గురువారం, ఆగస్టు 06, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

ప్రధానాంశాలు

కొవిడ్‌ మహా ఉద్ధృతి

దేశంలో ఒక్క రోజులో 28 వేల కేసులు
మహారాష్ట్రలో అత్యధికం
ఈనాడు - దిల్లీ

దేశంలో కొవిడ్‌ కేసుల ‘మహా’ ఉద్ధృతి కొనసాగుతోంది. ఎన్నడూ లేనంతగా 24 గంటల్లో 28,637 కొత్త కేసులు నమోదయ్యాయి. 551 మరణాలు సంభవించాయి. ఒక్క మహారాష్ట్రలోనే ఒక్కరోజులో 8,139 కొత్త కేసులు బయట పడగా 223 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో గరిష్ఠ సంఖ్యలో కేసులు నమోదు కావడం వరుసగా ఇది నాలుగోరోజు. గత 3 రోజులుగా రోజూ 26 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం మొత్తం కేసుల సంఖ్య 8,49,553కి చేరింది.

దిల్లీలో కొంత ఊరట..
దేశ రాజధాని దిల్లీలో చాలా రోజుల తర్వాత కొత్త కేసుల సంఖ్య 2వేల కంటే తక్కువగా నమోదైంది. ఆదివారం అక్కడ 1,781 మంది వైరస్‌ పాజిటివ్‌గా తేలారు. దీంతో రోజువారీ కేసుల నమోదులో మూడో స్థానంలో ఉంటూ వచ్చిన దిల్లీ ఇప్పుడు అయిదో స్థానానికి తగ్గింది. ఇక్కడ రికవరీ రేటు కూడా 79.1 శాతానికి చేరింది. ఈ తగ్గుదల మరిన్ని రోజులు స్థిరంగా కొనసాగితే దిల్లీలో పరిస్థితులు మెరుగుపడుతున్నట్లు భావించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లలో ఆదివారం కేసుల ఉద్ధృతి పెరిగింది. జూన్‌ నెలలో దిల్లీలో ఉన్న ప్రమాదకరమైన ఉద్ధృతి ఇప్పుడు కర్ణాటకలో కనిపిస్తోంది. ఈ రాష్ట్రంలో 24 గంటల్లో ఎన్నడూలేనంతగా 2,798 కొత్త కేసులు నమోదు కాగా.. 70మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ రాష్ట్ర ప్రభుత్వం వారం రోజుల పాటు బెంగళూరులో పూర్తి లాక్‌డౌన్‌ ప్రకటించింది. తమిళనాడులో శనివారంతో పోలిస్తే కేసులు పెరిగాయి. ఆంధ్రప్రదేశ్‌లో గతంలో ఎన్నడూ లేనంతగా ఆదివారం కేసులు నమోదయ్యాయి.

* రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, అసోం, బిహార్‌, ఒడిశాల్లోనూ కేసులు పెరుగుతున్నాయి. దాదాపుగా రోజూ గరిష్ఠ సంఖ్యలోనే కేసులు నమోదవుతూ వస్తున్నాయి.
* 10వేల లోపు కేసులున్న పంజాబ్‌, కేరళ, ఛత్తీస్‌గఢ్‌, ఝార్ఖండ్‌, గోవాల్లోనూ పరిస్థితులు ప్రమాదకర స్థితిలోనే కొనసాగుతున్నాయి.
* లక్షకుపైగా కేసులున్న రాష్ట్రాల్లో దిల్లీలోను.. 50 వేలలోపు కేసులున్న రాష్ట్రాల్లో తెలంగాణలోను.. 10 వేల లోపు కేసులున్న రాష్ట్రాల్లో ఉత్తరాఖండ్‌లో మాత్రమే కేసుల సంఖ్య కొంతలో కొంత అదుపులో ఉంది. మిగిలిన అన్ని రాష్ట్రాల్లో రోజువారీ పెరుగుదల ఎక్కువగా కనిపిస్తోంది.
* దేశవ్యాప్తంగా కొవిడ్‌ మరణాల రేటు ఆదివారం నాటికి 2.66%కి చేరింది. ఒక్కరోజులో సంభవించిన కొవిడ్‌ మరణాలు మహారాష్ట్రలోనే అత్యధికం కాగా.. కర్ణాటక, తమిళనాడు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
* దేశంలో ఇంతవరకు కొవిడ్‌ బారిన పడి కోలుకున్నవారు(రికవరీ రేటు) 62.93%. మొత్తం 5.34 లక్షల మందికి పైగా కోలుకున్నారు.


ఉత్తర్‌ప్రదేశ్‌లో వారాంతాల్లో లాక్‌డౌన్‌

లఖ్‌నవూ: కొవిడ్‌ ఉద్ధృతి కొనసాగుతుండటంతో ఉత్తర్‌ప్రదేశ్‌లో ప్రభుత్వం వారాంతాల్లో లాక్‌డౌన్‌ విధించింది. వచ్చే వారం నుంచి ప్రతి శని, ఆదివారాల్లో కఠిన నిబంధనలు అమలవుతాయని రాష్ట్ర ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ రోజుల్లో మార్కెట్లు, కార్యాలయాలను పూర్తిగా మూసివేస్తున్నట్లు చెప్పారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోనూ ఈ లాక్‌డౌన్‌ కొనసాగుతుందని తెలిపారు. రాష్ట్రంలో ఆదివారం నాటికి 35 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని