటరావును రాత్రి పూట అరెస్టు చేశారు. అచ్చెన్నాయుడిని, దేవినేని ఉమాను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్ల చుట్టూ తిప్పారు. మేం సంఘ వ్యతిరేక శక్తులమా? ఎవర్నైనా చంపేశామా? బూతులు మాట్లాడే ఒక రౌడీ మంత్రి.. ఉమాను ఇంటికొచ్చి కొడతాడంట. నన్నేదో చేస్తాడంట. 40 ఏళ్లు రాజకీయాల్లో ఉన్నది మీతో దెబ్బలు తినడానికి కాదు. పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి చాలా అశ్లీలంగా మాట్లాడాడు. అతనికి వీళ్లు వంత పాడుతున్నారు. అలాంటి వాళ్లను ఎంత మందిని పెట్టారో సీఎం చెప్పాలి’ అని చంద్రబాబు మండిపడ్డారు. ‘రాజధాని భూములపై ఎవరూ ఫిర్యాదు చేయకుండానే ఇన్‌సైడర్ ట్రేడింగ్ అని జగన్ హడావుడి చేశారు. ఇప్పుడేమైంది? దిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులతో కేంద్రం పదిసార్లు చర్చించింది. 401 రోజులుగా ఆందోళన చేస్తున్న అమరావతి రైతులతో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మాట్లాడలేదు’ అని నిలదీశారు.
కరోనా తగ్గినా ఎన్నికలను అడ్డుకుంటున్నారు
ఈనాడు డిజిటల్- ఏలూరు, న్యూస్‌టుడే- ఆచంట, పోడూరు: కరోనా విజృంభిస్తున్న సమయంలో ఎన్నికలు నిర్వహించాలని ప్రయత్నించిన ప్రభుత్వం.. ప్రస్తుతం కరోనా లేకున్నా ఎన్నికలను అడ్డుకోవాలని ప్రయత్నిస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. పశ్చిమగోదావరి జిల్లా పోడూరు మండలం కొమ్ముచిక్కాలలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘కరోనా ఉన్నప్పుడు హైదరాబాద్, అమెరికాలలో ఎన్నికలు జరిగాయి.. ప్రస్తుతం నియంత్రణలో ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎన్నికలకు అడ్డుపడాలని ప్రయత్నిస్తోంది. పంచాయతీ ఎన్నికలు జరిగితేనే గ్రామ స్వరాజ్యం సాధ్యమవుతుంది. రాముడి విగ్రహం తల తొలగిస్తే ప్రశ్నించకుండా ఇంట్లో కూర్చోవాలా? తెదేపా ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ధర్మ పరిరక్షణ యాత్ర చేపట్టి ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేస్తాం. ఇతర మతాలపై దాడులు చేస్తున్న వారిని విమర్శిస్తే క్రైస్తవులు ఎందుకు బాధపడతారు? నిజమైన క్రైస్తవులు ఎవరూ బాధపడరు. కావాలనే ప్రభుత్వం మతవిద్వేషాలు రెచ్చగొడుతోంది’ అని ధ్వజమెత్తారు.